Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : యానిమల్

By:  Tupaki Desk   |   1 Dec 2023 7:35 AM GMT
మూవీ రివ్యూ : యానిమల్
X

మూవీ రివ్యూ : యానిమల్


నటీనటులు: రణబీర్ కపూర్- రష్మిక మందన్న- అనిల్ కపూర్- బాబీ డియోల్- పృథ్వీ తదితరులు

సంగీతం: ప్రీతమ్-విశాల్ మిశ్రా-మనన్ భరద్వాజ్- శ్రేయస్ పురాణిక్- హర్షవర్ధన్ రామేశ్వర్- జానీ- ఆశిమ్- గురిందర్ సెగల్

నేపథ్య సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్

ఛాయాగ్రహణం: అమిత్ రాయ్

స్క్రీన్ ప్లే: సందీప్ రెడ్డి వంగ-ప్రణయ్ రెడ్డి వంగ- సురేష్ బండారు

నిర్మాతలు: భూషణ్ కుమార్- ప్రణయ్ రెడ్డి వంగ- మురాద్ ఖేతాని- కృష్ణ కుమార్

రచన- కూర్పు - దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగ


అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం రేపిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఓ కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రమే.. యానిమల్. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాలతో ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలు ఏంటో చూద్దాం పదండి.


కథ:


రణ్విజయ్ సింగ్ (రణబీర్ కపూర్) ఇండియాలోనే అతి పెద్ద ధనవంతుడైన బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) కొడుకు. అతడికి తండ్రి అంటే పిచ్చి ప్రేమ. కానీ ఆ ప్రేమని తండ్రి అర్థం చేసుకోడు. విపరీత మనస్తత్వం ఉన్న కొడుకుని తండ్రి దూరం పెడతాడు. మిగతా కుటుంబ సభ్యులు కూడా అతణ్ని అర్థం చేసుకోరు. ఈ పరిస్థితుల్లో తను ప్రేమించిన గీతాంజలి (రష్మిక)ని పెళ్లి చేసుకుని యుఎస్ వెళ్ళిపోతాడు రణ్విజయ్. కానీ కొన్నేళ్ల తర్వాత తండ్రి మీద హత్యా యత్నం జరిగిందని తెలిసి ఇండియాకు వచ్చిన రణ్విజయ్.. తండ్రిని టార్గెట్ చేసిన వ్యక్తుల్ని కనిపెట్టి ఆయన్ని ఎలా కాపాడుకున్నాడు.. వాళ్లపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నది మిగతా కథ.


కథనం-విశ్లేషణ:

అర్జున్ రెడ్డిని ఎవరో వయోలెంట్ ఫిలిం అన్నారని... అసలైన వయోలెన్స్ అంటే ఏంటో తర్వాత సినిమాలో చూపిస్తా అంటూ సందీప్ రెడ్డి వంగ ఓ ఇంటర్వ్యూలో స్టేట్మెంట్ ఇచ్చాడు. యానిమల్ సినిమాలో వయోలెన్స్ చూసి వామ్మో.. వాయ్యో అనుకోకుండా ఉండలేం. వయోలెన్స్ అంటే.. కేవలం కత్తో గన్నో పట్టి రక్తపాతం సృష్టించడం మాత్రమే కాదు... ఇందులో హీరో హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్నా.. తండ్రితో ప్రేమగా మాట్లాడుతున్నా.. తన అక్కకు ఒక భరోసా ఇవ్వాలని చూస్తున్నా.. తన బావతో చిన్న వాదన పెట్టుకున్నా.. అన్నీ కూడా వయోలెన్స్ లాగే అనిపిస్తాయి. నిజంగా హింసాత్మకమైన సన్నివేశాలు చూస్తున్నప్పుడు కూడా రాని ఒక భయం.. ఒక గగుర్పాటు కలుగుతాయి ఇందులో సీన్లు చూస్తుంటే. అర్జున్ రెడ్డినే ఒక ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్ అనుకుంటే... దానికి ఇంకొన్ని రెట్ల ఎక్స్ట్రీమిజం జోడించి... తెరపైన ఒక రకమైన విలయాన్ని సృష్టించాడు సందీప్ రెడ్డి వంగ. ఈ ఎక్స్ట్రీమిజం కొందరికి అర్జున్ రెడ్డిని మించిన కిక్కివ్వొచ్చు. కానీ అదే సమయంలో సగటు ప్రేక్షకులు భరించలేని ఓవర్ డోస్ సీన్లు... డైలాగులు దీని పరిధిని కొంచెం తగ్గించేశాయి. ట్రీట్మెంట్ పరంగా సందీప్ రెడ్డి మార్కు అడుగడుగునా కనిపించే ఈ చిత్రం.. తన వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యే వాళ్లకు వారెవా అనిపిస్తుంది. సాధారణ కథ.. నెమ్మదిగా సాగే కథనం.. సుదీర్ఘ నిడివి.. టూమచ్ వయోలెన్స్.. కొన్ని ఎక్స్ట్రీమ్ సీన్లు - డైలాగుల వల్ల సగటు ప్రేక్షకులు యానిమల్ ను తట్టుకోగలరా అన్నదే ప్రశ్న.

