ఫోటోగ్రాఫర్లను మందలించిన మెగాస్టార్
ఆయన ఎప్పటిలాగే తన ఇంటి ముందు గుమిగూడిన అభిమానులకు హాయ్ చెప్పేందుకు ఇంటి బయటకు వచ్చారు.
By: Tupaki Desk | 21 July 2025 9:52 AM IST81 వయసులోను అలుపెరగని యోధుడిలా ఎంతో ఉత్సాహంగా సినిమాల్లో నటిస్తూ, బుల్లితెర రియాలిటీ షోలతో బిజీగా ఉన్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సోషల్ మీడియాలు, బ్లాగులను నిర్వహించడంలోను నంబర్ వన్ గా ఉన్నారు. ఆయన ఓపిక, సహనం, జెంటిల్మన్ యాటిట్యూడ్ కి అందరూ సలాం కొడతారు. అయితే అంతటి సహనశీలికి కూడా కోపం వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు బాలీవుడ్ స్టిల్ ఫోటోగ్రాఫర్లకు అర్థమైంది.
ఆయన ఎప్పటిలాగే తన ఇంటి ముందు గుమిగూడిన అభిమానులకు హాయ్ చెప్పేందుకు ఇంటి బయటకు వచ్చారు. కానీ అప్పటికే అభిమానులు భారీ ఎత్తున తరలి రావడంతో అక్కడ కొంత రసాభాస కనిపించింది. ఆ సమయంలో ఫోటోగ్రాఫర్లు అమితాబ్ పై ఫ్లాష్ లు మెరిపించడం ప్రారంభించారు. అయితే దానికి అమితాబ్ సముఖంగా లేకపోవడంతో ఫోటోగ్రాఫర్లపై అసహనాన్ని వ్యక్తం చేసారు. ఏయ్ ఆపండి.. ఫోటోలు తీయకండి అంటూ వారికి కాస్త కటువుగానే వార్నింగ్ ఇచ్చారు అమితాబ్.
నిజానికి అమితాబ్ ని ఎప్పుడూ ఇంత కోపంగా హిందీ మీడియా చూడలేదు. లెజెండరీ నటుడు అమితాబ్ భార్య జయా బచ్చన్ ప్రతిసారీ ఫోటోగ్రాఫర్లు తీరుతెన్నులపై విరుచుకుపడుతుంటారు. కానీ అందుకు భిన్నమైన శైలి అమితాబ్ ప్రత్యేకత. ఆయన ఎంతో ఓపిగ్గా ఫోటోగ్రాఫర్లకు సహకరిస్తుంటారు. కానీ ఇప్పుడు ఆయనకు ఏమైందో వారిపై సీరియస్ అయ్యారు. అనుమతి లేకుండా ఫోటోలు తీయడమే దీనికి కారణం. వైట్ అండ్ వైట్ లుక్ లో అమితాబ్ జల్సా బయటకు వచ్చాక ఫోటోగ్రాఫర్లు పెద్దాయనను విసిగించడమే ఈ కోపానికి కారణం.
బిగ్ బి సహనం కోల్పోయిన ఈ వీడియో క్షణాల్లో వెబ్ లో వైరల్ అయింది. అమిత్ జీ కోపాన్ని ఊహించని అభిమానులు, ఆయన కూడా ఇప్పుడు భార్య జయాజీని అనుసరిస్తున్నారని ఛమత్కరిస్తున్నారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే, అమితాబ్ బచ్చన్ ఆగస్టు 11న సోనీ టీవీలో ప్రసారమయ్యే కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 17కి హోస్ట్‌గా తిరిగి రానున్నారు. అలాగే కల్కి 2898 ఏడి సీక్వెల్ లోను అశ్వత్థామ పాత్రతో తిరిగి ఎంట్రీ ఇస్తారు. పలు భారీ చిత్రాల్లోను అమితాబ్ నటిస్తున్నారు.
