Begin typing your search above and press return to search.

కామెడీ + కంటెంట్.. ట్రాక్ మార్చిన అల్లరోడు!

టాలీవుడ్ లో కామెడీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో అల్లరి నరేశ్

By:  Tupaki Desk   |   14 March 2024 3:30 AM GMT
కామెడీ + కంటెంట్.. ట్రాక్ మార్చిన అల్లరోడు!
X

టాలీవుడ్ లో కామెడీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో అల్లరి నరేశ్. ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, కొన్నేళ్లపాటు తనదైన హాస్యంతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. ఆ మధ్య కాలంలో ఆయన తన పంథా మార్చుకొని, 'నాంది' 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' 'ఉగ్రం' వంటి సీరియస్ సినిమాలతో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఇటీవల నాగార్జున హీరోగా తెరకెక్కిన 'నా సామిరంగ' చిత్రంలో ఎనర్జిటిక్ రోల్‌తో ఆకట్టుకున్నారు నరేశ్. అయితే ఇప్పుడు అల్లరోడు “ఆ ఒక్కటీ అడక్కు” అంటూ తన ఫేవరెట్ కామెడీ జోనర్‌ తో ఆడియన్స్ ముందుకి వస్తున్నారు.

అల్లరి నరేష్ హీరోగా మల్లి అంకం దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ "ఆ ఒక్కటి అడక్కు". రాజీవ్ చిలక నిర్మించిన ఈ చిత్రంలో 'జాతి రత్నాలు' ఫేం ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. వెన్నెల కిశోర్, వైవా హర్ష, హరి తేజ కీలక పాత్రలు పోషించారు. మార్చి 22న ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్, టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే నరేశ్ గత చిత్రాల మాదిరిగా కాకుండా, డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ - పేరడీ సన్నివేశాలు లేకుండా కామెడీని పండించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని టీజర్ లాంచ్ లో నరేశ్ స్పష్టం చేశారు. ఇందులో కామెడీతో పాటుగా కంటెంట్ కూడా ఉన్నట్లు తెలిపారు.

కామెడీ కింగ్ రాజేంద్రప్రసాద్ హీరోగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'ఆ ఒక్కటీ అడక్కు'. ఇప్పుడు తన తండ్రి సినిమా టైటిల్ తోనే వస్తున్నారు అల్లరి నరేశ్. అయితే దానికీ దీనికీ ఏమాత్రం సంబంధం లేదని చెప్పారు. "మా నాన్న చేసిన 'ఆ ఒక్కటి అడక్కు' చిత్రానికీ, దీనికి ఏ సంబంధం లేదు. ఇది దానికి సీక్వెల్‌ కాదు. జీవితంలో సెటిల్ అవ్వకుండా పెళ్ళి చేసుకునేవాడి కథ అది. సెటిల్ అయినా పెళ్లి అవ్వని యువకుడి కథ ఇది. ఏమి అడిగినా పర్లేదు కానీ పెళ్లి ఎప్పుడని అడిగితే మాత్రం సర్రున కోపం వచ్చేస్తుంటుంది. దాంట్లోనే నుంచే హ్యూమర్ క్రియేట్ చేశాం. రెండు సినిమాలకు చాలా తేడా ఉంది" అని నరేశ్ తెలిపారు.

'నాంది' తర్వాత సీరియస్‌ సినిమాలు చేయడంతో, మళ్లీ కామెడీ కావాలి.. వింటేజ్‌ నరేష్‌ని చూడాలని చాలామంది అడుగుతున్నారు. అలా క్లీన్ కామెడీతో ఈ సినిమా చేశాం. ఎక్కడా డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌, పేరడీ సన్నివేశాలు, స్పూఫ్స్ లేకుండా ఒక హెల్తీ కామెడీని అందించాలని మేం ముందే నిర్ణయించుకున్నాం. దీని కోసం ఏడెనిమిది నెలలు కూర్చొని స్క్రిప్ట్ రెడీ చేశాం. కామెడీ నా బలం. చాలా రోజుల తర్వాత అలాంటి సినిమాతో ఎక్కువ నవ్వించడానికి వస్తున్నాను. ఇది అందరితో పాటుగా నాకు కూడా చాలా ఇంపార్టెంట్ అని అల్లరి నరేష్ అన్నారు.

"నేను ఏ సినిమా చేసినా మంచి కంటెంట్ వుంటుందని ఇంతకముందు చెప్పాను. దీంట్లో కామెడీతో పాటుగా కంటెంట్ ఉంటుంది. ఇందులో ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేశాం. అది కూడా కామెడీ వేలోనే చెప్పడం జరిగింది" అని నరేశ్ చెప్పారు. ఫస్ట్ టైం తన హైట్ కు తగ్గ హీరోయిన్ తో నటించానని, హీరోయిన్ ఫారియాకు మంచి కామెడీ టైమింగ్ ఉందని, నటించడమే కాదు బాగా డ్యాన్స్ కూడా చేసిందన్నారు. సినిమా క్రిస్పీగా ఉండాలని 2 గంటల 5 నిమిషాలు ఉండేలా చూసుకున్నామని తెలిపారు. కథ డిమాండ్‌ మేరకే 'ఆ ఒక్కటీ అడక్కు' టైటిల్ పెట్టామే తప్ప, క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో కాదన్నారు.

'కితకితలు' సినిమాని ఈ రోజుల్లో తీస్తే బాడీ షేమింగ్‌ చేశారని అంటారు. ఒకరి కలర్ గురించి మాట్లాడకూడదు.. ప్రతీదానికి చాలా సెన్సెటివ్‌ గా ఉన్నారు. బయట ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా కామెడీ సృష్టించడం చాలా కష్టం. అందుకే కామెడీ సినిమాలు చెయ్యడానికి టైం తీసుకుంటున్నాను. కామెడీ స్క్రిప్ట్స్ చేయటానికి నేను ఎల్లప్పుడూ రెడీగా ఉంటాను. సీనియర్ సినిమాల కంటే కామెడీ చిత్రాలే తక్కువ రోజుల్లో అయిపోతాయి. ఇటీవల కాలంలో చాలామంది కామెడీ కథలు చెప్పారు. డబుల్ మీనింగ్ డైలాగ్స్, స్పూప్స్, పేరడీలు ఇలాంటివే ఉంటున్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకూ ఫ్యామిలీలో ఎవరూ ఇబ్బంది పడకుండా ఉండే సినిమాలు చేద్దాం అని ఫిక్స్ అయ్యాను అని అల్లరి నరేష్ చెప్పుకొచ్చారు.