Begin typing your search above and press return to search.

చిరు కోసం 45 ఏళ్ల తర్వాత ఆ స్టార్‌...!

మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్‌ గారు' సినిమాతో భారీ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. మరో వైపు 'విశ్వంభర' సినిమాతో చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

By:  Ramesh Palla   |   19 April 2026 11:00 PM IST
చిరు కోసం 45 ఏళ్ల తర్వాత ఆ స్టార్‌...!
X

మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్‌ గారు' సినిమాతో భారీ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. మరో వైపు 'విశ్వంభర' సినిమాతో చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. వశిష్ట దర్శకత్వంలో రూపొందిన విశ్వంభర సినిమాకు సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాదిలోనే సినిమా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఇక చిరంజీవి కొత్తగా దర్శకుడు బాబీ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు రెడీ అయ్యాడు. వీరిద్దరిదీ హిట్‌ కాంబో కావడంతో ప్రారంభంకు ముందే అంచనాలు భారీగా పెరిగాయి. పైగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో కేవీఎన్‌ సంస్థ నిర్మించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన చేసింది. ఇప్పటికే సినిమా ప్రారంభం కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతుంది. అయితే ఈ ఏడాదిలోనే మేకింగ్‌ పూర్తి చేయాలని దర్శకుడు బాబీ బలంగా కోరుకుంటున్నాడు.

చిరంజీవి - బాబీ కాంబోలో రెండో మూవీ....

బాబీ ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేశాడు, ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ తుది దశకు చేరుకున్నాయి. నటీనటుల ఎంపిక విషయంలో ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఆసక్తికర వార్త ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్‌ సీనియర్ స్టార్‌ నటుడు అనీల్‌ కపూర్‌ ను ఈ సినిమా కోసం ఎంపిక చేసే యోచనలో దర్శకుడు బాబీ ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆ విషయమై ఎలాంటి క్లారిటీ లేదు. బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఒక స్టార్‌ హీరో సినిమా కోసం అనీల్‌ కపూర్‌ ను సంప్రదించారని, అందుకు అనీల్‌ కపూర్‌ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడని తెలుస్తోంది. అందుకు గాను అనీల్‌ కపూర్ అత్యధిక రెమ్యూనరేషన్‌ కోట్‌ చేశాడని, ఆ నిర్మాణ సంస్థ ఆ మొత్తంను ఇచ్చేందుకు ఓకే చెప్పడం కూడా జరిగిందని బాలీవుడ్‌ మీడియా వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.

అనీల్ కపూర్‌ ముఖ్య పాత్రలో చిరంజీవి మూవీ...

బాబీ సినిమా అంటే బాలీవుడ్‌లోనూ ఆసక్తి ఉంది. అందుకే చిరు 158 సినిమాకు బాలీవుడ్‌ కాస్ట్‌ టచ్ ఇస్తే కచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దర్శకుడు బాబీ గతంలో చేసిన సినిమాలను పరిశీలిస్తే విలన్‌ పాత్రలకు, ఇతర పాత్రలకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. అందుకే అనీల్‌ కపూర్‌ వంటి బాలీవుడ్‌ స్టార్‌ ను ఎంపిక చేయడం వల్ల కచ్చితంగా ఆయనకు అత్యంత ప్రాధాన్యత ఉండే పాత్ర ఇచ్చే అవకాశం ఉందనే టాక్‌ వినిపిస్తుంది. బాలీవుడ్‌లో సినిమాకు బిజినెస్ జరగాలి అంటే అనీల్ కపూర్‌ వంటి స్టార్‌ ఉండాలి అనేది కొందరి మాట.

దర్శకుడు బాబీ మార్కెట్‌ గురించి ఆలోచించి అనీల్‌ కపూర్‌ ను ఎంపిక చేయాలి అనుకున్నాడా లేదంటే ఆయన కథకు అవసరం కనుక ఎంపిక చేయాలి అనుకుంటున్నాడా అనేది తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యే వరకు వెయిట్‌ చేయాల్సిందే. అనీల్ కపూర్ హీరోగా తెలుగు సినిమాతోనే ఎంట్రీ ఇచ్చారు. 1980లో వంశ వృక్షం అనే సినిమాతో అనీల్‌ కపూర్‌ హీరోగా మారాడు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత అనీల్‌ కపూర్ చిరంజీవి మూవీలో కనిపించబోతున్నారు. దాదాపుగా 45 ఏళ్ల తర్వాత అనీల్ కపూర్ టాలీవుడ్‌ మూవీలో కనిపించబోతున్నారు. ఎన్టీఆర్‌ డ్రాగన్‌ మూవీలోనూ అనీల్‌ కపూర్ నటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆ విషయమై ఎలాంటి క్లారిటీ లేదు.

వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత...

మెగాస్టార్‌ చిరంజీవి, బాబీ కాంబోలో ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమా వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా మాస్ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల వారిని మెప్పించింది. ముఖ్యంగా అభిమానులు బాస్ ను ఎలా చూడాలి అనుకుంటున్నారో అలాగే చూపించడం జరిగింది. అందుకే వాల్తేరు వీరయ్య విడుదలైనప్పటి నుంచి వీరి కాంబోలో మరో మూవీ అనే వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లకు మళ్లీ కాంబో రిపీట్‌ అయింది. ఈ సినిమాను కేవీఎన్‌ బ్యానర్ నిర్మిస్తున్న కారణంగా ఆలస్యం అవుతూ వస్తోంది. ఇదే బ్యానర్‌లో నిర్మాణం జరిగిన జన నాయగన్‌ విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అలాగే టాక్సిక్ సినిమాను సైతం ఇదే బ్యానర్ నిర్మించింది.

ఈ రెండు సినిమాలు విడుదల సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఈ సినిమాలు విడుదల అయితే తప్ప చిరంజీవి - బాబీ మూవీని వీళ్లు ముందుకు తీసుకు వెళ్లలేరేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఆ సినిమాలతో సంబంధం లేకుండా అతి త్వరలోనే ఈ సినిమా ప్రారంభం అవుతుందని, ఇదే ఏడాది షూటింగ్‌ పూర్తి చేస్తారని కొందరు అంటున్నారు. ఏం జరుగుతుందో తెలియాలంటే బాబీ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.