టాలీవుడ్ హీరోతో బాలీవుడ్ యాక్టర్ చేయబోయే మూడో సినిమా అదేనా?
కెజిఎఫ్ వచ్చినప్పటి నుంచి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే బావుండని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుకుంటూనే ఉన్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 16 Jan 2026 12:39 PM ISTసినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. గతంలో వర్క్ చేసిన వాళ్లు కలిసి మరోసారి వర్క్ చేస్తున్నా లేదా ఏదైనా ఊహించని కాంబినేషన్ సెట్ అయినా ఆ సినిమాకు మొదటి నుంచే భారీ క్రేజ్ ఉంటుంది. అలాంటి క్రేజ్ తో వచ్చిన సినిమాలకు ఓపెనింగ్స్ కూడా చాలా భారీగానే ఉంటాయి. అలాంటి కాంబినేషన్లలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కూడా ఒకటి.
కెజిఎఫ్ వచ్చినప్పటి నుంచి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే బావుండని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుకుంటూనే ఉన్నారు. ఫ్యాన్స్ చాలా బలంగా కోరుకున్నట్టున్నారు అందుకే ఈ కాంబినేషన్ కుదిరి సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఇప్పటికే పలు షెడ్యూళ్ల షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. నీల్, ఎన్టీఆర్ కు మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉండటం వల్ల ఈ మూవీకి బాగా హైప్ వచ్చింది.
డ్రాగన్ లో అనీల్ కపూర్
ఎన్టీఆర్‌నీల్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి బాలీవుడ్ యాక్టర్ అనీల్ కపూర్ ఓ అప్డేట్ ను ఇచ్చారు. ఈ సినిమాలో తాను నటిస్తున్నట్టు స్వయంగా ఆయనే ఇన్‌స్టా పోస్ట్ ద్వారా తెలిపారు. డ్రాగన్ లో అనీల్ కపూర్ నటిస్తున్నట్టు గతంలోనే వార్తలొచ్చినప్పటికీ ఇప్పుడాయనే కన్ఫర్మ్ చేయడంతో అందరికీ క్లారిటీ ఇచ్చినట్టైంది.
వార్2లో ఎన్టీఆర్ తో కలిసి నటించిన అనీల్ కపూర్
ఇప్పటికే ఎన్టీఆర్- అనీల్ కపూర్ కలిసి వార్2 అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వార్2 సినిమా ఫ్లాప్ గా నిలిచినప్పటికీ ఆ మూవీ ద్వారా ఎన్టీఆర్ కు బాలీవుడ్ లో ఫాలోయింగ్ అయితే పెరిగింది. వార్2 తర్వాత ఎన్టీఆర్ తో అనీల్ కపూర్ చేస్తున్న రెండో సినిమా డ్రాగన్. యానిమల్ తర్వాత అనీల్ కపూర్ సౌత్ డైరెక్టర్ తో కలిసి చేస్తున్న సినిమా కూడా ఇదే.
మరో సినిమా కూడా!
డ్రాగన్ కాకుండా ఎన్టీఆర్ తో కలిసి మరో సినిమా కూడా చేయబోతున్నట్టు కపూర్ ఆ పోస్ట్ లో స్పష్టం చేశారు. అయితే ఆ మూడో సినిమా ఏంటనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. కాగా అనీల్ పోస్ట్ ను చూసి కొందరు ఆ మూడో సినిమా యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్ చేయబోయే స్టాండలోన్ ఫిల్మ్ అని అంటున్నారు. కానీ ఇంకా ఆ సినిమా గురించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోవడంతో అనీల్ చెప్పింది అదేనని కన్ఫర్మ్ చేయలేం. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
