Begin typing your search above and press return to search.

ఒక్క సినిమా తీయ‌లేదు.. అల్లు అర‌వింద్ లెగ‌సీని మోస్తావా?

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడంపై ఆయన కుమారుడు, నటుడు అల్లు శిరీష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

By:  Sivaji Kontham   |   13 March 2026 9:23 AM IST
ఒక్క సినిమా తీయ‌లేదు.. అల్లు అర‌వింద్ లెగ‌సీని మోస్తావా?
X

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడంపై ఆయన కుమారుడు, నటుడు అల్లు శిరీష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గురువారం సాయంత్రం జరిగిన `అల్లు సినిమాస్` (ఏఏఏ సినిమాస్) కోకాపేట మ‌ల్టీప్లెక్స్ ప్రారంభోత్సవ వేడుకలో శిరీష్ తన తండ్రి గురించి, ఆయన నిర్మించిన సామ్రాజ్యం గురించి ఎంతో భావోద్వేగంగా మాట్లాడారు. ముఖ్యంగా వారసత్వం (లెగ‌సీ) అంటే కేవలం ఆస్తులు, సినిమాలు మాత్రమే కాదని అత‌డు చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

అల్లు శిరీష్ మాట్లాడుతూ.. తన తండ్రి అల్లు అరవింద్ గారిని బయట ప్రపంచం కేవలం ఒక షార్ప్ బిజినెస్ మ్యాన్‌గా మాత్రమే చూస్తుందని.. కానీ ఆయన లోపల ఒక గొప్ప `సినిమా భక్తుడు` దాగి ఉన్నారని వెల్లడించారు. సినిమాపై ఆయనకున్న అమితమైన ప్రేమ వల్లే అత్యాధునిక సౌకర్యాలతో ఈ థియేటర్ల సముదాయం రూపుదిద్దుకుందని శిరీష్ తెలిపారు. ఇక్కడికి వచ్చే ప్రతి ప్రేక్షకుడు కేవలం సినిమా చూడటమే కాకుండా.. తెలుగు సినిమా గొప్పతనాన్ని తెలుసుకుని వెళ్లాలనేది తన తండ్రి బలమైన ఆకాంక్ష అని ఆయన వివరించారు.

తనపై వచ్చే విమర్శల గురించి కూడా శిరీష్ ఈ సందర్భంగా స్పందించారు. ''నువ్వు ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా తీయ‌లేదు .. మరి అల్లు అరవింద్ గారి లెగసీని ఎలా మోస్తావు?'' అని చాలామంది తనను అడుగుతుంటారని ఆయన గుర్తు చేసుకున్నారు. అరవింద్ గారి ముగ్గురు కొడుకులు (బాబీ, బ‌న్నీ, శిరీష్) ఆ బాధ్యతను ఎంతో ఇష్టంగా మోస్తున్నారని, ఆ పల్లకిని మోయడంలో తమ సోదరి విద్య, బన్నీ వాసు.. ఇతర సన్నిహితులు తోడుగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

అయితే సినిమాల కంటే మించిన అసలైన లెగసీ మరొకటి ఉందని శిరీష్ అభిప్రాయపడ్డారు. తన తండ్రి సంపాదించిన ఆస్తిపాస్తుల కంటే, ఆయన సంపాదించుకున్న మనుషులు.. వారి అంతులేని ప్రేమయే నిజమైన వారసత్వమని చెప్పారు. ఒక వ్యక్తిపై ఉన్న గౌరవాన్ని చాటుకోవడానికి ఆ వ్యక్తి పేరును తమ బిడ్డకు పెట్టుకోవడం కంటే మించిన గొప్ప కృతజ్ఞత మరొకటి ఉండదని, తన తండ్రి విషయంలో అది జరిగిందని ఆయన ఎంతో గర్వంగా ప్రకటించారు.

శిరీష్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అల్లు అరవింద్ గారిపై ఉన్న అచంచలమైన గౌరవంతో ముఖేష్ ఉదేశి, రామారావు, సి.ఏ జగన్నాథ్, బన్నీ వాసు .. తమ కుమారులకు `అరవింద్` అని పేరు పెట్టుకున్నారు. నలుగురు వ్యక్తులు తమ బిడ్డలకు తన తండ్రి పేరును పెట్టుకోవడం అనేది ఆయన జీవితంలో సాధించిన అతిపెద్ద విజయమని, అంతకంటే గొప్ప లెగసీ మరొకటి ఉండదని శిరీష్ భావోద్వేగానికి లోనయ్యారు.

చివరగా.. లెగసీ అంటే కేవలం వ్యాపార సామ్రాజ్యాన్ని నడపడం మాత్రమే కాదని శిరీష్ స్పష్టం చేశారు. తన తండ్రి లాగే నలుగురికి ఉపయోగపడటం, సమాజం నుంచి నిష్కల్మషమైన ప్రేమను , గౌరవాన్ని పొందడమే అసలైన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం అని శిరీష్‌ పేర్కొన్నారు. అల్లు అర్జున్, అల్లు వెంకటేష్ స‌హా తాను కూడా తమ పని ద్వారా.. ప్రవర్తన ద్వారా ఆ ఉన్నతమైన స్థాయిని అందుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తామని శిరీష్ తన ప్రసంగాన్ని ముగించారు. `ఏఏఏ సినిమాస్`(హైద‌రాబాద్ కోకాపేట‌) లాంచింగ్ వేడుక‌లో కొత్త పెళ్లికొడుకు శిరీష్ త‌న అద్భుత‌మైన హార్ట్ ట‌చింగ్ స్పీచ్ తో అహూతుల నుంచి గౌర‌వాన్ని అందుకున్నారు.