Begin typing your search above and press return to search.

'అమీర్ లోగ్' మూవీ రివ్యూ

హైదరాబాద్ బ్యాక్ డ్రాప్, ఓల్డ్ సిటీ కథ అంటూ టీం గట్టిగానే ప్రమోట్ చేయడం.. రానా సంస్థ స్పిరిట్ మీడియా రిలీజ్ చేస్తుండటంతో ‘అమీర్ లోగ్’ అనే చిన్న సినిమాపై బాగానే బజ్ ఏర్పడింది.

By:  Tupaki Desk   |   21 Aug 2026 6:27 PM IST
అమీర్ లోగ్ మూవీ రివ్యూ
X

'అమీర్ లోగ్' మూవీ రివ్యూ

నటీనటులు: ఎంసీ హరి - మనోజ్ - శశిధర్ - వేద జలంధర్ - రావణ్ నిట్టూరు - విశ్వేందర్ రెడ్డి - సాయియోగి తదితరులు

సంగీతం: స్మరణ్ సాయి

ఛాయాగ్రహణం: ఎస్వీకే

నిర్మాణం: అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి

రచన - దర్శకత్వం: రమణా రెడ్డి సోమ

హైదరాబాద్ బ్యాక్ డ్రాప్, ఓల్డ్ సిటీ కథ అంటూ టీం గట్టిగానే ప్రమోట్ చేయడం.. రానా సంస్థ స్పిరిట్ మీడియా రిలీజ్ చేస్తుండటంతో ‘అమీర్ లోగ్’ అనే చిన్న సినిమాపై బాగానే బజ్ ఏర్పడింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం పదండి.

కథ:


హైదరాబాద్ లోని ఓ బస్తీలో ఖాళీగా తిరిగే ముగ్గురు కుర్రాళ్ళు శ్రీను (హరి).. ఫరూక్ (మనోజ్).. మల్లేష్ (శశిధర్).. ఇంట్లో వాళ్ళ మాట వినకుండా ఆవారాగా తిరుగుతుంటారు. ఓ రోజు బస్తీలోనే నజీర్ (సాయి యోగి)తో క్రికెట్ విషయంలో వీరికి గొడవ జరుగుతుంది. అది పెద్ద వివాదంగా మారడంతో ఈ ముగ్గురూ అక్కలా భావించే గీత (వేద జలంధర్) వాళ్లకు ఇంట్లో వాళ్ళ కష్టాలు చెప్పి జ్ఞానోదయం చేస్తుంది. దీంతో ఆ ముగ్గురు పని మీద దృష్టిపెడతారు. ఇంతలో శ్రీను ఆఫీసు వాళ్లతో చిన్న ఘర్షణ జరిగి వారితో క్రికెట్ ఆడి గెలుస్తామని బెట్ కడతాడు. దీంతో సాఫ్ట్ వేర్ జట్టుకి.. బస్తీ టీంకి మధ్య క్రికెట్ మ్యాచ్ జరగుుతుంది. మరి ఈ మ్యాచ్ లో బస్తీ జట్టు గెలిచిందా లేదా? తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి. మధ్యలో ఈ ముగ్గురు మిత్రుల జీవితాలను ప్రభావితం చేసిన బిర్యానీ కథేంటి అన్నది తెర మీద చూసి తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

ఖాళీగా ఉండే మిత్రుల అల్లరిని చూపించి.. ఏదో ఒక పాయింట్లో వారిలో రియలైజేషన్ వచ్చి జీవితంలో బాగుపడే ప్రయత్నం చేసే కథలు తెలుగు తెరపై చాలానే చూశాం. పెళ్లి చూపులు.. హుషారు.. మేమ్ ఫేమస్.. జాతిరత్నాలు.. ఇలా చాాాలా సినిమాలు ఇదే లైన్లోనే నడుస్తాయి. వీటిలో ఒక్కో సినిమా బ్యాక్ డ్రాప్.. ట్రీట్మెంట్ ఒక్కోలా ఉంటాయి. ‘అమీర్ లోగ్’ ఇదే లైన్లో సాగుతూ.. పాత బస్తీ నేపథ్యంలో నడిచే కథ. పక్కా హైదరాబాదీ భాష-యాసతో పాటు ఇక్కడ బాగా ఫేమస్ అయిన బిర్యానీ ఫ్లేవర్ ను కూడా ఈ కథకు గట్టిగా దట్టించారు. ఈ బ్యాక్ డ్రాప్ వల్ల ఈ కథకు కొంత ప్రత్యేకత చేకూరిన మాట వాస్తవం. అదే సమయంలో బిర్యానీలో ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది కానీ.. మోతాదు ఎక్కువైతే ఇబ్బంది అన్నట్లు ‘అమీర్ లోగ్’కు కూడా బ్యాక్ డ్రాప్ తాలూకు ఫ్లేవర్ ఎక్కువైంది. అథెంటిక్ పాతబస్తీ సినిమా చూపించాలనే ప్రయత్నంలో మోతాదుకు మించిన ఉర్దూ డైలాగులు.. లోకల్ ఫ్లేవర్ తో సినిమా పరిధిని కొంచెం తగ్గించేశారనిపిస్తుంది. ఐతే డిఫరెంట్ మూవీస్ చూడాలనుకునేవారు ‘అమీర్ లోగ్’పై ఒక లుక్కేయొచ్చు.

