Begin typing your search above and press return to search.

డ్యామేజ్ మ‌రింత పెర‌గ‌కుండా బ‌న్నీ టీమ్ చెక్

ప్రస్తుత సోషల్ మీడియా - డిజిటల్ యుగంలో ఏది నిజం? ఏది అబద్ధం? అనేది తెలుసుకోవడం సామాన్య ప్రజలకు అంత సులువేమీ కావడం లేదు.

By:  Sivaji Kontham   |   14 Jun 2026 9:53 PM IST
డ్యామేజ్ మ‌రింత పెర‌గ‌కుండా బ‌న్నీ టీమ్ చెక్
X

ప్రస్తుత సోషల్ మీడియా - డిజిటల్ యుగంలో ఏది నిజం? ఏది అబద్ధం? అనేది తెలుసుకోవడం సామాన్య ప్రజలకు అంత సులువేమీ కావడం లేదు. అంతర్జాలంలో ప్రతిరోజూ వేలాదిగా కథనాలు వైరల్ అవుతుండటంతో.. అసలు అపరాధి ఎవరు? నేరస్థుడు ఎవరు? బాధితుడు ఎవరు? లేదా నిజాయితీపరుడు ఎవరు? అని గ్రహించలేని అయోమయ పరిస్థితి ప్ర‌జ‌ల‌కు ఎదురవుతోంది. మీడియా నైతిక ప్రమాణాలు క్రమంగా తగ్గుతుండటం వల్ల కొన్ని ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు నిజాయితీగా నిజాలను ప్రచురిస్తున్నా.. కొన్ని డిజిట‌ల్ మీడియా సంస్థలు త‌ప్పుదారి ప‌ట్టించే కథనాలను వండివారుస్తున్నాయి.

ఈ విధమైన బాధ్యతారహిత్య పోకడల వల్ల ప్రజలకు మీడియాపై నమ్మకం చాలా వరకు సన్నగిల్లింది. ఇక సోషల్ మీడియాలో వచ్చే కట్టుకథలను అస్సలు నమ్మడం లేదు. అయినా వీటిని నిజమని నమ్మే కొద్ది శాతం ప్ర‌జ‌ల‌ దృష్టిలో నిజాయితీపరులు సైతం నేరస్థులుగా ముద్రపడిపోతున్నారు. ఎంతోమంది అమాయకులు ఈ డిజిటల్ ట్రోలింగ్‌కు, నిరాధార ప్రచారాలకు బలవుతున్న సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. ఒక వ్యక్తి తప్పు చేశాడా లేదా అనేది నిర్ణయించేది న్యాయస్థానాలు మాత్రమే. కానీ, కోర్టు పరిధిలో ఉన్న విషయాలపై కూడా మీడియా తన సొంత తీర్పులను ఇష్టానుసారంగా ప్రచారం చేయడం ఇండస్ట్రీలో ఒక చెడు సంప్రదాయంగా మారింది.

గతంలో హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పైనా, అల్లు కుటుంబంపైనా సోషల్ మీడియా వేదికగా చాలా దుష్ప్రచారం సాగింది. అయితే వీటన్నింటికీ అడ్డుకట్ట వేస్తూ తాజాగా అల్లు అర్జున్ టీమ్‌కు న్యాయస్థానం నుండి ఒక చిన్న‌ ఊరట లభించింది. ఈ కేసు విషయమై ఇష్టానుసారంగా వార్తలను ప్రచురించకూడదని కోర్టు స్పష్టమైన మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. దీని ప్రకారం, ఇకపై ఈ కేసు గురించి ఎలాంటి వార్త ప్రచురించాలన్నా అధికారిక సమాచారాన్ని తెలుసుకుని మాత్రమే వేయాల్సి ఉంటుంది. ఊహాజనిత కథనాలు రాయడం, నిరాధారమైన ఆరోపణలను ప్రచురించడం ఇకపై చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుంది.

తాజా కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. ఈ కేసు విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ఎలాంటి వార్తలను మీడియా సంస్థలు రాయకూడదు. ఒకవేళ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి దీనిపై అనవసరమైన చర్చలు, డిబేట్లు అంటూ మీడియా ఛానెళ్లలో హడావుడి చేస్తే తీవ్ర చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ మధ్యంతర ఉత్తర్వులు ఇన్నాళ్టికి వచ్చినా... ప్పటికే జరగాల్సిన పరువు నష్టం (డ్యామేజ్) జరిగిపోయిందని బన్నీ అభిమానులు భావిస్తున్నారు. ఏదేమైనా, ఇకపై ఆ డ్యామేజ్ మరింత పెరగకుండా ఉండేందుకు బన్నీ టీమ్ చట్టపరంగా ముందు జాగ్రత్త పడిందని చెప్పవచ్చు.

మరోవైపు అల్లు కుటుంబం వివాదాలకు దూరంగా ఉంటూ బాధితులకు అండగా నిలుస్తోంది. ఇటీవలే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన ఒక బాలుడిని అల్లు అరవింద్, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి నేరుగా వెళ్లి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబానికి అవసరమైన వైద్య సహాయం అందిస్తామని కూడా వారు హామీ ఇచ్చారు. ఒకవైపు బాధితుల పట్ల మానవత్వాన్ని చాటుకుంటూనే.. మరోవైపు తమపై జరుగుతున్న దుష్ప్రచారానికి కోర్టు ద్వారా బన్నీ టీమ్ ఇలా పకడ్బందీగా చెక్ పెట్టింది.