వయసును వాడుకుని నన్ను తగ్గించలేరు.. మీరు అసూయ పడుతూనే ఉండండి: అనసూయ
శివాజీ వ్యాఖ్యల వివాదం కొనసాగుతుండగానే యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా మరోసారి చాలా ఘాటుగా స్పందించారు.
By: Tupaki Desk | 25 Dec 2025 10:59 AM ISTశివాజీ వ్యాఖ్యల వివాదం కొనసాగుతుండగానే యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా మరోసారి చాలా ఘాటుగా స్పందించారు. ఈసారి ఆమె తన వయసును ప్రస్తావిస్తూ ట్రోల్ చేస్తున్న వారికి, తనను తక్కువ చేసి మాట్లాడుతున్న వారికి గట్టి సమాధానం ఇచ్చారు. ఈ మేరకు ఆమె ఒక నోట్ ను విడుదల చేస్తూ, సమాజంలో మహిళల పట్ల ఉన్న ధోరణిని ఎండగట్టారు.
కొంతమంది పురుషులు, చివరకు కొంతమంది మహిళలు కూడా తన వయసును అడ్డం పెట్టుకుని తనను చిన్నచూపు చూడటానికి ప్రయత్నిస్తున్నారని అనసూయ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి మనస్తత్వం ఉన్నవారు ఎక్కువగా ప్రగతిశీల భావాలు ఉన్న మహిళలనే టార్గెట్ చేస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళలపై తమకున్న పట్టు కోల్పోతామన్న భయం, తమ బలహీనమైన పితృస్వామ్య అహంకారాన్ని పోషించుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.
అయితే తాను అందరు పురుషులను లేదా అందరు మహిళలను ఉద్దేశించి ఈ మాటలు అనడం లేదని అనసూయ క్లారిటీ ఇచ్చారు. ప్రజలందరూ దయచేసి విశాలంగా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. పాత తరాల నుంచి నేర్చుకున్నవి లేదా అలవాటుపడ్డ ఆలోచనలనే మనం తప్పనిసరిగా ముందుకు మోసుకెళ్లాల్సిన అవసరం లేదని, మార్పును ఆహ్వానించాలని సూచించారు.
మనం మార్పును ఎంచుకోవచ్చని, మన గౌరవాన్ని, మన స్వేచ్ఛను మనమే కాపాడుకోవచ్చని ఆమె హితవు పలికారు. ఒకరినొకరు కించపరచుకోవడం మానేసి, ఒకరికొకరం శక్తినిస్తూ మద్దతుగా నిలవాలని కోరారు. అంతిమంగా మన విలువ అనేది మనం చేసుకున్న ఎంపికల నుంచే వస్తుంది తప్ప, మరే అంశం నుంచి కాదని ఆమె స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఓ వర్గం మీడియా తీరుపై కూడా అనసూయ అసహనం వ్యక్తం చేశారు. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, తప్పుడు విషయాలను సమర్ధించడం ఏమాత్రం సమంజసం కాదని చురకలు అంటించారు. బయట ఎన్ని జరుగుతున్నా, ఎవరు ఏం అనుకుంటున్నా తాను మాత్రం తలెత్తుకొనే ఉంటానని, దేనివల్లా తాను ప్రభావితం కానని, ఎప్పటికీ బలంగానే నిలబడతానని తేల్చి చెప్పారు.
చివరగా తనదైన శైలిలో ఒక హిందీ కొటేషన్ తో ఆమె తన నోట్ ను ముగించారు. "మీరు మీ అసూయను అలాగే కొనసాగించండి.. మేము మా జల్వాని అలాగే కొనసాగిస్తాం" అంటూ తనను విమర్శించే వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇన్నాళ్లుగా సమాజంలో వినిపించని ఒక వర్గం గొంతుకగా తాను మాట్లాడుతున్నానని అనసూయ పేర్కొన్నారు.