హీరో దేశంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి కొడుకు. అంత మాత్రాన అతను ఏమైనా చేసేయగలడా? కానీ ఇందులో హీరో చేసే విన్యాసాలు.. విధ్వంసాలు మామూలుగా ఉండవు. హీరో స్కూల్లో చదువుకుంటుండగా... కాలేజీలో చదివే తన అక్కను ఎవరో ఏడిపించారంటే తన స్కూల్ డ్రెస్ లోనే పెద్ద మెషిన్ గన్ను పట్టుకుని.. ఆమె క్లాస్ రూమ్ లోకి వెళ్లి టప టపా బుల్లెట్లు పేల్చి అక్కడున్న వాళ్లకు వార్నింగ్ ఇస్తాడు. అంతేకాక తన అక్కను ఏడిపించిన వాళ్లను కారుతో గుద్ది పడేస్తాడు. ఇక అతను పెద్దవాడై తన తండ్రిపై హత్యాయత్నం చేసిన వాళ్ల మీద ప్రతీకారానికి సిద్ధపడ్డాక.. 300 మంది ఒకేసారి గనులు కత్తులు పట్టుకొని దాడికి వస్తే ఒక కస్టమైజ్డ్ మెషిన్ గన్ తయారు చేయించుకుని మరి వాళ్లందరి అంతు చూస్తాడు. ఏ కేజీఎఫ్ లాంటి సినిమాలోనో ఇలాంటి సీన్లు ఉంటే సర్దుకుపోతాం కానీ అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ మూవీ తీసిన సందీప్ రెడ్డి నుంచి వచ్చిన తర్వాతి చిత్రంలో ఇలాంటి సన్నివేశాలు ఒకింత ఇబ్బందికరంగా.. ఇల్లాజికల్ గానే అనిపిస్తాయి. కానీ కమర్షియల్ గా రీచ్ పెంచడానికి లాజిక్కులు పక్కనపెట్టి ఇలాంటి సీన్ల మీద ఆధారపడ్డ సందీప్ రెడ్డి హీరో పాత్ర చిత్రణ పరంగా మాత్రం తన ముద్ర స్పష్టంగా చూపించాడు. అర్జున్ రెడ్డిలో మాదిరి ఇందులో కూడా హీరో పాత్ర చుట్టూనే.. దాని ఆధారంగానే కథ మొత్తం నడుస్తుంది. కాకపోతే ఇక్కడ హీరో పిచ్చి ప్రేమ.. అమ్మాయి మీద కాదు తండ్రి మీద. తండ్రి కొడుకుల బంధం.. భావోద్వేగాలను అనుకున్నంత బలంగా.. ప్రభావవంతంగా చూపించకపోయినప్పటికీ.. హీరో ప్రవర్తన.. తన చర్యలతో ఆ ఇంటెన్సిటీని ఫీల్ అవుతాం. హీరో పాత్రతో కనెక్ట్ అయి దాంతో ట్రావెల్ అవ్వడం మొదలైతే మూడున్నర గంటల నిడివి కూడా అంత కష్టంగా అనిపించదు. అతను ఏం మాట్లాడతాడు.. ఎలా ప్రవర్తిస్తాడు.. ఎప్పుడు ఏం చేస్తాడు.. అనే ఆసక్తి సినిమాను డ్రైవ్ చేస్తుంది.

