నా మేనల్లుడు ఓ అమ్మాయి వల్ల చనిపోయాడు
కమెడియన్ గా, హీరోగా ఎన్నో సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులని అలరించిన అలీ ఇప్పుడు ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు.
By: Tupaki Desk | 10 July 2025 12:17 PM ISTకమెడియన్ గా, హీరోగా ఎన్నో సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులని అలరించిన అలీ ఇప్పుడు ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ల సినిమాల్లో నటించడంతో పాటూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా కూడా సత్తా చాటిన అలీ ఇప్పుడు సుహాస్ హీరోగా మాళవిక మనోజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఓ భామ అయ్యో రామ సినిమాలో కీలకపాత్రలో నటించారు.
జులై 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా మేకర్స్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈవెంట్ లో భాగంగా అలీ మాట్లాడుతూ తన మేనల్లుడిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. డైరెక్టర్ రామ్ తన వద్దకు వచ్చి సుహాస్ కు మేనమామ క్యారెక్టర్ చేయాలన్నారని, దానికి వెంటనే తాను ఓకే చెప్పానని, ఎంతిస్తారని అడక్కుండా ఎన్ని రోజులు కావాలని అడిగానని చెప్పారు.
ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం, తనకు 15 ఏళ్ల కిందట ఓ మేనల్లుడుండేవాడని, పిల్లాడి చిన్న వయసులోనే అక్క చనిపోవడంతో మేనల్లుడిని కూడా తన తల్లే పెంచిందని, మనవడే అయినప్పటికీ కొడుకులా చూసుకుందని, మేనల్లుడు తన ముందే పెరిగాడని, వాడు పెద్దయ్యాక ఓ అమ్మాయి ప్రేమించాడని, ఆ అమ్మాయి నో చెప్పడంతో సూసైడ్ చేసుకున్నాడని చెప్పారు అలీ.
కొడుకులా పెంచుకున్న మనవడు చనిపోవడంతో తన తల్లి ఎంతో బాధపడిందని, రెండేళ్ల పాటూ ప్రతీ రోజూ ఆమె ఏడ్చేదని, డైరెక్టర్ రామ్ ఈ కథ చెప్పగానే తనకు తన మేనల్లుడు గుర్తొచ్చాడని, సుహాస్ లో చనిపోయిన తన మేనల్లుడి చూసుకున్నానని, అందుకే ఈ క్యారెక్టర్ కు తాను ఎక్కువ కనెక్ట్ అవగలిగానని అలీ ఎమోషనల్ అయ్యారు. కాగా సినిమాలో సుహాస్, అలీ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయని చిత్ర యూనిట్ మొదటి నుంచి చెప్తోంది.
