అన్న జోరు తమ్ముడిలో కనపడట్లేదా..?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ క్రేజీ లైనప్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆల్రెడీ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో `కింగ్‌డమ్` మూవీని కంప్లీట్ చేశాడు.
By: Tupaki Desk | 15 May 2025 7:00 AM ISTటాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ క్రేజీ లైనప్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆల్రెడీ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో `కింగ్‌డమ్` మూవీని కంప్లీట్ చేశాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా జూన్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కింగ్‌డమ్ రిలీజ్‌కు ముందు విజయ్ మరో రెండు కొత్త ప్రాజెక్ట్స్ కు కమిట్ అయ్యాడు. అందులో ఒకటి `రౌడీ జనార్ధన్`. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి `రాజావారు రాణి వారు` ఫేం రవి కిరణ్ డైరెక్టర్ కాగా.. దిల్ రాజు నిర్మాత.
అలాగే `ట్యాక్సీవాలా`, `శ్యామ్ సింగరాయ్` వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్, విజయ్ దేరవకొండ కాంబోలో ఒక సినిమా రాబోతుంది. మైత్రీ బ్యానర్‌లో `VD 14` వర్కింగ్ టైటిల్ తో ఇటీవలె ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. డిఫరెంట్ జానర్స్ చాలా సెలెక్టివ్ గా కథలను ఎంపిక చేసుకుంటూ విజయ్ యమా జోరు చూపిస్తున్నారు. కానీ అన్న జోరు తమ్ముడు ఆనంద్ దేవరకొండలో మాత్రం కనపడట్లేదన్న వాదన వినిపిస్తోంది.
అమెరికాలో ఉద్యోగం మానేసి మరీ విజయ్ తమ్ముడిగా సినీ గడప తొక్కాడు ఆనంద్ దేవరకొండ. పీరియాడికల్ లవ్ స్టోరీ `దొరసాని`తో హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా కమర్షియల్‌గా ఫ్లాప్ అయినప్పటికీ.. ఉత్తమ డెబ్యూ హీరోగా ఆనంద్ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత `మిడిల్ క్లాస్ మెలోడీస్`, `పుష్పక విమానం`, `హైవే`, `బేబీ`, `గమ్ గమ్ గణేశ` వంటి చిత్రాలు చేశాడు. వీటిల్లో మిడిల్ క్లాస్ మెలోడీస్ క్లాసిక్ హిట్ ఇవ్వగా.. బేబీ మూవీ ఆనంద్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన గమ్ గమ్ గణేశ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
అప్పటి నుంచి ఆనంద్ స్లో అయ్యాడు. కథల ఎంపికలో వేగం తగ్గించాడు. గతంలో మిథున్ వరదరాజ కృష్ణన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ `డ్యూయెట్` అనే మూవీని ప్రకటించాడు. రితికా నాయక్ ఇందులో హీరోయిన్‌గా ఎంపిక అయింది. 2023లోనే ఈ మూవీ స్టార్ట్ అయినా ఇంతవరకు విడుదలకు నోచుకోలేదు. అసలు డ్యూయెట్ అనే చిత్రం ఉందా? ఆగిపోయిందా? అన్న సంగతి కూడా తెలీదు. ఇకపోతే ఈటీవీ విన్‌లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన `90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్` కు సీజన్ 2 తెరకెక్కించాలని డైరెక్టర్ ఆదిత్య హాసన్ రెడీ అయ్యారు. అయితే సీజన్ 2ను వెబ్ సిరీస్ గా కాకుండా సినిమాగా తీస్తున్నారు. అందులో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ మినహా ఆనంద్ దేవరకొండ చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు. మరి కెరియర్ విషయంలో ఆనంద్ కావాలనే జోరు తగ్గించి జాగ్రత్తగా వెళ్తున్నాడా? లేక తన ఇమేజ్ కు సరిపడే కథలు రావడం లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
