ఆ ఫ్లాప్ మూవీ అధ్యాయం ముగిసింది
హిందీ సినిమాలు, సీరియల్స్‌తో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న నటుడు అలీ ఫజల్. తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకున్నాడు.
By: Tupaki Desk | 18 July 2025 12:03 PM ISTహిందీ సినిమాలు, సీరియల్స్‌తో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న నటుడు అలీ ఫజల్. తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకున్నాడు. కేవలం హిందీలోనే కాకుండా ఇంగ్లీష్‌లోనూ ఎక్కువ సినిమాలు, సిరీస్‌లు చేసి అరుదైన ఘనత దక్కించుకున్నాడు. తన మొదటి సినిమాతోనే ఇంగ్లీష్ ప్రేక్షకుల ముందుకు వెళ్లిన అలీ ఫజల్ ఆ తర్వాత కూడా పలు ఇంగ్లీష్ సినిమాలు చేశాడు. చైనీస్ మూవీని చేసి అరుదైన ఘనత దక్కించుకున్నాడు. చేసిన ప్రతి సినిమాలోనూ విలక్షణ నటనతో మెప్పిస్తూ వచ్చాడు. ఇప్పటి వరకు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు చేసిన అలీ ఫజల్ ఇటీవల తమిళ మూవీ థగ్ లైఫ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
సౌత్ నుంచి చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చిన అలీ ఫజల్ థగ్ లైఫ్ కి మాత్రం ఓకే చెప్పాడు. ఆ సినిమాలోని అలీ పాత్ర విషయంలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాంటి చెత్త పాత్రను అలీ ఎలా ఒప్పుకున్నాడు అంటూ చాలా మంది కూడా విమర్శలు చేశారు. హిందీలో ఈ సినిమాను చూసిన వారు అలీ స్థాయికి తగ్గ పాత్ర ఇది కాదు, అయినా కూడా ఈ పాత్రకు ఎలా ఓకే చెప్పి ఉంటాడు అనే చర్చ జరిగింది. మొత్తంగా చాలా రకాలుగా ఆ సినిమాలోని అలీ పాత్ర గురించి ట్రోల్స్ వచ్చాయి, మీమ్ మెటీరియల్‌గా చాలా మంది అతడిపై కామెంట్స్ చేస్తూ జోకులు వేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో అలీ ఫజల్ తన థగ్ లైఫ్ జర్నీ, ఆ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్న తీరు గురించి చెప్పుకొచ్చాడు. తనకు మణిరత్నం సినిమాలు అంటే చాలా ఇష్టం, ఆయన ప్రత్యేకమైన ప్రపంచంలో సినిమాలు తీస్తూ ఉంటాడు. ఆయన సినిమాలు చాలా గొప్పగా ఉంటాయి. అందుకే ఆయనతో సినిమాలు చేయాలి అనుకున్నాను. ఆయన సినిమా కోసం అడిగినప్పుడు కాదు, నో అని చెప్పలేక పోయాను. అంతకు ముందు సౌత్ సినిమాలు చేయలేదు, ఈ సినిమాతో ఖచ్చితంగా అక్కడ మంచి ఎంట్రీ లభిస్తుందని భావించాను. కానీ తాను అనుకున్న విధంగా జరగలేదు. అయినా కూడా నిరాశ లేదని, మణిరత్నం సర్‌తో చేసినందుకు సంతృప్తిగానే ఉన్నట్లు పేర్కొన్నాడు.
థగ్ లైఫ్ సెట్‌లో మణిరత్నం సర్ నుంచి దక్కిన ఆహ్వానం ఎప్పటికీ మరచిపోలేను. కమల్ హాసన్ సర్ సైతం సెట్స్ లోకి సాదరంగా ఆహ్వానించారు. సినిమా కథ చెప్పిన సమయంలో ఉన్నది ఒకటి, ఆ తర్వాత చాలా సార్లు మార్పులు చేస్తూనే వచ్చారు. ఒక్కసారి కూడా నేను మణిరత్నం గారిని ప్రశ్నించలేదు. ఆయన్ను నమ్మాను సినిమాను చేశాను, ఆ పాత్ర విషయంలో కొందరు చేస్తున్న విమర్శలు బాధకు గురి చేశాయి. కానీ అన్ని పాత్రలు అద్భుతంగా రావాలంటే సాధ్యం కాదు, కొన్ని సినిమాలు ఇలా కూడా ఉంటాయి అనుకోవాల్సిందే అన్నట్లుగా అలీ ఫజల్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. థగ్ లైఫ్ అనేది అయిపోయిన అధ్యాయం. దాని గురించి మళ్లీ మళ్లీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లుగా సున్నితంగా టాపిక్ ను అలీ ఫజల్ స్కిప్ చేశాడు.
