'అనకాపల్లి' మూవీ రివ్యూ
అనకాపల్లి అనే టైటిల్ పెట్టుకొని రిలీజ్ కి ఒక నెల రోజులు ముందే కేవలం అనకాపల్లిలోనే రిలీజ్ అయిన సినిమా.. ఇప్పుడు అధికారికంగా అన్ని చోట్లా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
By: Tupaki Desk | 2 Oct 2026 10:53 PM ISTనటీనటులు: విక్రమ్ సాహిదేవ్- సంధ్య వశిష్ఠ- తారక్ పొన్నప్ప- త్రినాథరావు నక్కిన- ఇంద్రజ, బాషా- కాండ్రేగుల నాయుడు- జబర్దస్త్ సత్యశ్రీ తదితరులు
సంగీతం: దేవ్ జండ్
ఛాయాగ్రహణం: మాయ
నిర్మాత: కాండ్రేగుల నాయుడు- త్రినాథ రావు నక్కిన
దర్శకత్వం: ఖగేష్ తమ్మినేని
స్టార్ డైరెక్టర్ త్రినాథరావు కథ అందిస్తూ స్వయంగా నిర్మించిన సినిమా.. అనకాపల్లి. విక్రమ్ సాహిదేవ్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
అనాకపల్లిలో సాంబశివరావు (త్రినాథ రావు నక్కిన) గొడవలకు దూరంగా ఉంటూ.. నిజాయితీగా.. సింపుల్ గా బతికే మిడిల్ క్లాస్ వ్యక్తి . ఆయన కొడుకు సూర్య (విక్రమ్ సాహిదేవ్) తండ్రికి పూర్తి భిన్నం. తనకు గొడవలు అంటే ఇష్టం. తనకంటూ పేరు, గౌరవం రావాలని భావిస్తాడు. ఓ రోజు అనకాపల్లి లోకల్ రౌడీ బుల్లెట్ (తారక్ పొన్నప్ప) రేంజ్ చూసి ఎలాగైనా అతని పక్కన చేరాలి అని ఫిక్స్ అవుతాడు. అనుకున్నట్లే బుల్లెట్ పక్కన చేరి తన రైట్ హ్యాండ్ గా ఎదుగుతాడు. ఇది తల్లిదండ్రులకు నచ్చకపోవడంతో గొడవపడి ఇంటి నుంచి వచ్చేస్తాడు సూర్య. ఈ మధ్యలో అతను అమృత (సంధ్య)ను చూసి ఇష్టపడతాడు. తనకు దగ్గరయ్యాక తన ప్రేమను చెబుదాం అనుకునే సమయానికే ఆమె సూర్యకి పెద్ద షాక్ ఇస్తుంది. మరి అమృత ఇచ్చిన షాకేంటి.. సూర్య ప్రేమ ఏమవుతుంది.. రౌడీగా మారడంతో సూర్యకు వచ్చిన కష్టాటేంటి.. అతను మళ్ళీ అమ్మానాన్నలకు దగ్గరవుతాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
హీరో రౌడీయిజానికి ఆకర్షితుడై తానూ అలా ఎదగాలనుకోవడం.. ఈ లైన్ చూడగానే తెలుగు ప్రేక్షకులకు ఆటోమేటిగ్గా సుకుమార్ సినిమా జగడం గుర్తుకొస్తుంది. ఐతే ఈ లైన్ మీద మరి కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. అనకాపల్లి కూడా ఆ లైన్ మీద నడిచే సినిమానే కానీ.. రౌడీయిజానికి ఒక లవ్ స్టోరీని జోడించి రెంటినీ బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశారు అనకాపల్లి మేకర్స్. ఎంటర్టైనర్లకు పేరుపడ్డ త్రినాథరావు నక్కిన అందించిన కథతో కొత్త దర్శకుడు ఖగేష్ ఈ సినిమాను రా అండ్ రస్టిగ్గా తీర్చిదిద్దాడు. కథ అంత కొత్తగా అనిపించదు కానీ.. కొన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లకు తోడు బలమైన ఎమోషన్లు.. కొంతమేర కమర్షియల్ హంగులతో పర్వాలేదనిపిస్తుంది. పెర్ఫామెన్సులు హైలైట్ గా నిలిచిన అనకాపల్లి ఒకసారి చూడ్డానికి ఢోకా లేని చిత్రమే.
