Begin typing your search above and press return to search.

అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి తెర వెనుక కథ!

ఇడియట్ మొదట పవన్ వద్దకు వెళ్లిందనే ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా గురించిన ఆసక్తికర చర్చ జరుగుతోంది.

By:  Tupaki Desk   |   13 Feb 2024 11:30 AM GMT
అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి తెర వెనుక కథ!
X

సహాయ దర్శకుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రవితేజ తక్కువ సమయంలోనే నటుడిగా అవకాశాలు దక్కించుకున్నాడు. సహాయ నటుడిగా చేస్తూ తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకోవడం వల్ల ఏకంగా హీరోగా అవకాశాలు దక్కించుకున్నాడు. హీరోగా రవితేజ కెరీర్ ఆరంభంలో చేసిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి.

రవితేజ ను యూత్‌ ఆడియన్స్ కు బాగా చేరువ చేసిన సినిమాలు ఇడియట్‌, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం ఇంకా కొన్ని. పూరి దర్శకత్వంలో చేసిన సినిమాల వల్ల రవితేజ ఇండస్ట్రీలో మంచి స్థానం దక్కించుకోగలిగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే రవితేజ చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం ఇతర హీరోలు చేయకుండా వదిలేసినవి, లేదంటే చేయలేక పోయినవి అంటూ ఇండస్ట్రీలో చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఇడియట్ మొదట పవన్ వద్దకు వెళ్లిందనే ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా గురించిన ఆసక్తికర చర్చ జరుగుతోంది.

కోన వెంకట్‌ అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి కథ రాసిన సమయంలో ఒకరికి ఒకరు ఫేం శ్రీకాంత్‌ కి చెప్పాడట. కథ నచ్చడంతో నటించేందుకు ఓకే చెప్పేశాడట. అయితే అదే సమయంలో తమిళంలో చేస్తున్న ఒక సినిమా షూటింగ్‌ సందర్భంగా శ్రీకాంత్‌ కి గాయాలు అయ్యాయి.

ఆ ప్రమాదం కారణంగా కొన్నాళ్ల పాటు యాక్షన్ సన్నివేశాలు చేయకూడదని శ్రీకాంత్‌ కు వైధ్యులు చెప్పడంతో ఆ సినిమా వదిలేసుకోవాల్సి వచ్చింది. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా కిక్‌ బాక్సింగ్‌ కాన్సెప్ట్ తో సాగుతుంది. సీరియస్ యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయి. కనుక శ్రీకాంత్‌ ఆ సినిమాను వదిలేసుకోవాల్సి వచ్చింది.

శ్రీకాంత్‌ తప్పుకోవడంతో ఆ తర్వాత ఆ కథ మళ్లీ అటు ఇటు తిరిగి చివరకు మాస్‌ రాజా రవితేజ వద్దకు చేరింది. ఆ సినిమాకు రవితేజ మాత్రమే న్యాయం చేయగలడు అన్న స్థాయిలో రవితేజ నటించాడు. తండ్రి అయిన ప్రకాష్ రాజ్‌ తో రవితేజ సన్నివేశాలు, తల్లి జయసుధ తో రవితేజ సన్నివేశాలు ఎప్పటికి గుర్తుండి పోతాయి. ఆ సినిమా శ్రీకాంత్‌ చేజార్చుకోవడం రవితేజ ఫ్యాన్స్ అదృష్టం అనడంలో సందేహం లేదు.