సినిమా నుంచి రాజకీయం.. ఎ.ఎం.రత్నం చిత్రాల 'విచిత్ర' సెంటిమెంట్!
తెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో ప్రముఖ నిర్మాతగా పేరున్న ఎ.ఎం.రత్నం ఇటీవల ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.
By: Tupaki Desk | 29 May 2025 11:59 AM ISTతెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో ప్రముఖ నిర్మాతగా పేరున్న ఎ.ఎం.రత్నం ఇటీవల ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. తన సినిమాల్లో నటించిన కథానాయకులు ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని, ఇది కేవలం యాదృచ్చికమేనా అని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన 'హరి హర వీరమల్లు' చిత్రంలోని 'తార తార' పాట ఆవిష్కరణ వేడుకలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం జూన్ 12న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
'హరి హర వీరమల్లు' సీక్వెల్ ప్లాన్స్!
క్రిష్ జాగర్లమూడి, రవికృష్ణ దర్శకత్వం వహించిన 'హరి హర వీరమల్లు' చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటించగా, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునీల్, కింగ్‌స్లీ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం, మనోజ్ పరమహంస చాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి.
'తార తార' పాట విడుదల కార్యక్రమంలో దర్శకుడు కె.ఎస్.రవికుమార్, కె.ఆర్. వంటి సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎ.ఎం.రత్నం మాట్లాడుతూ, 'హరి హర వీరమల్లు' చిత్రం చాలా బాగా వచ్చిందని, దీనికి సీక్వెల్ కూడా నిర్మిస్తానని ప్రకటించారు. తన కొడుకు రవికృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
యాదృచ్చికమేనా?
నిర్మాత ఎ.ఎం.రత్నం తన వ్యాఖ్యలలో ఒక ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించారు. తన సినిమాల్లో నటించిన పలువురు హీరోలు తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారని ఆయన పేర్కొన్నారు. ఈ జాబితాలో ప్రముఖ నటులు శరత్ కుమార్, విజయకాంత్, విజయ్, విజయశాంతి ఉన్నారని తెలిపారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో, ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిందో లేక దీని వెనుక ఏదైనా సంబంధం ఉందో తెలియదని ఆయన నవ్వుతూ అన్నారు.
దర్శకుడు రవికృష్ణ పవన్ కళ్యాణ్‌తో అనుభవం
'హరి హర వీరమల్లు' చిత్ర దర్శకుడు రవికృష్ణ మాట్లాడుతూ.. తాను ఏడెనిమిది ఏళ్ల తర్వాత దర్శకత్వం వహించిన చిత్రమిదని తెలిపారు. పవన్ కళ్యాణ్ తనను పిలిచి, "నాకు చాలా మంది అభిమానులున్నారు, కానీ నేను మీ తండ్రికి (ఎ.ఎం.రత్నం) అభిమానిని. ఆయన బాగుండాలని, ఆయన వారసత్వాన్ని నువ్వు కొనసాగించాలని" చెప్పారని రవికృష్ణ గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ సినీ ప్రస్థానంలోనే కాకుండా, ఆయన రాజకీయ ప్రస్థానంలో కూడా ఒక కీలక మలుపు తిరుగుతున్న సమయంలో విడుదల కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
