Begin typing your search above and press return to search.

మెగాస్టార్‌ని అనుక‌రించిన న‌టుడికి 200కోట్లు

అయితే ప్ర‌తిసారీ ఇదే త‌ర‌హా పాత్ర‌లు త‌న‌ను వెంబ‌డించ‌డంతో అత‌డు మ‌రాఠీ సినిమాల వైపు వెళ్లాడు.

By:  Sivaji Kontham   |   18 Aug 2025 9:07 AM IST
మెగాస్టార్‌ని అనుక‌రించిన న‌టుడికి 200కోట్లు
X

అనుక‌ర‌ణ అనేది గొప్ప విద్య‌. ఒక న‌టుడిని అనుక‌రించ‌డం, అది ప్ర‌జ‌లంద‌రికీ న‌చ్చ‌డం ఆ న‌టుడికి ప‌దే ప‌దే అలాంటి మ‌రిన్ని అవ‌కాశాల్ని తెస్తాయి. అలా చాలా సినిమాల్లో పెద్ద స్టార్ల‌కు చిన్న‌ప్ప‌టి పాత్ర‌ల్లో మెరిసాడు అలంకర్ జోషి.

అత‌డు ఇప్ప‌టికి 100 కి పైగా హిందీ చిత్రాలలో నటించాడు. బాలనటుడిగా ఏలాడు. దీవార్ (1975), మజ్‌బూర్ (1974), సీతా ఔర్ గీత (1972) వంటి కల్ట్ క్లాసిక్‌లలో అత‌డి నటన ఇంటి పేరుగా మారింది. దీవార్ అలంకర్ అని కూడా అత‌డిని కొన్నాళ్ల పాటు పిలిచారు. అతడు బ్లాక్ బ‌స్ట‌ర్ దీవార్ (1975) చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కి చిన్న‌ప్ప‌టి పాత్ర‌లో న‌టించాడు.

బాలుడైన అలంక‌ర్ .. అమితాబ్ త‌ర‌హా ఆహార్యం అంద‌రి హృద‌యాల‌ను గెలుచుకుంది. అయితే ఈ పాత్ర‌కు అత‌డిని ఎంపిక చేయాల్సిందిగా మెగాస్టార్ అమితాబ్ స్వ‌యంగా య‌ష్ రాజ్ ఫిలింస్ కి సూచించారని అలంక‌ర్ జోషి సోద‌రి ప‌ల్ల‌వి జోషి చెప్పారు. అచ్చు గుద్దిన‌ట్టు అమితాబ్ న‌ట‌న‌ను రీక్రియేట్ చేసే ప్ర‌తిభ‌ అలంక‌ర్ కి ఇలాంటి అవ‌కాశం ద‌క్కేట్టు చేసింది.

అయితే ప్ర‌తిసారీ ఇదే త‌ర‌హా పాత్ర‌లు త‌న‌ను వెంబ‌డించ‌డంతో అత‌డు మ‌రాఠీ సినిమాల వైపు వెళ్లాడు. ఆ త‌ర్వాత సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా మారాడు. అమెరికా వెళ్లి రెండేళ్ల పాటు సాఫ్ట్ వేర్ కంపెనీలో ప‌ని చేసాడు. చివ‌రికి సొంత సంస్థ‌ను స్థాపించాడు. స‌హ‌వ్య‌వ‌స్థాప‌కుడుగా కంపెనీని న‌డిపిస్తున్నాడు. ఇప్పుడు ఆ కంపెనీ నిక‌ర ఆస్తుల విలువ సుమారు 200 కోట్లు. దాదాపు 35 ఏళ్లుగా అత‌డు అమెరికాలో స్థిర‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం విజ‌య‌వంత‌మైన కంపెనీని నిర్వ‌హిస్తున్నాడు.

తాను న‌ట‌న‌కు దూరంగా ఉన్నా కానీ త‌న కుమార్తెలు హాలీవుడ్ లో న‌టిస్తున్నారు. అనుజా జోషి `హలో మినీ`లో తన పాత్రతో పాపుల‌ర‌య్యారు. అలంక‌ర్ వార‌సుడు మాత్రం సంగీత రంగంలో రాణిస్తున్నాడు. భార్య, కవల కుమార్తెలు ఒక కొడుకుతో ప్రైవేట్ జీవితాన్ని గ‌డిపేందుకు అలంక‌ర్ జోషి ఇష్ట‌ప‌డ‌తారు.