Begin typing your search above and press return to search.

పార్టీలో 'మాల'తో చరణ్.. క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్

ఈ ట్రోల్స్‌కు అల్లు శిరీష్ తన ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ ద్వారా గట్టి క్లారిటీ ఇచ్చారు. "స్వామి (రామ్ చరణ్) ఎవరూ ఆల్కహాల్ ముట్టుకోకముందే మా పార్టీకి వచ్చారు.

By:  M Prashanth   |   24 Feb 2026 11:56 AM IST
పార్టీలో మాలతో చరణ్.. క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్
X

మెగా, అల్లు కుటుంబాల్లో ఏ చిన్న వేడుక జరిగినా అది సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంటుంది. ప్రస్తుతం అల్లు వారి ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతుండటంతో అటు ఫ్యాన్స్, ఇటు సినీ సెలబ్రిటీల సందడి మామూలుగా లేదు. మార్చి 6న జరగబోయే ఈ వేడుకకు సంబంధించి ఇప్పటికే నెట్టింట రకరకాల చర్చలు నడుస్తున్నాయి. పెళ్లికి ముందు అల్లు అర్జున్ తన తమ్ముడి కోసం ఇచ్చిన గ్రాండ్ పార్టీలోని కొన్ని మూమెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

సాధారణంగా ఇలాంటి సెలబ్రిటీ పార్టీలు అంటే గ్లామర్, సందడి మాత్రమే కాకుండా కొన్ని వివాదాలు కూడా తోడవుతుంటాయి. ఈ పార్టీలో తీసుకున్న ఒక గ్రూప్ ఫోటో బయటకు వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. అల్లు శిరీష్ నయనిక జంటతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అల్లు అర్జున్ తమ భార్యలతో కలిసి ఈ ఫోటోలో కనిపించారు. అయితే ఈ ఫోటోలో ఒక సున్నితమైన అంశంపై నెటిజన్లు రకరకాలుగా స్పందించడంతో అల్లు శిరీష్ స్వయంగా స్పందించాల్సి వచ్చింది.

అసలు విషయం ఏంటంటే, ఈ పార్టీకి రామ్ చరణ్ అయ్యప్ప మాలలో దర్శనమిచ్చారు. అయ్యప్ప స్వామి మాలలో ఉండి ఇలాంటి పార్టీలకు హాజరు కావడం ఏంటని, అక్కడ ఆల్కహాల్ వంటివి ఉంటే మాల నియమాలకు భంగం కలుగుతుంది కదా అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. చరణ్ మాల దీక్షలో ఉండి ఇలాంటి వేడుకలకు వెళ్లడంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి.

ఈ ట్రోల్స్‌కు అల్లు శిరీష్ తన ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ ద్వారా గట్టి క్లారిటీ ఇచ్చారు. "స్వామి (రామ్ చరణ్) ఎవరూ ఆల్కహాల్ ముట్టుకోకముందే మా పార్టీకి వచ్చారు. మమ్మల్ని విష్ చేసి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయారు. లార్డ్ అయ్యప్ప పట్ల చరణ్ కు ఉన్న డెడికేషన్ నాకు చాలా ఇష్టం" అంటూ శిరీష్ ఆ కామెంట్‌కు రిప్లై ఇచ్చారు. ఈ వివరణతో చరణ్ పై వస్తున్న విమర్శలకు ఒకరకంగా చెక్ పడినట్లయింది.

అల్లు శిరీష్ తన లాంగ్ టైమ్ లవర్ నయనిక రెడ్డిని మార్చి 6న వివాహం చేసుకోబోతున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో పాటు చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజాలు రాబోతున్నారు. ఇప్పటికే శిరీష్ తన తల్లిదండ్రులతో కలిసి కుటుంబ సభ్యులను పెళ్లికి ఆహ్వానిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తన కజిన్ పై వస్తున్న నెగిటివిటీని శిరీష్ ఇంత త్వరగా క్లియర్ చేయడం మెగా అల్లు అభిమానులను ఆకట్టుకుంది.

ప్రస్తుతం రామ్ చరణ్ తన తదుపరి చిత్రం 'పెద్ది'తో బిజీగా ఉన్నా, మాల నియమాలను పాటిస్తూనే కుటుంబ వేడుకలకు హాజరవుతున్నారు. శిరీష్ ఇచ్చిన ఈ క్లారిటీ ఇప్పుడు ఇంటర్నెట్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న పెద్ది సినిమాను ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఇక ఆ తరువాత సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాను స్టార్ట్ చేయనున్నారు.