ఈడీ విచారణకు నిర్మాత అల్లు అరవింద్.. ఏం జరిగింది?
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, గీత ఆర్ట్స్ బ్యానర్ అధినేత అల్లు అరవింద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కొన్నారు.
By: Tupaki Desk | 4 July 2025 11:00 AMటాలీవుడ్ ప్రముఖ నిర్మాత, గీత ఆర్ట్స్ బ్యానర్ అధినేత అల్లు అరవింద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కొన్నారు. హైదరాబాద్ కు చెందిన రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలిట్రానిక్స్ సంస్థల బ్యాంక్ స్కాం కేసులో విచారణకు ఆయన హాజరయ్యారు. విచారణకు రావాల్సిందిగా ఇప్పటికే అల్లు అరవింద్ ను ఈడీ ఆదేశించగా.. నేడు ఆయన కార్యాలయానికి వెళ్ళారు.
అసలేం జరిగిందంటే?
2017- 2019 మధ్య కాలంలో రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలిట్రానిక్స్ సంస్థలు.. ఓ బ్యాంకు నుంచి రూ.101 కోట్ల రుణం తీసుకుని ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సొమ్ములను సంస్థల యజమానులు సొంత ప్రయోజనాలకు, అక్రమ నగదు బదిలీకి వాడారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పటికే గుర్తించారు.
అయితే సీబీఐ కేసు నమోదు చేయగా, ఆ తర్వాత మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ దర్యాప్తు కొంత కాలం క్రితం ప్రారంభించింది. అదే సమయంలో రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థతో అల్లు అరవింద్ కు చెందిన సంస్థలకు మధ్య కొన్ని అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
దీంతో వాటిపై స్పష్టత కోరుతూ ఈడీ అధికారులు అల్లు అరవింద్ కు ఇటీవల నోటీసులు జారీ చేశారు. ఆ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి శుక్రవారం అల్లు అరవింద్ వచ్చారు. ఆ సమయంలో అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. రెండు మూడు గంటలపాటు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు.
విచారణ సమయంలో ప్రధానంగా బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. విచారణ ఇంకా కంప్లీట్ అవ్వలేదని సమాచారం. వచ్చే వారం మరోసారి తమ ఎదుట హాజరుకావాలని ఈడీ అధికారులు ఆయనకు సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.
అయితే బ్యాంక్ స్కాం కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామకృష్ణ గ్రూప్ యజమానులు వి. రాఘవేంద్ర, వి. రవి కుమార్ తో అల్లు అరవింద్ కు ఉన్న సంబంధాలపై కూడా ఈడీ ఆరా తీయనుందని సమాచారం. మొత్తానికి అల్లు అరవింద్ విచారణకు హాజరై పరిణామం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.