అర్జున్ రెడ్డిలో మాదిరే నెవర్ బిఫోర్ అనిపించే.. హై ఇచ్చే సరికొత్త సీన్లు యానిమల్ లో చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. కథపరంగా ఆశ్చర్యపరిచే అంశాలు ఏమీ లేకపోయినా.. ఇదొక సగటు రివెంజ్ డ్రామా లాగా అనిపించినా.. ట్రీట్మెంట్లో.. సన్నివేశాల్లో కొత్తదనం ప్రేక్షకుల ఆసక్తిని నిలబెడుతుంది. తండ్రిని పిచ్చిగా ప్రేమించే కొడుకు ఆ తండ్రి వాత్సల్యం దొరక్కపోతే.. ఎంత వైలెంట్ గా తయారవుతాడు అన్నది దర్శకుడు కొన్ని సీన్లలో బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. తండ్రి మీద తన ప్రేమను వ్యక్తం చేయడానికి హీరో ఎంచుకున్న భాష... హింస. అందుకే సినిమా అంతా హింసాత్మకంగా అనిపిస్తుంది. విలన్ల కంటే హీరోని చూస్తేనే అందరూ భయపడే స్థాయిలో ఆ పాత్రను తీర్చిదిద్దారు. సినిమాకు యూఎస్పీ కూడా అదే. అయితే ఫస్టాఫ్ వరకు కథలో కొన్ని మలుపులతో.. అడ్రిలినల్ రష్ ఇచ్చే సీన్లతో కొంచెం వేగంగా సాగిపోయే యానిమల్.. ద్వితీయార్థంలో బాగా నెమ్మదిస్తుంది. హీరో గాయపడి నెమ్మదించడంతో... కథ కూడా నెమ్మదించిన భావన కలుగుతుంది. ఫస్ట్ ఆఫ్ లో వచ్చిన హై కోసం చాలా సేపు ఎదురుచూడాల్సి వస్తుంది. అయితే విలన్ పాత్రను హీరోకు దీటుగా పెక్యులర్ గా డిజైన్ చేసిన దర్శకుడు ఆ ట్రాక్ వరకు ఎంగేజ్ చేయగలిగాడు. ఆ పాత్ర నిడివి.. దాని తాలూకు సన్నివేశాలు ఇంకా పెంచి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అయితే ఆఖర్లో హీరో విలన్ కన్ఫ్రెంటేషన్ సీన్లు బాగానే పేలాయి. ఆరంభంలో చూసిన తండ్రీ కొడుకుల రీప్లే సీన్ ముగింపులో మెరుపులా అనిపిస్తుంది. రోలింగ్ టైటిల్స్ పడగానే కథ ముగిసింది అనుకుంటాం కానీ.. అక్కడి నుంచి ఇంకో ట్విస్ట్ ఇచ్చి.. ఇంకా కొంత కథ నడిపించి తన మార్కు మళ్లీ చూపించాడు సందీప్ రెడ్డి. ఇది సినిమాకు కొసమెరుపులా అనిపిస్తుంది. ఓవరాల్ గా యానిమల్ పక్కా సందీప్ రెడ్డి మార్కు సినిమా. అర్జున్ రెడ్డి అంత పర్ఫెక్ట్ సినిమా కాదు కానీ.. దాన్ని మించిన మ్యాడ్నెస్ ఇందులో ఉంది. కానీ పిచ్చిపిచ్చిగా నచ్చే ఈ సినిమా అందరికీ రుచించకపోవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్.. సంప్రదాయ సినిమా ప్రేమికులకు ఇది రుచించడం కష్టం కావచ్చు.


