ఆ వయసులో అతడితో అలా చేస్తే ఆత్మహత్య లాంటిందే!
బాలీవుడ్ క్లాసిక్ చిత్రాల్లో `గదర్ : ఏక్ ప్రేమ్ కథ`ది ప్రత్యేకమైన స్థానం. సన్నీ డియోల్, అమీషా పటేల్, అమ్రిష్ పూరీ ప్రధాన పాత్రల్లో అనీల్ శర్మ తెరకెక్కించిన చిత్రం ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.
By: Srikanth Kontham | 21 Jun 2026 1:00 PM ISTబాలీవుడ్ క్లాసిక్ చిత్రాల్లో `గదర్ : ఏక్ ప్రేమ్ కథ`ది ప్రత్యేకమైన స్థానం. సన్నీ డియోల్, అమీషా పటేల్, అమ్రిష్ పూరీ ప్రధాన పాత్రల్లో అనీల్ శర్మ తెరకెక్కించిన చిత్రం ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. దేశ విభజన నాటి పరిస్థితులు, మతాల సరిహద్దులను దాటిన పవిత్రమైన ప్రేమకథగా తెరకెక్కిన చిత్రం ఈ ఏడాదితో 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని పురస్కరించుకుని చిత్ర కథానాయిక అమీషా పటేల్ నాడు సినిమా నిర్మాణ సమయంలో ఎదురైన కొన్ని ఆసక్తికరమైన సవాళ్లను, తెరవెనుక విశేషాలను పంచుకున్నారు.
`కహో నా ప్యార్ హై` వంటి భారీ బ్లాక్‌బస్టర్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అమీషా పటేల్‌కు ఆ వెంటనే గదర్ లాంటి ప్రాజెక్ట్‌లో అవకాశం రావడం ఓ పెద్ద మలుపు. అయితే ఆ సమయంలో పరిశ్రమలోని చాలా మంది పెద్దలు, సన్నిహితులు అమీషాను ఈ సినిమా చేయోద్దని వారించినట్లు గుర్తు చేసుకున్నారు. గ్లామర్ పాత్రలతో కెరీర్ ప్రారంభించిన కొత్తలోనే ఒక బిడ్డకు తల్లిగా నటించడం.. పైగా తనకంటే వయసులో చాలా పెద్దవాడైన సన్నీ డియోల్ సరసన నటించడం కెరీర్ పరంగా ఆత్మహత్య సదృశ్యం (సూసైడల్) అవుతుందని భయపెట్టారన్నారు.
స్క్రిప్ట్ కాగితంపై చూసినప్పుడు జోడీ అస్సలు సరిపోలదని..అలాంటి కాంబోలో సినిమా ఏంటని పెద్దలు గట్టిగానే చెప్పారన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయనికి అమీషా పటేల్ వయసు 26 సంవత్సరాలు కాగా సన్నీ డియోల్ 43 ఏళ్ల వయసులో ఉన్నారు. ఇద్దరి మధ్య దాదాపు 17 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉండటంతో పరిశ్రమ వర్గాలే కాకుండా స్వయంగా అమీషా కూడా మొదట్లో కొంత ఆందోళన చెందారు. తెరపై ఈ జంటను ప్రేక్షకులు అంగీకరిస్తారా? లేదా? అనే భయం అమీషాను వెంటాడింది. నూతన నటిగా మాత్రమే కాకుండా కథానాయికగా ఈ కాస్టింగ్ సరైనదేనా? ప్రేక్షకులకు ఇది వింతగా అనిపించి సినిమా విఫలమవుతుందా? అనే సందేహాలు నాడే అమీషా పటేల్ మనసులో తలెత్తాయి.
కానీ `గదర్` కథను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత తన ఆలోచనలు మారినట్లు తెలిపింది. ఆ వయసు వ్యత్యాసమే ఈ సినిమాకు ప్రధాన బలంగా మారుతుందని గ్రహించానన్నారు. కథ ప్రకారం తారా సింగ్ సమాజంలో స్థిరపడిన ఒక రగ్గడ్ కార్మికుడు కాగా, సకినా కాన్వెంట్ స్కూల్లో చదువుకునే ఒక అమాయకపు యువతి. వయసు, సామాజిక హోదా, చదువు, మతం పరంగా సకినా తనకు ఎప్పటికీ లభించని ఒక యువరాణిలా తారా సింగ్‌కు అనిపిస్తుంది. ఈ పాత్రల మధ్య ఉన్న భావోద్వేగాలను ప్రతిబింబించడానికి ఆ వయసు వ్యత్యాసం స్క్రిప్ట్ పరంగా ఎంతో అవసరమైందని, అందుకే తమ జోడీ అంతగా పండిందని అమీషా తెలిపారు.
ఈ సందర్భంగా నేటి తరం బాలీవుడ్ చిత్రాలపై కూడా అమీషా ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. కథకు అవసరమైతే తెరపై వయసు వ్యత్యాసాలు ఉండటంలో ఎలాంటి తప్పు లేదని.. కానీ ప్రస్తుత సినిమాల్లో ఎలాంటి బలమైన కారణం లేకుండానే వయసులో పెద్ద వ్యత్యాసం ఉన్న నటీనటులను జంటగా చూపిస్తున్నారని అభిప్రాయపడ్డారు. కథలో సహజత్వం లోపించడం వల్లే నేటి ప్రేక్షకులు కొన్ని చిత్రాలను తిరస్కరిస్తున్నారని స్పష్టం చేశారు. పాత్రల మధ్య ఉండే ఆత్మీయత, కథలోని గాఢత మాత్రమే ఏ బంధాన్నైనా తెరపై పండించగలవని పేర్కొన్నారు.
