Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్‌తో... అసలు ఆలోచనే లేదు!

ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత కూడా ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్వయంగా ఆమీర్‌ ఖాన్‌ స్పందించాడు.

By:  Tupaki Desk   |   28 Jun 2025 11:38 AM IST
అల్లు అర్జున్‌తో... అసలు ఆలోచనే లేదు!
X

పుష్ప సినిమాతో బాలీవుడ్‌లో అల్లు అర్జున్‌ స్టార్‌డం అమాంతం పెరిగింది. ఆయన సినిమాల కోసం హిందీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో బాలీవుడ్‌ మీడియాతో పాటు, సౌత్‌ మీడియాలో ఒక వార్త తెగ చక్కర్లు కొట్టింది. త్వరలో అల్లు అర్జున్‌ ఒక హిందీ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాలో ఆమీర్‌ ఖాన్‌ కూడా నటించే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరి కాంబోలో గీతా ఆర్ట్స్ వారు భారీ సినిమాను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత కూడా ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్వయంగా ఆమీర్‌ ఖాన్‌ స్పందించాడు.

ఇటీవల ఆయన నటించిన సితారే జమీన్‌ పర్‌ సినిమా విడుదల అయింది. ఆ సినిమా ప్రమోషన్‌ సమయంలో మాట్లాడుతూ... టాలీవుడ్‌కి చెందిన అల్లు అరవింద్‌ ఫ్యామిలీతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గజిని సినిమా వారితో కలిసి చేయడం వల్ల సాన్నిహిత్యం పెరిగింది. అల్లు అర్జున్‌ను చినప్పటి నుంచి చూస్తున్నాను. గజిని సినిమా సమయంలో అతడితో మరింత పరిచయం ఏర్పడింది. మేము సందర్భానుసారంగా కలుస్తూ వస్తున్నాం. ఇద్దరి మధ్య సుదీర్ఘమైన స్నేహం కొనసాగుతుంది. కానీ మేము ఇద్దరం కలిసి నటించబోతున్నాం అనే వార్తలు మాత్రం నిజం కాదు. ఇప్పటి వరకు ఆ ఆలోచన కూడా నా వద్దకు ఎవరూ తీసుకురాలేదు.

నేను ఎప్పుడూ ఆ ఆలోచన చేయలేదు. మీడియాలో ఆ వార్తలు చూసి షాక్‌ అయ్యాను. మేము ఇద్దరం కలిసి ఒకసారి దిగిన ఫోటో కారణంగా ఆ వార్తలు వచ్చి ఉంటాయని అనుకుంటనున్నాను. ముందు ముందు మా కాంబోలో సినిమా వస్తుందేమో చెప్పలేను.. కానీ ఇప్పుడు మాత్రం ఆ ఆలోచన కూడా లేదని క్లారిటీ ఇచ్చాడు. అల్లు అర్జున్‌ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తే అది ఆమీర్‌ ఖాన్‌ మూవీతో అయితే బాగుంటుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్ట్‌గా సోలో హీరోగా హిందీలో సినిమా చేయడం కంటే మొదట ఆమీర్‌ ఖాన్ వంటి స్టార్‌ హీరో సినిమాలో నటించడం ద్వారా హిందీ ప్రేక్షకులకు చేరువ కావచ్చు అనే అభిప్రాయం ను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

అల్లు అర్జున్‌ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకునే హీరోయిన్‌గా నటిస్తుంది. దాంతో బాలీవుడ్‌లోనూ ఈ సినిమాతో అల్లు అర్జున్‌ సత్తా చాటడం ఖాయం. తెలుగులో చేసిన సినిమాలే హిందీలో డబ్‌ అయ్యి భారీ విజయాలను సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో డైరెక్ట్‌గా వెళ్లి హిందీ సినిమాలు తీయాల్సిన అవసరం ఏంటని కొందరు అంటున్నారు. ప్రస్తుతానికి అల్లు అర్జున్‌కి ఆ ఆలోచన లేదని తెలుస్తోంది. భవిష్యత్తులో ఏమైనా హిందీ సినిమాను చేస్తాడా... చేస్తే ఆమీర్‌ ఖాన్‌తో కలిసి నటిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే అల్లు అర్జున్‌ మరో సినిమాను మొదలు పెట్టేందుకు ప్రముఖ దర్శకుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఆ విషయమై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.