Begin typing your search above and press return to search.

అలియా చెప్పేది ఒకటి.. చేసేది ఇంకోటా?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఇటీవల మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కారణం ఆమె ఆరోగ్యంపై చూపిన శ్రద్ధ కాదు, అదే సమయంలో ఆమె చేసే యాడ్స్ పై వినిపిస్తున్న విమర్శలు.

By:  Sravani Lakshmi Srungarapu   |   13 Jun 2026 1:52 PM IST
అలియా చెప్పేది ఒకటి.. చేసేది ఇంకోటా?
X

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఇటీవల మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కారణం ఆమె ఆరోగ్యంపై చూపిన శ్రద్ధ కాదు, అదే సమయంలో ఆమె చేసే యాడ్స్ పై వినిపిస్తున్న విమర్శలు. ప్రముఖ టాక్ షోలో పాల్గొన్న టైమ్ లో జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. షోలో పాల్గొన్న అతిథులందరికీ కాఫీ అందించగా, అలియా భట్ మాత్రం ప్రత్యేకంగా బ్లాక్ టీ కోరినట్లు సమాచారం. టీమ్ ఆమెకు బ్లాక్ టీ అందించిన తర్వాత, అందులో షుగ‌ర్ కలిపారా అని ఆమె అడిగిందట. కొద్దిగా చక్కెర వేసినట్లు సిబ్బంది చెప్పగానే, ఆ టీని తిరిగి ఇచ్చేసి చక్కెర ఆరోగ్యానికి మంచిది కాదని, పండ్ల ద్వారా లభించే సహజ చక్కెరను మాత్రమే తీసుకోవాలని సూచించిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనం చెబుతోంది.

సాధారణంగా చూస్తే ఇది ఆరోగ్యంపై అవగాహన కలిగిన వ్యక్తి తీసుకున్న వ్యక్తిగత నిర్ణయంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికీ తమ ఆహారపు అలవాట్లు, హెల్త్ టార్గెట్స్, జీవనశైలికి అనుగుణంగా ఎంచుకునే హక్కు ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన ప్రముఖులు తమ ఫిట్‌నెస్, డైట్ విషయంలో చాలా కఠినమైన నియమాలు పాటించడం కొత్త విషయం కాదు. అయితే ఇక్కడే మరో ప్రశ్న తలెత్తుతోంది. ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో షుగ‌ర్ కు దూరంగా ఉండే సెలబ్రిటీలు, మరోవైపు అధిక షుగ‌ర్ కలిగిన ఆహార పదార్థాల ప్రకటనల్లో కనిపించడం ఎంతవరకు సమంజసం?

అలియా భట్ ప్రస్తుతం ప్రచారం చేస్తున్న కొన్ని ఫుడ్ బ్రాండ్స్ లో అధిక మోతాదులో చక్కెర ఉండటం గమనార్హం. ఉదాహరణకు ఆమె ప్రచారం చేసిన ఒక ప్రముఖ కుకీ ఉత్పత్తిలో 100 గ్రాములకు 35 గ్రాములకు పైగా షుగ‌ర్ ఉన్నట్లు పోషకాహార వివరాలు సూచిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు తన కోసం ఒక రూల్, వినియోగదారుల కోసం మరో రూలా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ అంశాన్ని మరో కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఒక సెలబ్రిటీ వ్యక్తిగతంగా ఏ ఆహారం తీసుకోవాలో త‌న పూర్తిగా త‌న ప‌ర్స‌న‌ల్ డెసిష‌న్. అదే సమయంలో ఒక బ్రాండ్‌కు ఎండార్స్ చేయడమ‌నేది ప్రొఫెష‌న‌ల్ డీల్. అందువల్ల వ్యక్తిగత అభిరుచులు, వాణిజ్య ప్రకటనలను పూర్తిగా ఒకే తాటిపై కొలవడం సరైన విశ్లేషణ కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

కానీ ప్రజారోగ్య నిపుణులు మాత్రం మరో అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. భారీ అభిమాన గణం కలిగిన సెలబ్రిటీలు ఏ ప్రొడ‌క్ట్‌ను ప్రచారం చేసినా అది వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పిల్లలు, యూత్ తమ అభిమాన నటీనటులు చెప్పే విషయాలను ఎక్కువగా నమ్మే అవకాశం ఉంటుంది. ఇదే కారణంగా నార్వే, యునైటెడ్ కింగ్‌డమ్, స్పెయిన్, బ్రూనై, సింగపూర్ వంటి కొన్ని దేశాలు అధిక షుగ‌ర్, జంక్ ఫుడ్ లేదా ఆరోగ్యానికి హానికరంగా భావించే ఉత్పత్తుల ప్రచారంపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీల ప్రమోషన్లపైనా పరిమితులు విధించాయి.

భారతదేశంలో మాత్రం ఇలాంటి నియంత్రణలు ఇంకా పరిమిత స్థాయిలోనే ఉన్నాయి. ఆహార ఉత్పత్తులపై పోషకాహార వివరాలు తప్పనిసరి అయినప్పటికీ, ప్రముఖుల ఎండార్స్‌మెంట్ల విషయంలో మరింత కఠినమైన మార్గదర్శకాలు అవసరమనే వాదనలు తరచూ వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ వివాదం అలియా భట్ గురించే కాదు. ప్రజల ఆరోగ్యం, సెలబ్రిటీల సామాజిక బాధ్యత, ప్రకటనల నైతికత మధ్య ఉన్న సున్నితమైన సంబంధాన్ని మరోసారి గుర్తు చేస్తోంది.