Begin typing your search above and press return to search.

అల్లరి నరేష్ 'కనకదుర్గ'.. 'అల్లు' అన్నాచెల్లెళ్లు స్పెషల్ అట్రాక్షన్!

వైవిధ్యమైన కథలతో దూసుకుపోతున్న అల్లరి నరేష్ హీరోగా రూపొందనున్న డివోషనల్ మూవీ 'కనకదుర్గ' శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

By:  M Prashanth   |   7 April 2026 5:00 PM IST
అల్లరి నరేష్ కనకదుర్గ.. అల్లు అన్నాచెల్లెళ్లు స్పెషల్ అట్రాక్షన్!
X

వైవిధ్యమైన కథలతో దూసుకుపోతున్న అల్లరి నరేష్ హీరోగా రూపొందనున్న డివోషనల్ మూవీ 'కనకదుర్గ' శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో టెంపుల్ టౌన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఆ సినిమాకు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. మూవీ లాంఛింగ్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల ముఖ్య అతిథిగా హాజరై సినిమాను ప్రారంభించారు.

తమిళ సినీ పరిశ్రమలో విజయవంతమైన కంటెంట్ స్టూడియోగా గుర్తింపు పొందిన అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, కనకదుర్గ చిత్రంతో టాలీవుడ్‌ లోకి అడుగుపెడుతోంది. టెంపుల్ టౌన్ పిక్చర్స్‌ తో కలిసి రూపొందిస్తున్న ఆ మూవీ.. భక్తి, యాక్షన్, భావోద్వేగాలు, సంగీతం వంటి అన్ని అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

సినిమాలో అల్లరి నరేష్‌ కు జోడీగా కాజల్ చౌదరి నటిస్తుండగా, సుబ్బరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. కథను బీవీఎస్ రవి అందించగా, సమీర్ నాయర్, దీపక్ సెహగల్, అజిత్ ఠాకూర్, బీవీఎస్ రవి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పూజా కార్యక్రమం సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అల్లు అరవింద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, ఆయన చెల్లెలు సురేఖ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వారిద్దరూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

స్వప్నాదత్ గౌరవ దర్శకత్వం వహించగా, శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్క్రిప్ట్‌ ను అందించారు. హరీష్ శంకర్, కోన వెంకట్, ప్రశాంత్ వర్మ, మధుర శ్రీధర్, సుప్రియ, విద్యా కొప్పినీడు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ బిజినెస్ హెడ్ సునీల్ చైనాని మాట్లాడుతూ, దక్షిణ భారత సినిమాలు కథలు చెప్పడంలో ఎప్పుడూ ముందుంటాయని తెలిపారు.

తమిళంలో తమ ప్రయాణం విజయవంతంగా సాగిందని, ఇప్పుడు కనకదుర్గతో తెలుగులోకి రావడం ఆనందంగా ఉందన్నారు. భక్తి, సంస్కృతి, భావోద్వేగాల ఎలిమెంట్స్ తో సినిమా రూపొందుతుందని చెప్పారు. నిర్మాతలు అజిత్ ఠాకూర్, బీవీఎస్ రవి మాట్లాడుతూ.. మూవీ కథ తెలుగు సంస్కృతి, ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉంటుందని పేర్కొన్నారు. తమ బ్యానర్‌ లో ఇది తొలి తెలుగు సినిమా కావడం గర్వంగా ఉందని తెలిపారు.

మంచి భాగస్వామ్యంతో రూపొందిస్తున్నామని, అమ్మవారి ఆశీస్సులతో ప్రయాణం ప్రారంభమైందని అన్నారు. దర్శకుడు ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ, కనకదుర్గ మూవీ తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పారు. దర్శకుడిగా మాత్రమే కాకుండా.. అమ్మవారిపై తనకున్న భక్తి కారణంగా ప్రాజెక్ట్ తన హృదయానికి దగ్గరైందన్నారు. ఇది కేవలం భక్తి కథ మాత్రమే కాకుండా, ఒక మనిషి గొప్ప శక్తిని ఎదుర్కొన్నప్పుడు జరిగే పరిణామాలను చూపించే కథ అని వివరించారు. పూజా కార్యక్రమం చివర్లో కనకదుర్గ అమ్మవారి దివ్య శక్తిని స్మరించుకుంటూ ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మహిళలు.. అమ్మవారి శక్తి, కరుణను గౌరవిస్తూ ప్రార్థనలు చేశారు.