వీరమల్లు నిర్మాతకు పవన్ మరో గిప్ట్ కూడా ఇస్తున్నారా?
'హరిహరవీరమల్లు' చిత్రంతో నిర్మాత ఏ.ఎం రత్నం పేరు మళ్లీ వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 July 2025 4:31 PM IST'హరిహరవీరమల్లు' చిత్రంతో నిర్మాత ఏ.ఎం రత్నం పేరు మళ్లీ వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఎన్నో హిట్ చిత్రాలందించిన నిర్మాత కాల క్రమంలో సక్సెస్ ల్లో వెనుకబడటంతో పాటు నిర్మాణం కూడా తగ్గించుకుంటూ వచ్చారు. ఈ మద్యనే మళ్లీ స్పీడప్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యా ణ్ తో వీరమల్లు ప్రాజెక్ట్ సెట్ అయింది. ఈసినిమాతో నిర్మాతగా బౌన్స్ బ్యాక్ అవ్వాలని రత్నం ఎంతో కసిమీద ఉన్నారు. ప్రాజెక్ట్ మొదలు పెట్టి ఐదేళ్లు అవుతున్నా? ఎక్కడా నిరుత్సాహ పడకుండా ముందుకు సాగుతున్నారు.
సాధారణంగా ఏ నిర్మాతకైనా ఇంత గ్యాప్ వస్తే మరో హీరోతో సినిమా చేసుకోవాలని చూస్తారు. కానీ రత్నం ఆ ఛాన్స్ తీసుకోకుండా పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో ఎదురు చూసి చివరకు ఐదున్నేళ్లకు వీరమల్లును పూర్తి చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ కారణంగా రత్నం సినిమా కోసం అదనంగా చాలా ఖర్చు కూడా చేయాల్సి వచ్చింది. వడ్డీ బారాలు కూడా మోసారు. ఈ క్రమంలోనే వీరమల్లుకు పారితోషికం విషయంలో పవన్ మినహాయింపు కూడా ఇచ్చారు. రత్నం-పవన్ మధ్య మంచి మైత్రీ కూడా ఉంది.
ఆ రకంగా రత్నం కు కొంత వ్యక్తిగతంగా కలిసొచ్చింది. ఇప్పుడా పరిచయమే ఏ.ఎం రత్నంకు పదవి కూడా కట్టబెట్టబోతుంది? అన్న ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఎఫ్ డీసీ చైర్మన్ గా రత్నంని నియమించాలని పవన్ భావిస్తున్నారట. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రత్నం ముందుకు తీసుకెళ్తే ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. పవన్ ఆ రకంగా ఆలోచిస్తున్నారని... అధికారికంగా ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేద్దామని సూచించారు. దీంతో ఇప్పుడీ అంశం నెట్టింట చర్చగా మారింది.
జనసేన పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో రత్నం భాగస్వామి అయ్యారు. ఎప్పటికప్పుడు తన మద్దతు ప్రకటించేవారు. ఆ రకంగా పార్టీకి తన రూపేణా కొంత భరోసా కల్పించారు. ఈ నేపథ్యంలోనే పవన్ కూడా పదవి విషయంలో రత్నం వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇదే పదవి విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మదిలో ఇంకెవరైనా ఉన్నారా? పవన్ సూచించిన వ్యక్తికే కేటాయిస్తారా? అన్నది తెలియాలి.
