Begin typing your search above and press return to search.

సరస్వతీ పుత్ర.. అనంత్ శ్రీరామ్ ఒపీనియన్ ఏంటి?

ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ ఇటీవల రోజుల్లో వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు.

By:  M Prashanth   |   12 March 2026 7:00 PM IST
సరస్వతీ పుత్ర.. అనంత్ శ్రీరామ్ ఒపీనియన్ ఏంటి?
X

ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ ఇటీవల రోజుల్లో వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. హీరో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలోని రై రే రా రా సాంగ్ కు మంచి రెస్పాన్స్ రావడంతో అనంత శ్రీరామ్ పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ సమయంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి.

ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గురించి మాట్లాడిన అనంత శ్రీరామ్ ఆయనపై ప్రశంసలు కురిపించారు. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన స్టార్ అయినప్పటికీ ఎంతో కష్టపడతారని పేర్కొన్నారు. నేటి టెక్నాలజీ కాలంలో ఫేస్ స్వాప్ వంటి వివిధ టెక్నాలజీలు ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించకుండా యాక్షన్ సన్నివేశాల్లో స్వయంగా పాల్గొనడం నిజమైన హీరో లక్షణమని ఆయన అన్నారు.

ఆ కామెంట్స్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు తమ సన్నివేశాలు తామే చేస్తుంటారని, ఒకరిని పొగిడే క్రమంలో ఇతర హీరోలను తగ్గించి చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. మరికొందరు మాత్రం.. అనంత్ శ్రీరామ్ తన అభిప్రాయాన్ని మాత్రమే చెప్పారని, ఎవరినీ తక్కువ చేసి మాట్లాడలేదని మద్దతు పలికారు.

తాజాగా మరో ఇంటర్వ్యూలో అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. సరస్వతీ పుత్ర అనే పదం గురించి మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను కొందరు సరస్వతీ పుత్ర అని పిలిచారని, ఇప్పుడుహోస్ట్ కూడా అన్నారని గుర్తు చేశారు. కానీ తాను అలాంటి ట్యాగ్ లైన్ కు అర్హులు కాదని చెప్పారు. తాను సరస్వతీ పుత్రుడిని కాదని, పావనీ పుత్రుడిని అని వ్యాఖ్యానించారు.

అదే సమయంలో సరస్వతీ పుత్ర అనే ట్యాగ్ లైన్ అందరికీ ఉపయోగించకూడదని ఆయన అభిప్రాయపడడం గమనార్హం. అలాంటి ట్యాగ్ లైన్ ఉండాలంటే ఓ రేంజ్ లో టాలెంట్ ఉండాలని.. శ్రీరంగం శ్రీనివాసరావు వంటి పలువురు మాత్రమే అర్హులవుతారని పేర్కొన్నారు. దీంతో అనంత్ శ్రీరామ్ కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారి తీశాయి.

ఎందుకంటే ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రిని సరస్వతీ పుత్ర అని అంతా పిలుస్తుంటారు. దీంతో అనంత్ శ్రీరామ్.. ఆయనను ఉద్దేశించి మాట్లాడారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తాను ఆ బిరుదుకు అర్హుడు కాదని మాత్రమే చెప్పాల్సి ఉండగా, ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. అవి అవసరం లేని వివాదాలకు దారితీస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు.

అదే సమయంలో అనంత్ శ్రీరామ్.. రామ జోగయ్య శాస్త్రిని ఉద్దేశించి అనలేదని మరికొందరు అంటున్నారు. శ్రీరంగం శ్రీనివాసరావు కాకుండా మరికొందరు అర్హులని అన్నట్లు గుర్తు చేస్తున్నారు. అందులో రామ జోగయ్య శాస్త్రి ఉండొచ్చని చెబుతున్నారు. కేవలం తనను పిలిచినందుకు.. అనంత్ శ్రీరామ్ వివరణ ఇచ్చినట్లు ఉన్నారని, రామ జోగయ్య శాస్త్రిని అనలేదని అంటున్నారు. దీనిపై మళ్లీ అనంత్ శ్రీరామ్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.