Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక రెండేళ్ల నిషేధం..!

తెలుగు బిగ్ బాస్ ఫాలో అవుతున్న వారందరికీ అలీ రెజా గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు

By:  Tupaki Desk   |   1 March 2024 4:30 PM GMT
బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక రెండేళ్ల నిషేధం..!
X

తెలుగు బిగ్ బాస్ ఫాలో అవుతున్న వారందరికీ అలీ రెజా గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. అంతకుముందు సీరియల్స్ లో అతను నటిస్తుండగా బిగ్ బాస్ వల్ల అతనికి మరింత క్రేజ్ ఏర్పడింది. బిగ్ బాస్ సీజన్ 3 లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న అలీ రెజా సడెన్ ఎలిమినేషన్ ఆ తర్వాత రీ ఎంట్రీ ఇవన్నీ షోని ప్రేక్షకులకు దగ్గర చేయడంలో భాగమయ్యాయి. అయితే బిగ్ బాస్ షో తర్వాత తనను రెండేళ్ల పాటు సీరియల్స్ నుంచి నిషేధించారని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు అలి రెజా. బిగ్ బాస్ షోకి వెళ్లొచ్చాక ఒక ఛానెల్ తనపై నిషేధం విధించిందని అందుకు సంబందించిన విషయాలను వెల్లడించారు.

బిగ్ బాస్ షోకి వెళ్లకముందు సీరియల్స్ చేస్తుండే వాడిని.. షోకి వెళ్లొచ్చాక తిరిగి సీరియల్స్ చేయాలని అనుకున్నా. కానీ బిగ్ బాస్ స్టేజ్ మీదే నాగార్జున గారు వైల్డ్ డాగ్ లో రోల్ గురించి చెప్పారు. ఆ తర్వాత డైరెక్టర్ ని కలిస్తే ఆయన అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో ఫైట్ సీన్స్ కోసం రోజు పొద్దున్నే ప్రాక్టీస్ ఉంది. రెండు రోజులు రాకపోతే సినిమాలో నుంచి వెళ్లి పోవాల్సి ఉంటుందని ముందే చెప్పారు. ఆ టైం లోనే సీరియల్ వాళ్లు పిలిచి క్లోజ్ చేస్తున్నాం నువ్వు రావాలని అన్నారు. అయితే టైమింగ్స్ బట్టి వస్తానని చెప్పాను.

ఆ టైం లో ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ఫోన్ వచ్చింది. వెళ్లి పరిస్థితి అంతా వివరించాను. ఆ తర్వాత వైల్డ్ డాగ్ షూటింగ్ లో పాల్గొన్నాను. ఆ టైం లో కౌన్సిల్ మీటింగ్ ఉంది రావాలని ఫోన్ వచ్చింది. తాను ఇప్పుడు రాలేను సాయంత్రం గంట పర్మిషన్ తీసుకుని వస్తానని చెప్పా. ఇది జరిగిన రెండు రోజులకే తనను బ్యాన్ చేసినట్టు.. రెండేళ్లు ఎవరు షూటింగ్స్, షోలకు పిలవొద్దని మెసేజ్ వచ్చింది. ఇలా ఎలా చేస్తారని చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చారు అలి రెజా.

బిగ్ బాస్ షోలో పాల్గొంటే ఒక ఏడాది పాటు అదే ఛానల్ లో షోస్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు వేరే ఛానెల్ వాళ్లు ఆ షోకి వెళ్తే తిరిగి మళ్లీ ఆ ఛానల్ లోకి రావడం కష్టం. ఆల్రెడీ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన అవినాష్ కూడా అక్కడ డబ్బులు కట్టి బిగ్ బాస్ షోలో పాల్గొన్నానని చెప్పిన విషయం తెలిసిందే. అలి రెజా విషయంలో వేరే ఛానెల్ వారు సీరియల్స్ నుంచి అతన్ని బ్యాన్ చేశారు.