మహేష్, ఎన్టీఆర్‌ల తర్వాత అల్లు అర్జున్‌తో లాయిడ్..!
పుష్ప 2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ తదుపరి సినిమాకు రెడీ అవుతున్నాడు.
By: Tupaki Desk | 3 May 2025 11:21 AMపుష్ప 2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ తదుపరి సినిమాకు రెడీ అవుతున్నాడు. పుష్ప 2 సినిమా తర్వాత దాదాపు మూడు నెలలు పూర్తిగా విరామం తీసుకున్న అల్లు అర్జున్ ఇటీవల మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ముందుగా అనుకున్న ప్రకారం పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను అల్లు అర్జున్ మొదలు పెట్టాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలతో అనూహ్యంగా అట్లీ రంగంలోకి దిగాడు. బాలీవుడ్‌లో వెయ్యి కోట్ల మూవీని రూపొందించి పాన్ ఇండియా స్టార్ దర్శకుడిగా పేరు దక్కించుకున్న అట్లీ ఇప్పుడు అల్లు అర్జున్‌తో సినిమాకు స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నాడు.
సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తి అయింది. దాంతో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇక అల్లు అర్జున్ ఈ సినిమా కోసం బాడీ ట్రాన్స్ఫార్మేషన్ కి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. అందుకోసం ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ తో కలిసి అల్లు అర్జున్ వర్క్ చేస్తున్నాడు. లాయిడ్ ఆధ్వర్యంలో ఇప్పటికే అల్లు అర్జున్ వర్కౌట్లు మొదలు పెట్టాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు ఆరు నెలల పాటు లాయిడ్ ఆధ్వర్యంలోనే అల్లు అర్జున్ ఫిజికల్ ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకోన్నాడు. అట్లీ సినిమా కోసం అల్లు అర్జున్ కొత్తగా కనిపించడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
లాయిడ్ స్టీవెన్స్ గతంలో మహేష్ బాబు, ఎన్టీఆర్‌లకు వ్యక్తిగత ట్రైనర్‌గా వర్క్ చేశాడు. ఈయన ఆధ్వర్యంలో ఎన్టీఆర్, మహేష్ బాబులు గతంలో ఎప్పుడూ లేని విధంగా చాలా కొత్తగా కనిపించారు. అందుకే అల్లు అర్జున్ ఆయన ఆధ్వర్యంలో రెడీ అవుతున్నాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులతో పాటు అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్, అట్లీ కాంబో మూవీ కోసం లాయిడ్ స్టీవెన్స్ పూర్తి స్థాయిలో వర్క్ చేస్తున్నట్లుగా ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. అల్లు అర్జున్ తో కలిసి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది అంటూ లాయిడ్ సోషల్ మీడియాలో ఈ ఫోటోను అభిమానులతో, తన ఫాలోవర్స్‌తో పంచుకున్నాడు.
అల్లు అర్జున్ 20 ఏళ్ల క్రితమే సిక్స్ ప్యాక్ బాడీని చూపించిన విషయం తెల్సిందే. మరోసారి అట్లీ సినిమా కోసం ఆ ప్రయత్నం ఏమైనా బన్నీ చేయబోతున్నాడా అనే చర్చ జరుగుతోంది. సినిమా కథ డిమాండ్ చేస్తే బన్నీ ఎంత కష్టంకు అయినా సిద్ధం అవుతాడు. అలాంటి బన్నీకి లాయిడ్ స్టీవెన్స్ వంటి ట్రైనర్ లభిస్తే ఇంకా ఏమైనా ఉందా అద్భుతాలు ఆవిష్కారం కావడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటో గురించి, సినిమాలో అల్లు అర్జున్ కనిపించబోతున్న తీరు గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే అల్లు అర్జున్‌కి జోడీగా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేశాడని, మరో ఇద్దరు హీరోయిన్స్‌తో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది.