Begin typing your search above and press return to search.

అల్లరి నరేష్.. ఇది పాన్ ఇండియా ప్రాబ్లమ్

అయితే చాలా గ్యాప్ తర్వాత మరల అల్లరి నరేష్ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

By:  Tupaki Desk   |   16 Feb 2024 3:16 PM GMT
అల్లరి నరేష్.. ఇది పాన్ ఇండియా ప్రాబ్లమ్
X

అల్లరి నరేష్ అంటే టాలీవుడ్ లో మేగ్జిమమ్ కామెడీ సినిమాలే గుర్తుకొస్తాయి. అల్లరి సినిమాతో నటుడిగా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత బ్యాక్ టూ బ్యాక్ కామెడీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. తండ్రి ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో అల్లరి నరేష్ చేసిన కామెడీ సినిమాలలో చాలా వరకు హిట్ అయ్యాయి. రాజేంద్రప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో అల్లరి నరేష్ కామెడీ హీరోగా ఇమేజ్ బిల్డ్ చేసుకున్నాడు.

అయితే అల్లరి నరేష్ కామెడీ రొటీన్ అయిపోవడంతో అతనికి వరుస ఫ్లాప్ లు పడ్డాయి. దీంతో జోనర్ మార్చి కాస్తా సీరియస్ సబ్జెక్ట్ ల వైపు దృష్టి పెట్టాడు. నాంది సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాలో ఇంటరెస్టింగ్ రోల్ చేశాడు. తరువాత ఇట్లు మారేడుమల్లి ప్రజానీకం, ఉగ్రం అనే మూవీస్ చేశాడు.

అయితే చాలా గ్యాప్ తర్వాత మరల అల్లరి నరేష్ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. నరేష్ తండ్రి ఇవివి సత్యనారాయణ రాజేంద్రప్రసాద్ తో చేసిన సూపర్ హిట్ మూవీ ఆ ఒక్కటి అడక్కు టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కింది. చిలకా ప్రొడక్షన్స్ లో రాజీవ్ చిలకా నిర్మాణంలో ఈ మూవీ రాబోతోంది. మల్లి అంకం ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

తాజాగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఒక కమ్యూనిటీ అపార్ట్ మెంట్ లో ఉండే హీరోని పెళ్లి గురించి డిఫరెంట్ భాషలలో అపార్ట్మెంట్ నైబర్స్ అడుగుతూ ఉంటారు. ఫైనల్ గా వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఇన్ని భాషలలో అడుగుతున్నారు ఇది పాన్ ఇండియా సినిమానా అని అడుగుతాడు. కాదు పాన్ ఇండియా ఇష్యూ మూవీ అని చెప్పేసి నరేష్ వెళ్ళిపోతాడు. ఇంతకీ నీ పెళ్ళెప్పుడు అని వెన్నెల కిషోర్ అడుగుతాడు. ఆ ఒక్కటి అడక్కు అంటూ హీరో లిఫ్ట్ లో క్రిందికి వెళ్ళిపోతాడు.

మూవీ టైటిల్ గ్లింప్స్ అయితే ఇంటరెస్టింగ్ గానే కట్ చేశారు. సినిమాలో ఫరియా అబ్దులా మెయిన్ హీరోయిన్ గా చేస్తోంది, సెకండ్ హీరోయిన్ గా బాలీవుడ్ కమెడియన్ జానీ లీవర్ కూతురు జేమీ లీవర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. గోపీ సుందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి కో ప్రొడ్యూసర్ గా ఉండగా ఈ మూవీకి అబ్బూరి రవి కథ అందిస్తూ ఉండటం విశేషం. మార్చి 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతున్నట్లు గ్లింప్స్ లోనే కన్ఫర్మ్ చేసేశారు. మరి ఈ కామెడీ ఎంటర్టైనర్ అల్లరి నరేష్ కి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందనేది చూడాలి.