Begin typing your search above and press return to search.

రండి.. పెట్టుబ‌డి పెట్టండి.. సినిమా స్టూడియోల‌కు భూమిలిస్తాం : ఏపీ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కందుల‌

శివాజీ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన మంత్రి కందుల దుర్గేష్, ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త ఇండ‌స్ట్రీ స్థాపనకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటామంటూ చిత్ర పరిశ్రమకు ఒక అద్భుతమైన హామీని ఇచ్చారు.

By:  Sivaji Kontham   |   16 July 2026 12:24 AM IST
రండి.. పెట్టుబ‌డి పెట్టండి.. సినిమా స్టూడియోల‌కు భూమిలిస్తాం : ఏపీ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కందుల‌
X

ఆంధ్రాలో మ‌రో సినీప‌రిశ్ర‌మ ప్రారంభ‌మ‌య్యేదెప్పుడు? ఈ శేష ప్ర‌శ్న‌కు ఇప్ప‌టికి ఇంకా స‌రైన స‌మాధానం లేదు! అడ‌పాద‌డ‌పా రాజ‌కీయ నాయ‌కుల డిప్ల‌మాటిక్ ప్ర‌క‌ట‌న‌లు త‌ప్ప సొంత సినీప‌రిశ్ర ఏపీలో నిజ‌రూపం దాల్చేది క‌నిపించ‌డం లేదు!

ఇంత‌లోనే ఇప్పుడు ఈ ప్ర‌క‌ట‌న‌. ఆంధ్రప్రదేశ్‌లో అడుగడుగునా ప్రతిభావంతులైన కళాకారులు ఉన్నారని, ఇక్కడి యువతలో అపారమైన ఉత్సాహం దాగి ఉందని నటుడు శివాజీ లెనిన్ స‌క్సెస్ వేదిక‌పై సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కందుల‌కు గుర్తు చేయ‌డం విశేషం. ఏపీలో కూడా మరో సినీ పరిశ్రమను ఎంతగానో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, ఇందుకు ప్రభుత్వం చొరవ చూపాలని ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను శివాజీ బ‌హిరంగ వేదిక‌పై అభ్యర్థించారు. శివాజీ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన మంత్రి కందుల దుర్గేష్, ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త ఇండ‌స్ట్రీ స్థాపనకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటామంటూ చిత్ర పరిశ్రమకు ఒక అద్భుతమైన హామీని ఇచ్చారు.

ఇటీవల భారీ విజయం సాధించిన అక్కినేని అఖిల్ చిత్రం 'లెనిన్' విజయోత్సవ సభలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ ఈ వేదికపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తెలుగు నేలపై తెలుగు చలనచిత్ర పరిశ్రమను అగ్రపథంలో నిలపాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా నిలుస్తామని ఆయన ప్రకటించారు.

ఏపీలో సినిమా రంగాన్ని విస్తరించడానికి చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ముందుకు రావాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టే నిర్మాతలకు, దర్శకులకు `సింగిల్ విండో` విధానం ద్వారా అత్యంత సులభంగా, వేగంగా అన్ని రకాల అనుమతులు మంజూరు చేస్తామని ఆయన ప్రామిస్ చేశారు. నటుడు శివాజీ కోరినట్లుగా.. ఎవరైనా ఏపీలో అధునాతన సినిమా స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు, అత్యాధునిక రీ-రికార్డింగ్ థియేటర్లను నిర్మించాలనుకుంటే ప్రభుత్వం తరఫున వారికి అవసరమైన భూములను కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి ప్రకటించారు.

త్వరలోనే ఏపీలో షూటింగ్‌లు, సినిమా నిర్మాణాలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తూ ప్రముఖ నిర్మాత నాగవంశీ కోరిన విధంగా ఒక ప్రత్యేక జీవో (GO) ను తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో విజయవాడ - గుంటూరు నడుమ, అలాగే తూర్పున‌ వైజాగ్, ప‌డ‌మ‌ట‌న‌ తిరుపతి ప్రాంతాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలతో కూడిన స్థిరమైన, బలమైన చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిబ‌ద్ధ‌త‌తో ఉందని స్పష్టం చేశారు. పరిశ్రమ అభివృద్ధికి పెట్టుబడిదారులంతా తరలిరావాలని కోరారు.

ఇక ఈ సక్సెస్ మీట్ వేదికగా చిత్ర బృందానికి మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. చిత్తూరు గ్రామీణ నేపథ్యాన్ని, మహాభారత ఘట్టాలను మిళితం చేస్తూ ఇంతటి రస్టిక్ విజువల్ వండర్‌ను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడి ప్రతిభను కొనియాడారు. యువ హీరో అఖిల్ అక్కినేని మునుముందు మరిన్ని భారీ విజయాలు అందుకోవాలని, బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధించే అగ్ర హీరోగా ఎదగాలని ఆకాంక్షించారు. చిత్ర నిర్మాణంలో భాగస్వాములైన కింగ్ నాగార్జునకు, నిర్మాతలకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.