నటీనటులు:


రణబీర్ కపూర్ లైఫ్ టైం పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. రణబీర్ నటన గురించి చెప్పాల్సి వచ్చినప్పుడల్లా బర్ఫీ గురించి మాట్లాడేవాళ్లు ఇప్పటిదాకా. ఇక నుంచి ముందు యానిమల్ ప్రస్తావన తెస్తారు. ఇంకెవరైనా ఈ పాత్రను ఇంత బాగా చేయగలరా అనిపించే స్థాయిలో రణబీర్ స్టాండ్ అవుట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఫలానా సన్నివేశం అని కాకుండా.. సినిమా అంతటా వావ్ అనిపిస్తూనే ఉంటాడు. రణబీర్ ఒక ట్రాన్స్ లో ఉండి నటిస్తున్నట్లు అనిపిస్తుంది. రష్మిక ఇందులో చాలా కొత్తగా కనిపిస్తుంది. భర్త పడక మీదికి మరో అమ్మాయి వచ్చిందని తెలిసే సన్నివేశంలో ఆమె నటన రణబీర్ కు దీటుగా సాగింది. అనిల్ కపూర్ కథలో కీలకమైన పాత్రలో రాణించాడు. పతాక సన్నివేశాల్లో ఆయన నటన ఉత్తమంగా సాగింది. బాబి డియోల్ విలన్ పాత్రలో ఓకే అనిపించాడు. కానీ ఆ పాత్ర అనుకున్నంత స్థాయిలో లేదు. మిగతా నటీనటులు వాళ్ల వాళ్ల పరిధిలో బాగానే చేశారు.


సాంకేతిక వర్గం:

అర్జున్ రెడ్డితో తనమీద భారీగా అంచనాలు పెంచి.. ఆ తర్వాత నిరాశపరిచిన హర్షవర్ధన్ రామేశ్వర్.. మళ్లీ ఇన్నాళ్లకు అదే స్థాయిలో ఇంకా చెప్పాలంటే.. మరింత ఇంటెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టాడు. నేపథ్య సంగీతం కొన్నిచోట్ల ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తుంది. ఎప్పుడూ వినని సౌండ్స్ ఇందులో వింటాం. హీరో పాత్రను ఎలివేట్ చేయడంలో... సన్నివేశాల్లో గాడతను పెంచడంలో ఆర్ఆర్ కీలక పాత్ర పోషించింది. ఇక హర్షవర్ధన్ సహా అరడజను మందికి పైగా సంగీత దర్శకులు కలిపి అందించిన పాటలు వేటికవే భిన్నంగా... కథకు అవసరమైన స్థాయిలో ఉండి సినిమాకు బలంగా మారాయి. అన్నిట్లోకి నాన్న పాట ప్రత్యేకంగా ఉండి... థియేటర్ నుంచి బయటికి వచ్చాక కూడా వెంటాడుతుంది. అమిత్ రాయ్ ఛాయాగ్రహణం దర్శకుడి అభిరుచి మేరకు సాగింది. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ లెవెల్లో ఉన్నాయి. రైటర్ కం డైరెక్టర్ సందీప్ రెడ్డి తన క్రియేటివిటీకి.. ఎక్స్ట్రీమ్ ఆలోచనలకు హద్దులేమీ పెట్టుకోకుండా... ఎక్కడ రాజీ పడకుండా తాను ఏమనుకుంటే అది రాశాడు... తీశాడు. తన వేవ్ లెంత్ సెట్ అయ్యే వాళ్లకు యానిమల్ విపరీతంగా నచ్చొచ్చు. మిగతా వాళ్లకు ఈ సినిమా సహనాన్ని పరీక్షించేలాను అనిపించవచ్చు. రచయితగా... దర్శకుడిగా సందీప్ రెడ్డి వేరే రకం అని ఈ సినిమాతో మరోసారి రుజువైంది.


చివరగా: యానిమల్... పిచ్చెక్కిస్తాడు


రేటింగ్ - 2.75/5