ఆడవాళ్లు బొద్దింకల్లాంటి వాళ్లు.. అల్లు అరవింద్ క్లారిటీ
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న సినిమా సింగిల్.
By: Tupaki Desk | 29 April 2025 10:30 AMప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న సినిమా సింగిల్. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. మే 9న సింగిల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.
ప్రమోషన్స్ లో భాగంగా సింగిల్ చిత్ర ట్రైలర్ ను ఓ ఈవెంట్ ఏర్పాటు చేసి రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. సింగిల్ ట్రైలర్ లో ఆడవాళ్లు కాక్రోచ్ లాంటి వాళ్లు అనే సంభాషణపై మీడియా అల్లు అరవింద్ ను ప్రశ్నిస్తూ, ఈ డైలాగ్ ఆడవాళ్లను కించపరిచేలా ఉందని అనగా, దానిపై అల్లు అరవింద్ మాట్లాడి క్లారిటీ ఇచ్చారు.
సినిమాలో వచ్చే డైలాగ్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం వేరని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఆ డైలాగ్ చాలా మందికి సరిగా అర్థం కాలేదని, బొద్దింకలు అణుబాంబుల దాడిని తట్టుకుని కూడా బతకగలవని, వాటిలానే ఆడవాళ్లు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటూ ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా, కష్టాలనైనా తట్టుకోగలనే అర్థంతో పోల్చామని చెప్పారు.
మహిళలను తక్కువ చేయాలనే ఉద్దేశం తమకు ఏ మాత్రం లేదని, తమ సినిమా ఉద్దేశం కూడా అది కాదని ఆయన తెలిపారు. సింగిల్ సినిమా చాలా కొత్తగా ఉంటుందని, ఆడియన్స్ కు ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని అందిస్తుందని, సినిమా చూసినంతసేపూ నవ్వుకుంటూనే ఉంటారని, ఇలాంటి కథతో ఇప్పటివరకు సినిమా వచ్చి ఉండదని ఆయన పేర్కొన్నారు.