Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ కంటే ముందే జాతీయ అవార్డ్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన యాక్షన్ డ్రామా `పుష్ప: ది రైజ్ - పార్ట్ 1` విడుదలైన తర్వాత నిరంత‌రం హెడ్ లైన్స్ లో నిలుస్తున్నాడు.

By:  Tupaki Desk   |   22 Oct 2023 11:39 AM GMT
అల్లు అర్జున్ కంటే ముందే జాతీయ అవార్డ్?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన యాక్షన్ డ్రామా `పుష్ప: ది రైజ్ - పార్ట్ 1` విడుదలైన తర్వాత నిరంత‌రం హెడ్ లైన్స్ లో నిలుస్తున్నాడు. ఈ సినిమాలో అద్భుత న‌ట‌న‌తో బ‌న్ని ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకున్నాడు. గత వారం పుష్ప లో న‌ట‌న‌కు గాను ఉత్తమ నటుడిగా జాతీయ‌ అవార్డును దేశ అధ్య‌క్షురాలు ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా అందుకున్నాడు. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బ‌న్నీకి ఈ అరుదైన గౌర‌వం ద‌క్కింది. తెలుగు సినిమా హిస్ట‌రీలో తొలిసారిగా ఒక హీరో ఉత్త‌మ న‌టుడుగా జాతీయ అవార్డును అందుకోవ‌డం సెల‌బ్రేష‌న్ మూవ్ మెంట్.

అయితే చాలా మందికి తెలియ‌ని మ‌రొక విష‌యం కూడా ఉంది. నిజానికి అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకోక ముందే అత‌డి తాత అల్లు రామ‌లింగ‌య్య పేరిట జాతీయ అవార్డును ప‌లువురు ప్ర‌తిభావంతుల‌కు అందించారు. అల్లు అర్జున్ తాత అల్లు రామలింగయ్య తెలుగు చిత్ర‌సీమ‌లో నటుడు- నిర్మాతగా సుప‌రిచితులు. అతని పేరు మీదనే జాతీయ అవార్డు ఉంది. ఈ అవార్డును ఎంద‌రో ప్ర‌తిభావంతుల‌కు ఇప్ప‌టికే అంద‌జేసారు.

రామలింగయ్య 1953లో `పుట్టిల్లు` సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. మాయాబజార్, మిస్సమ్మ, ముత్యాల ముగ్గు, శంకరాభరణం, సప్తపది, యమగోల వంటి అనేక చిత్రాల్లో చిరస్మరణీయమైన పాత్రలు పోషించారు. అల్లూ ప్రతినాయక పాత్ర‌లు, హాస్య పాత్రలతో పాపుల‌ర‌య్యారు. 1990లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించింది. అల్లు రామలింగయ్య అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ ఆయన స్మారకార్థం అల్లు రామలింగయ్య జాతీయ అవార్డును నెలకొల్పింది. ఈ అవార్డు ప్రతి సంవత్సరం తెలుగు చలనచిత్ర ప్రముఖులను జీవిత కాల సాధనకు గాను సత్కరిస్తుంది.

అల్లు రామలింగయ్య కనకరత్నంను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు - కొడుకు అల్లు అరవింద్ .. కుమార్తె సురేఖ. అల్లు అరవింద్ ఒక పెద్ద తెలుగు సినిమా నిర్మాత..పంపిణీదారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌ను స్థాపించి ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్ని నిర్మించారు. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ఆహాకు సహ యజమానిగాను ఉన్నారు. విజేత, మాస్టర్, నినైతెన్ వంధై (తమిళం), మాంగళ్యం తంతునానేనా (కన్నడ), అన్నయ్య, జల్సా, గజిని, మగధీర, డార్లింగ్ (తమిళం) వంటి చిత్రా నిర్మాతగా అర‌వింద్ కెరీర్ లో అత్యంత ముఖ్యమైన చిత్రాలలో కొన్ని. గజినీ, జెర్సీ హిందీ రీమేక్‌లను కూడా ఆయన నిర్మించారు.

అల్లు అరవింద్ నిర్మలను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కుమారులు - అల్లు వెంకటేష్, అల్లు అర్జున్, అల్లు శిరీష్. అల్లు వెంకటేష్ ను బాబీ అని కూడా పిలుస్తారు. అల్లు వెంకటేష్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కొన‌సాగుతున్నారు. అల్లు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వ్యవస్థాపకుడుగా ఉన్నారు. అతను ఆహా .. జస్ట్ టికెట్స్‌కు స‌హ వ్య‌వ‌స్తాప‌కుడు.

అల్లు బాబి త‌ర్వాతివాడైన‌ అల్లు అర్జున్ 2003లో గంగోత్రి సినిమాతో తెరంగేట్రం చేశాడు. తరువాత అతడు 2004లో సుకుమార్ చిత్రం ఆర్యలో కనిపించాడు. ఇది బ‌న్నీకి హీరోగా బ్రేకింగ్ పాయింట్. ఆ తర్వాత అల్లు అర్జున్ బన్ని, హ్యాపీ, దేశముదురు వంటి అనేక విజ‌య‌వంత‌మైన‌ చిత్రాలను చేశాడు. రేసు గుర్రం, సరైనోడు, దువ్వాడ జగన్నాధం, అలా వైకుంఠపురములో, పుష్ప: ది రైజ్ అత‌డు న‌టించిన‌ అత్యంత విజయవంతమైన చిత్రాలలో కొన్ని. అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు - కుమారుడు అయాన్ - కుమార్తె అర్హ. అల్లు అర్హ ఇప్పటికే శాకుంతలం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ 2013లో గౌరవం సినిమాతో కథానాయకుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం వంటి సినిమాల్లో నటించాడు.