ప్రాసలకు, కౌంటర్లకు కాలం చెల్లిపోయింది!
కానీ ఇది సాద్యపడదని తేలిపోయింది. ఈ విషయం స్వయంగా నరేష్ రివీల్ చేసారు.
By: Tupaki Desk | 21 Nov 2025 12:42 PM ISTఒకప్పుడు అల్లరి నరేష్ నుంచి ఏడాదికి ఆరేడు సినిమాలైనా రిలీజ్ అయ్యేవి. కామెడీ స్టార్ కావడం.. తక్కువ బడ్జెట్ లో నే సినిమాలు పూర్తవ్వడంతో? దర్శక, నిర్మాతలు అంతే చొరవతో ముందుకొచ్చేవారు. విజయాలతో మంచి లాభాలు కనిపించేవి. అయితే ఇప్పుడా జానర్లో సినిమాలు రావడం లేదు. కొంత కాలంగా నరేష్ కూడా స్టైల్ మార్చి సినిమాలు చేస్తున్నారు. కొత్త కొత్త జానర్లో సినిమాలు చేస్తున్నారు. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో ఒకప్పటి నరేష్ ని మళ్లీ చూడగలమా? అన్న సందేహం చాలా మందిలో ఉంది.
కామెడీ అంటే చులకనగా చూస్తున్నారు:
కానీ ఇది సాద్యపడదని తేలిపోయింది. ఈ విషయం స్వయంగా నరేష్ రివీల్ చేసారు. `కామెడీ రచయితలు, దర్శకులు తగ్గిపోయారు. అందరు పెద్ద సినిమాలు, సీరియస్ గా సాగే కథలపై దృష్టి పెడుతున్నారన్నారు. చాలా మందిలో ఇప్పుడు కామెడీ అంటే చిన్న చూపుగా మారింది. ఆ జానర్లో సినిమా ఏంటిలే? అనే స్థాయికి కామెడీ పడిపోయిందన్నారు. `కానీ నవ్వించడం కష్టమైన కళ. అదంత సులభం కాదన్నది ఆ జానర్లో పనిచేసిన వారికే తెలుస్తుందన్నారు. కామెడీ అంటే ప్రత్యేకంగా సృష్టించి సహజంగా నవ్వించాలి. ఈ మధ్య కాలంలో అందరూ సున్నితమైపోయారన్నారు.
జోకులన్నీ సోషల్ మీడియాలోనే:
ఎవరి మీద జోక్ వేయాలన్నా? భయమేస్తుంది. ఎందుకంటే మనోభావాలు దెబ్బతింటున్నాయనే అనే అశం నిత్యం తెర మీదకు వస్తోందన్నారు. `సీమశాస్త్రి`, `కితకితలు` లాంటి సినిమాలు ఇప్పుడు రిలీజ్ చేస్తామంటే ఎవరూ చేయడానికి కూడా ముందుకు రారేమో. ప్రాసలకు, కౌంటర్లకు కాలం చెల్లిపోయిందన్నారు. ఒకప్పుడు వాటికి మంచి డిమాండ్ ఉండేది. కౌంటర్లు వేస్తే పగలబడి నవ్వేవారు. ఇప్పుడు కౌంటర్ వేస్తే అదోలా చూస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి జోకులు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అంతా చూస్తూనే ఉన్నాం.
మూడేళ్ల తర్వాత దర్శకుడిగా:
ఇప్పుడు కామెడీ జానర్ చేయాలన్నా? అది ఎవరికీ తెలియంది అయి ఉండాలి. కేవలం కథతోనే నవ్వించాలన్నారు. తదుపరి తాను చేసే రెండు సినిమాలు అలాగే ఉంటాయన్నారు. డైరెక్టర్ గా కూడా పనిచేయాలని ఉందని మరో రెండు మూడేళ్ల తర్వాత అందులోకి దిగుతానన్నారు. `నటుడిగా అయితే ఏడాది రెండు..మూడు సినిమాలు చేయోచ్చు. దర్శకుడు అయితే ఏడాదన్నరకు ఒక సినిమా మాత్రమే చేయగలం. దర్శకుడిగా ఒక సినిమా చేసిన తర్వాత తమ కథల్లో జోక్యం చేసుకుంటాడు? అన్న భయం కూడా చాలా మందిలో ఉంటుంది. దర్శకుడు అయితే ఈ పరిస్థితిని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే దర్శకత్వానికి ప్రస్తుతానికి దూరంగా ఉన్నానన్నారు.
