Begin typing your search above and press return to search.

వంద‌ల కోట్ల రియ‌ల్ వెంచ‌ర్లు వ‌దిలేసి అల్లు అర‌వింద్ ఎందుకిలా చేసారు?

టాలీవుడ్ లో కొంద‌రు ప్ర‌ముఖులు సినీ ప‌రిశ్ర‌మ అభివృద్ధి కోసం నాటి రోజుల్లో ప్ర‌భుత్వం ఇచ్చిన భూమిని త‌మ క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌యోజ‌నాలు లేదా లాభాల‌ కోసం ఉప‌యోగించుకుంటున్నారనే విమ‌ర్శ‌లు ఉన్నాయి.

By:  Sivaji Kontham   |   13 March 2026 9:35 AM IST
వంద‌ల కోట్ల రియ‌ల్ వెంచ‌ర్లు వ‌దిలేసి అల్లు అర‌వింద్ ఎందుకిలా చేసారు?
X

టాలీవుడ్ లో కొంద‌రు ప్ర‌ముఖులు సినీ ప‌రిశ్ర‌మ అభివృద్ధి కోసం నాటి రోజుల్లో ప్ర‌భుత్వం ఇచ్చిన భూమిని త‌మ క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌యోజ‌నాలు లేదా లాభాల‌ కోసం ఉప‌యోగించుకుంటున్నారనే విమ‌ర్శ‌లు ఉన్నాయి. కొంద‌రు ఈ స్థ‌లాల్లో ర‌క‌రకాల వాణిజ్య కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హించ‌డంపై తెరాస ప్ర‌భుత్వం అప్ప‌ట్లో అట‌కాయించింది. ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మంలో ఈ విష‌యాల‌న్నీ బ‌య‌ట‌పడ్డాయి. అది గ‌తం అనుకుంటే.. వ‌ర్త‌మానంలోను సినిమా ప‌రిశ్ర‌మ కోసం అంకిత‌మ‌య‌యే లేదా త్యాగం చేసే నిర్మాత‌లు లేక‌పోలేదు.

ఇక 50 ఏళ్లు పైబ‌డిన చ‌రిత్ర ఉన్న ప్ర‌ముఖ సినీనిర్మాణ సంస్థ ద‌శాబ్ధాల పాటు కేవ‌లం సినిమా రంగం కోస‌మే అంకిత‌మిచ్చిన ఒక పాపుల‌ర్ ఫిలింస్టూడియోని ఇటీవ‌ల రియ‌ల్ వెంచ‌ర్ల కోసం కేటాయించ‌డం ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. అయితే అది ప్ర‌యివేట్ ప్రాప‌ర్టీ క‌నుక అది వారి ఇష్టానికే వ‌దిలేయ‌వ‌చ్చు.. చాలా మంది సినీప్ర‌ముఖులు త‌మ ప్ర‌యివేట్ స్థ‌లాల్లో ఇటీవ‌ల భారీ వాణిజ్య‌స‌ముదాయాల‌ను నిర్మించారు. కార్పొరెట్ కంపెనీల‌తో రియ‌ల్ కంపెనీల‌తో భారీ వెంచ‌ర్లు నిర్మించి వంద‌ల కోట్ల‌ లాభాల్ని ఆర్జించిన మాట వాస్త‌వం. హైద‌రాబాద్ న‌డిబొడ్డున లేదా సిటీ ఔట‌ర్ లో ముందుగా స్థ‌లాల్ని కొనుగోలు చేసిన చాలా మంది సినీప్ర‌ముఖులు ఇప్పుడు వందల కోట్ల రియ‌ల్ ఆట‌లో బిజీగా ఉన్నారు.

అయితే సినీరంగం కోసం సినిమా స్టూడియోలు నిర్మిస్తే వ‌చ్చే ఆదాయం అంతంత మాత్ర‌మే.. నిజానికి విశాఖ‌ప‌ట్నంలో రామానాయుడు స్టూడియోస్ ని నిర్మించినా కానీ దాని ద్వారా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లేదా రామానాయుడు వార‌సుల‌కు భారీ వాణిజ్య లాభాలు ఉండ‌వు. దానిని కేవ‌లం వాణిజ్య కార్య‌క‌లాపాల‌కు ఉప‌యోగించిన‌ప్పుడు లేదా సినిమాయేత‌ర ప‌నుల‌కు ఉప‌యోగిస్తే త‌ప్ప అది లాభాల బాట‌లోకి రాదు.. కానీ అందుకు ప్ర‌భుత్వ అనుమ‌తి ల‌భించ‌దు. అది కేవ‌లం సినిమా అభివృద్ధి కోసం మాత్ర‌మే ప్ర‌భుత్వం కేటాయించిన భూమి.

ఇప్పుడు మ‌రో అగ్ర నిర్మాత‌, టాలీవుడ్ దురంధ‌రుడు అల్లు అర‌వింద్ త‌న కోకాపేట్ లో సువిశాల‌మైన సొంత ప్ర‌యివేట్ భూమిని వ్యాపార కార్య‌క‌లాపాలు లేదా వాణిజ్య స‌ముదాయాల నిర్మాణం కోసం లేదా రియ‌ల్ వెంచ‌ర్ల కోసం కాకుండా కేవ‌లం సినీప‌రిశ్ర‌మ‌కు అంకిత‌మిచ్చేందుకే తాము థియేట‌ర్ లేదా మ‌ల్టీప్లెక్స్ స్క్రీన్ల స‌ముదాయాన్ని నిర్మించామ‌ని వెల్ల‌డించారు. నిజానికి థియేట‌ర్ల వ్యాపారం కంటే, ఇంకా ఎన్నో రెట్ల అధిక‌ లాభ‌దాయ‌క‌మైన వ్యాపారాలు చాలా ఉన్నాయి. వాట‌న్నిటినీ కాద‌నుకుని తాము ఉన్న రంగం కోసం, తాము న‌మ్మిన రంగ కోసం తిరిగి ఏదైనా ఇవ్వాల‌నే త‌ప‌న‌తో ఈ ప‌ని చేస్తున్నామ‌ని అల్లు అర‌వింద్ స్వ‌యంగా వెల్ల‌డించారు. ఇది ఆయ‌న గొప్ప ఆలోచ‌న‌కు నిద‌ర్శ‌నం.

హైద‌రాబాద్ లో సినీప‌రిశ్ర‌మ ప్ర‌పంచ స్థాయి ప్ర‌మాణాల‌ను అందుకునేందుకు ప్ర‌భుత్వం త‌ర‌పున త‌మ వంతు స‌హాయం ఎప్పుడూ ఉంటుంద‌ని ప్ర‌క‌టించిన సీఎం రేవంత్ రెడ్డి ఆలోచ‌న‌ల‌కు ధీటుగా ఇప్పుడు అల్లు కాంపౌండ్ ప్ర‌య‌త్నాలు స‌ర్వ‌త్రా ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. దేశంలోనే అతి పెద్ద‌ది.. ఆసియా ఖండంలో రెండోది.. ప్ర‌పంచంలోనే మూడో అతిపెద్ద డాల్బీ థియేట‌ర్ నిర్మించిన ఘ‌నత అల్లు వారికి చెందుతుంది. కొంద‌రు విమ‌ర్శిస్తారు థియేట‌ర్లు వ్యాపారం క‌దా? అని .. అయితే అది త‌క్కువ లాభ‌దాయ‌క‌త ఉన్న ప‌రిశ్ర‌మ అనేది ఈ రంగంలో ఉన్న‌ కొద్దిమందికే తెలుసు.