గీతా ఆర్ట్స్ రేంజ్ పెంచేలా అల్లు అరవింద్ బిగ్ ప్లాన్
తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రఖ్యాతి గాంచిన నిర్మాణ సంస్థల్లో గీతా ఆర్ట్స్ ఒకటి. ఈ బ్యానర్ ద్వారా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందాయి.
By: Tupaki Desk | 29 April 2025 10:40 AM ISTతెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రఖ్యాతి గాంచిన నిర్మాణ సంస్థల్లో గీతా ఆర్ట్స్ ఒకటి. ఈ బ్యానర్ ద్వారా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందాయి. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే దిశగా ముందడుగులు వేస్తున్నారు. గత కొన్నేళ్లుగా కేవలం స్టార్ హీరోలతో మాత్రమే కాదు, యువతర నటులతో కూడిన కొత్త తరహా చిత్రాలపై కూడా దృష్టి పెడుతున్నారు.
GA2 పిక్చర్స్ పేరుతో మరో విభాగాన్ని ప్రారంభించి, అక్కడ యువ నటులతో వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ‘సింగిల్’ అనే మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా అల్లు అరవింద్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమా మే 9న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అల్లు అరవింద్, గీతా ఆర్ట్స్‌కు సంబంధించి వచ్చే ఐదు సంవత్సరాల ప్రణాళిక ఇప్పటికే సిద్ధమైందని స్పష్టం చేశారు.
ఎలాంటి గందరగోళం లేకుండా, క్లియర్ గైడ్‌లైన్‌తో సంస్థ ముందుకు సాగుతోందని చెప్పారు. ఈ ఈవెంట్ సందర్భంగా ఇటీవల వినిపించిన ఓ పుకారుకు ముగింపు పలికారు. బన్నీ వాసు గీతా కంపౌండ్ నుంచి బయటకు వెళ్లిపోతున్నారని వచ్చిన వార్తలపై స్పందిస్తూ, అల్లు అరవింద్ స్పష్టం చేశారు. ‘‘బన్నీ వాసు, నా కోడలు విద్యా కొప్పినీడి ఇద్దరూ గీతా ఆర్ట్స్‌కు రెండు కళ్ళు లాంటి వారు. వాళ్లిద్దరిని విడిగా ఊహించలేం,’’ అంటూ ఫేక్ రూమర్స్ చెక్ పెట్టారు. ఇందులో ఆయన గీతా టీమ్‌పై ఉన్న నమ్మకాన్ని చూపించారు.
ఇప్పటికే గీతా ఆర్ట్స్ వద్ద బోయపాటి శ్రీను లాంటి దర్శకులకు అడ్వాన్స్‌లు ఇచ్చారని, రానున్న రోజుల్లో పెద్ద బడ్జెట్ ప్రాజెక్టులతో పాటు మీడియం రేంజ్ సినిమాలూ లైన్‌లో ఉన్నాయని తెలిపారు. అనుభవజ్ఞులైన దర్శకులతో పాటు, కొత్త దర్శకులను అవకాశాలు ఇవ్వాలని అల్లు అరవింద్ నిర్ణయించారు. ఈ వ్యూహంతోనే సంస్థ మరింత విస్తృతమైన నిర్మాణ బాధ్యతలు చేపట్టనుంది.
‘సింగిల్’ ట్రైలర్‌కు వచ్చిన స్పందనను చూసిన అల్లు అరవింద్ చాలా సంతోషంగా ఉన్నారు. సినిమాను మిగిలిన ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యువతకు కనెక్ట్ అయ్యేలా రూపొందించిన విధానం నచ్చినట్లు తెలుస్తోంది. అలాంటి మంచి సినిమాలకు బాసటగా నిలిచే గీతా ఆర్ట్స్ వ్యూహాత్మక ప్రణాళికతో, రాబోయే రోజుల్లో కూడా మినిమమ్ గ్యారెంటీ బ్యానర్‌గా నిలిచే అవకాశముంది.
