నిర్మాణ రంగంలోకి హీరోయిన్ నాల్గవ ప్రాజెక్ట్!
బాలీవుడ్ లో హీరోయిన్ గా అలియాభట్ కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో సైతం అవకాశాలొస్తున్నా?
By: Tupaki Desk | 14 April 2025 11:57 AM ISTబాలీవుడ్ లో హీరోయిన్ గా అలియాభట్ కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో సైతం అవకాశాలొస్తున్నా? మాతృ భాషపై మమకారంతో అక్కడే కొనసాగుతుంది. తెలుగు సినిమాల్లో బిజీ అవ్వడానికి ఇంకా ముందుంది సమయం అంటూ వెయిట్ చేస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో మాత్రం క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. అలాగే సొంతంగా ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్ నిర్మాణ సంస్థను స్థాపించి ఆ రంగంలోనూ బిజీగా ఉంది.
ఇప్పటికే `డార్లింగ్స్`, `జిగ్రా` లాంటి చిత్రాలు నిర్మించింది. `పోచర్` అనే టీవీ సిరిస్ ను నిర్మించి తొలి సక్సెస్ అందుకుంది. క్రైమ్ డ్రామా ప్రేక్షకుల్ని బాగానే ఎంగేజ్ చేసింది. ఈ సిరీస్ ను సూపర్ స్టార్ మహేష్ కూడా ప్రశంసిస్తూ అప్పట్లో సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టడం తెలుగింట కలిసొచ్చింది. `డార్లింగ్స్` యావరేజ్ గా ఆడగా `జిగ్రా` ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఆ తర్వాత మళ్లీ సొంత సంస్థలో సినిమా నిర్మాణం చేపట్టలేదు.
అయితే తాజాగా అమ్మడు మరోటీవీ సిరీస్ నిర్మించడానికి రెడీ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ తో కలిసి ఈ సిరీస్ నిర్మిస్తుంది. కొత్త ప్రతిభావంతుల్ని ప్రొత్సహిస్తూ చేస్తోన్న సిరీస్ ఇది. కొత్త వాళ్లను మాత్రమే తెరకు పరిచయం చేయాలనే లక్ష్యంతో అలియా భట్ ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తుంది. దీనికి సంబంధించిన అధికా రిక వివరాలు త్వరలోనే అలియా స్వయంగా ప్రకటించనుందని సమాచారం.
ఇండస్ట్రీలో తాను ఎదగడమే కాకుండా ఔత్సాహికుల్ని కూడా తెరపైకి తీసుకురావాలనే అలియా ఆలోచన ఎంతో గొప్పది. అవకాశాల కోసం ఎంతో మంది ప్రతిభావంతులు ఎదురు చూస్తున్నారు. అవకాశాలు అందుకున్న వారంతా ఓ టీటీలో సక్సెస్ అయిన తర్వాత వెండి తెరకు ప్రమోట్ అవుతున్నారు. ఇంకా చెప్పాలంటే? వెండి తెరను మించి బుల్లి తెర ఇప్పుడు ఇండస్ట్రీని ఏల్తుంది అన్నది వాస్తవం.