‘అమీర్ లోగ్’ ఫస్ట్ హాఫ్ అంతా నిదానంగా సాగుతుంది. మొదటి అరగంట అయితే ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఖాళీగా తిరగడం మీద రొటీన్ సీన్లతో నడిపించేశారు. ఆ తర్వాత ముగ్గురు హీరోలు జీవితంలో స్థిరపడే ప్రయత్నం చేశాక వారి జీవితాలు ఎలా నడిచాయన్నది కూడా కొంచెం రొటీన్ ఎమోషన్ తోనే నడుస్తుంది. సినిమాలోకి క్రికెట్ ప్రవేశించాకే ఊపు వస్తుంది. ఈ సన్నివేశాలతో యూత్ బాగా కనెక్ట్ అవుతారు. హీరోలు ఆ క్రికెట్ మ్యాచ్ లోనే గెలుస్తారా? ఓడిపోతారా అనే బ్యాంగ్ ఇవ్వడంతో ఇంటర్వెల్ ఆకట్టుకుంటుంది. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి నెలకొంటుంది. క్రికెట్ మ్యాచ్ అయ్యాక కథ బిర్యానీ మీదికి మళ్లుతుంది. ఆ సన్నివేశాలు ఓకే అనిపిస్తాయి. దీంతో పాటుగా మనసుకు నచ్చింది చెయ్యాలని చెప్పే సీన్లు.. ఒక లవ్ ట్రాక్ తో ‘అమీర్ లోగ్’ సెకండాఫ్ బాగానే నడుస్తుంది. ద్వితీయార్ధంలో ఎమోషనల్ సీన్లు కూడా బాగానే పండాయి. కామెడీ పర్వాలేదనిపిస్తుంది. ఈ సినిమాకు ఓపెన్ ఎండింగ్ ఇచ్చారు. ఈ సినిమా ‘అంగ్రేజ్’ తరహాలో లోకల్ హైదరాబాదీలకు బాగా కనెక్ట్ అవుతుంది. కానీ మిగతా ప్రేక్షకులకు కూడా కనెక్టయ్యేలా యూనియర్శల్ అప్పీల్ ఉంటే మరింతగా ప్రేక్షకులకు రీచ్ అయ్యేది.

నటీనటులు:


మూడు ప్రధాన పాత్రల్లో నటించిన హరి, మనోజ్, శశిధర్ బాగానే నటించారు. కొత్తవాళ్ళైనా లోకల్ హైదరాబాద్ కుర్రాళ్ళుగా బాగానే సెట్ అయ్యారు. తిమ్మరాజు పల్లి టీవీ సినిమాలో కథానాయికగా బాగా మెప్పించిన వేద జలంధర్ ఇందులో చేసిన పాత్రకు అంతగా సెట్ అవలేదు. అంత క్యూట్ హీరోయిన్ కి ఇలాంటి పాత్ర ఇచ్చారేంటి అనిపిస్తుంది. చాచా పాత్రలో విశ్వేందర్ చాలా బాగా నటించాడు. రావణ్ నిట్టూరు.. సాయియోగి.. మిగిలిన కొత్త నటీనటులు వారి వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

సాంకేతిక వర్గం:

‘అమీర్ లోగ్’కు నిర్మాణ విలువలు ఒకే అనిపిస్తాయి. సాంకేతికంగా సినిమా ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సిందనిపిస్తుంది. కెమెరామన్ ఎస్వీకే విజువల్స్ పర్వాలేదనిపించినా ఈ సినిమాలో చాలా సీన్లకు కలర్ గ్రేడింగ్.. డిఐ సరిగా చేయలేదు. స్మరణ్ సాయి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ యావరేజ్. పాటలు మాత్రం బాగున్నాయి. దర్శకుడు పాత కథే తీసుకున్నా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో కొత్తగా చెప్పాలనుకున్నాడు కానీ కాస్త రొటీన్ గానే తెరకెక్కించాడు. తన రైటింగ్.. టేకింగ్ ఓకే అనిపిస్తాయి. డైలాగులు కొన్ని చోట్ల బాగున్నా.. ఉర్దూ మోతాదు ఎక్కువైపోయింది.

చివరగా: అమీర్ లోగ్.. పర్వాలేదనిపించే హైదరాబాదీ ఫ్లేవర్

రేటింగ్ - 2.5/5