అనకాపల్లి ఆరంభంలో కొంచెం నెమ్మదిగానే అనిపిస్తుంది. సూర్య పాత్ర.. అతని ఫ్యామిలీ పరిచయం.. బుల్లెట్ పాత్ర ఎంట్రీ... తన దగ్గర చేరి సూర్య రౌడీగా ఎదిగే సన్నివేశాలు సోసోగా సాగుతాయి. ఇంకోవైపు హీరోయిన్ తో లవ్ ట్రాక్ ఓకే అనిపిస్తుంది. ఇందులో కొన్ని క్యూట్ మూమెంట్స్ ఆకట్టుకుంటాయి. తొలి గంటలో ఒక మోస్తరుగా అనిపించే అనకాపల్లి ఇంటర్వెల్ దగ్గర ప్రేక్షకుల అటెన్షన్ రాబడుతుంది. ఎవరూ ఊహించని ఓ ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. ఐతే సెకండాఫ్ పూర్తి సీరియస్ గా మారిపోవడం.. నిడివి ఎక్కువైపోవడంతో కొంచెం భారంగా అనిపిస్తుంది. కానీ కథను మాత్రం కొంచెం బలంగానే నడిపించారు. ఎమోషన్లు కూడా పండాయి. రౌడీయిజం వల్ల వచ్చే నష్టాలు, హీరో ఎదుర్కొనే సంఘర్షణ చుట్టూ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ బాగుంది కానీ.. ఆల్రెడీ నిడివి ఎక్కువైన ద్వితీయార్దంలో ఇది మరింత లెంగ్త్ అనిపిస్తుంది. ముగింపులో ఎమోషన్ పండింది.
హీరో హీరోయిన్ల మధ్య లవ్ కాన్ఫ్లిక్ట్ బలంగా ఉన్న అనకాపల్లిలో కథ మాత్రం రొటీన్ అనిపిస్తుంది. రౌడీయిజం చుట్టూ నడిచే వ్యవహారమంతా చాలా సినిమాల్లో చూసిందే. హీరో రౌడీయిజం మీద మోజుపడడం చూడగానే ఈ కథకు ఎలాంటి ముగింపు ఉంటుందో ఒక అంచనా వచ్చేస్తుంది. సినిమాలో కొన్ని పాత్రలు మొక్కుబడిగా అనిపిస్తాయి. అనవసర సన్నివేశాలు, ఐటెం సాంగ్ లాంటివి కట్ చేసి.. ఈ కథను ఇంకొంచెం క్రిస్ప్ గా చెబితే బాగుండేది. తారక్ పొన్నప్పను ఇంకా బాగా వాడుకోవాల్సింది. ఐతే కొన్ని ఎపిసోడ్లు బాగుండడం.. పెర్ఫామెన్సులు ఆకట్టుకోవడం.. మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉండడం వల్ల అనకాపల్లికి పాస్ మార్కులు పడతాయి.
నటీనటులు:
విక్రమ్ సాహిదేవ్ బాగా చేశాడు. తన నటనలో పరిణతి వచ్చింది. ప్రేమ సన్నివేశాల్లో క్యూట్ గా.. యాక్షన్ సన్నివేశాల్లో ఇంటెన్స్ గా పెర్ఫామ్ చేశాడు. సంధ్య వశిష్ఠ గడుసు అమ్మాయిలా బాగా నటించింది. ఎమోషనల్ సీన్లలో ఆమె పర్వాలేదు అనిపించింది. తారక్ పొన్నప్ప నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టేశాడు. ఈ సినిమాకు స్క్రిప్టు అందించిన దర్శకుడు త్రినాథరావు నక్కిన హీరో తండ్రి పాత్రలో చక్కటి పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత ఆయనకు నటుడిగా మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. ఇంద్రజ తల్లి పాత్రలో బాగానే మెప్పించింది. కమెడియన్ బాషా అక్కడక్కడా నవ్వించాడు. జబర్దస్త్ సత్యశ్రీ.. వడ్లమాని శ్రీనివాస్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు. నిర్మాత కాండ్రేగుల నాయుడు కూడా నెగిటివ్ రోల్ లో బాగానే నటించాడు.
సాంకేతిక వర్గం:
అనకాపల్లి సాంకేతికంగా ఓకే అనిపిస్తుంది. కెమెరామన్ మాయ విజువల్స్ బాగున్నాయి. దేవ్ జండ్ బీజీఎం సినిమాకు అవసరమైన ఇంటెన్సిటీని తీసుకొచ్చింది. పాటలు మాత్రం సోసోగా అనిపిస్తాయి. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. అనకాపల్లి రియల్ లొకేషన్స్ లో షూట్ చేసిన ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. త్రినాథరావు కథ కొంచెం రొటీన్ ఫీల్ ఇచ్చినా.. కథనం మెరుగ్గా అనిపిస్తుంది. లవ్ కాన్ఫ్లిక్ట్ సినిమాలో హైలైట్ గా నిలిచింది. దర్శకుడు ఖగేష్ టేకింగ్ బాగుంది.
చివరగా :రా అండ్ రస్టిక్‌గా సాగిన అనకాపల్లి ప్రయాణం
రేటింగ్: 2.5/5
