మహావతార్ నరసింహ.. ఆ మెగా హీరో కచ్చితంగా చూడాలంటున్న అల్లు అరవింద్.. కారణం?
ప్రస్తుతం సక్సెస్ టాక్ తో దూసుకుపోతున్న నేపథ్యంలో ఈరోజు విలేకరులతో ముచ్చటించారు ఈ సినిమా పంపిణీదారు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.
By: Tupaki Desk | 3 Aug 2025 4:30 PM ISTయానిమేటెడ్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహావతార్ నరసింహ సినిమా ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. ఎటువంటి తారాగణం లేకుండా విడుదలైన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తూ ఉండడం గమనార్హం. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా జూలై 25వ తేదీన విడుదలైన ఈ సినిమా చాలాచోట్ల థియేటర్లలో కూడా హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. క్లీమ్ ప్రొడక్షన్స్, ప్రఖ్యాత హోం భలే ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో గీత ఆర్ట్స్ బ్యానర్ నుండి అల్లు అరవింద్ విడుదల చేశారు. థియేటర్లలో విడుదలైన ఎనిమిది రోజుల్లోనే రూ.60.5 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసి రికార్డు సృష్టించింది.
ఇదిలా ఉండగా 2037 వరకు విష్ణువు దశావతారాల ఆధారంగా చిత్రాలను విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం సక్సెస్ టాక్ తో దూసుకుపోతున్న నేపథ్యంలో ఈరోజు విలేకరులతో ముచ్చటించారు ఈ సినిమా పంపిణీదారు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.
ఈ కార్యక్రమానికి అశ్విన్ కుమార్, తనికెళ్ల భరణి, శిల్పా ధావన్ , జొన్నవిత్తుల తదితరులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే తనికెళ్ల భరణి, జొన్నవిత్తుల ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ .. ఈ సినిమా చూడడం వల్ల దేశంలో ఉన్న 9 నరసింహ క్షేత్రాలను ఒకేసారి సందర్శించిన గొప్ప జ్ఞానం , అనుభవం లభిస్తుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు థియేటర్లలో కంటే ఆలయంలోనే ఉన్నట్లు అనిపిస్తుంది కాబట్టి ప్రజలందరూ తప్పకుండా ఈ సినిమా చూడాలి . అని స్పష్టం చేశారు.
దర్శకుడు అశ్విన్ కుమార్ కూడా మాట్లాడుతూ.. ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద ఇంతటి అపూర్వ స్పందన వస్తుందని ఊహించలేదు. ఈ స్పందన చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాను తెరకెక్కించడానికి నరసింహస్వామి మాకు పూర్తి బలాన్ని ఇచ్చారు.ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా నిర్మించడానికి హోం భలే ఫిలిమ్స్ మాకు దొరికిన వరం లాంటిది. రాబోయే మహావతార్ సినిమా చిత్రాలలో నటించడానికి స్టార్ హీరోలను రంగంలోకి దింపకుండా ప్రభాస్ వంటి స్టార్లను ఏదో ఒక రకమైన యానిమేటెడ్ రూపంలో ఉపయోగించుకోబోతున్నాము అంటూ ఆయన తెలిపారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మహావతార్ నరసింహ అద్భుతమైన విజయాన్ని సాధించింది. అటు కుటుంబాలు , ఇటు సినిమాలకు దూరంగా ఉన్న వ్యక్తులు, సాధువులు థియేటర్లలో ఈ సినిమా చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఈ సినిమా చూసి భగవంతుడి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఇకపోతే సనాతన ధర్మం గురించి.. జ్ఞానం విషయానికి వస్తే మెగా కుటుంబంలో పవన్ కళ్యాణ్ చాలా అత్యుత్తమమైన వ్యక్తి. ఖచ్చితంగా ఆయన ఈ సినిమా చూడాలి అని ఆకాంక్షిస్తున్నాను అంటూ అల్లు అరవింద్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. మరి అల్లు అరవింద్ కోరిక మేరకు ప్రముఖ స్టార్ హీరో, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మహావతార్ నరసింహ చిత్రాన్ని టైమ్ కుదుర్చుకొని మరీ చూడాలి అని అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు.
