దేశం మొత్తంలో అనంతిక ఒక్కదానికే ఆ టాలెంట్
బ్లాక్ బస్టర్ మ్యాడ్ సినిమాతో తెలుగు సినిమాలోకి అడుగుపెట్టిన అనంతిక సనిల్ కుమార్ కు పట్టుమని 20 ఏళ్లు కూడాలేవు.
By: Tupaki Desk | 18 Jun 2025 3:36 PM ISTబ్లాక్ బస్టర్ మ్యాడ్ సినిమాతో తెలుగు సినిమాలోకి అడుగుపెట్టిన అనంతిక సనిల్ కుమార్ కు పట్టుమని 20 ఏళ్లు కూడాలేవు. కానీ అనంతిక ఇప్పుడు 8 వసంతాలు సినిమాలో చాలా మెచ్యూర్డ్ రోల్ ను చేసి అందరి ప్రశంసల్నీ అందుకుంటుంది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో అనంతిక చేసిన 8 వసంతాలు సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా ఆ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
8 వసంతాలు చూశాక ప్రతీ ఒక్కరూ అనంతిక చేసిన సుద్ధి అయోధ్య పాత్రతో ప్రేమలో పడతారని, అమ్మాయిలు అయితే అయోధ్యలా ఉండాలనుకుంటారని, అబ్బాయిలైతే అయోధ్య లాంటి అమ్మాయి తమ జీవితంలో ఉండాలనుకుంటారని, అనంతిక చేసిన పాత్ర గురించి చిత్ర యూనిట్ మొత్తం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆకాశానికెత్తేశారు.
అయోధ్య పాత్రను తాను పోషించగలనని తనపై నమ్మకం ఉంచినందుకు డైరెక్టర్ ఫణీంద్రకు థ్యాంక్స్ చెప్పిన అనంతిక, తన కెరీర్లో అయోధ్య లాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ ను చేస్తానని ఎప్పుడూ అనుకోలేదని, ప్రేమతో పాటూ, యాక్షన్, ఎమోషన్స్ అన్నీ ఉండే పాత్రలో తాను కనిపించానని, ఇలాంటి పాత్ర చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అనంతిక తెలిపింది.
సినిమాలోని అయోధ్య క్యారెక్టర్ కు డీప్ గా కనెక్ట్ అయిన అనంతిక ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ కూడా వద్దనుకుందట. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం ఎంతో కష్టమని, ప్రతీ అవసరానికీ డబ్బే కావాలని తెలిసి కూడా అనంతిక డబ్బు వద్దనుకోవడం చాలా గ్రేట్ అని, ఈ సినిమా కోసం తాను ప్రాణం పెట్టిందని డైరెక్టర్ ఫణీంద్ర ఈ సందర్భంగా అనంతికను ప్రశంసించాడు.
అయోధ్య సుద్ధి క్యారెక్టర్ కోసం క్లాసికల్ డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్ తెలిసి ఉన్న అమ్మాయి కావాలని దేశం మొత్తం వెతికితే తమకు అనంతిక మాత్రమే కనపడిందని, సినిమాలోని అయోధ్య పాత్రకు అనంతిక ప్రాణం పోసిందని నిర్మాత రవిశంకర్ అన్నారు. డైరెక్టర్, నిర్మాతలే కాకుండా ఈవెంట్ కు హాజరైన ప్రతీ ఒక్కరూ అనంతిక టాలెంట్ గురించి, యాక్టింగ్ గురించి తెగ ప్రశంసించారు. మరి అనంతిక 8 వసంతాలు సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
