Begin typing your search above and press return to search.

కన్నప్ప.. బాలీవుడ్ స్టార్ కూడా వచ్చేశాడు!

టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 April 2024 5:43 AM GMT
కన్నప్ప.. బాలీవుడ్ స్టార్ కూడా వచ్చేశాడు!
X

టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు మహా భారతం సీరియల్‌ ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కన్నప్ప పాత్రలో విష్ణు నటిస్తుండగా.. మిగతా రోల్స్ లో భారతీయ దిగ్గజ నటి నటులు కనిపించనున్నారు. క్యాస్టింగ్ తోనే మినిమమ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు.


ఈ బిగ్ ప్రాజెక్ట్ లో ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, నయనతార, మధుబాల వంటి స్టార్ నటీనటులు యాక్ట్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ ఈ సినిమాలో శివుడి పాత్ర పోషిస్తారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ ఆయన నందీశ్వరుడి రోల్ చేస్తారని లేటెస్ట్ టాక్. మహా శివుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కనిపించనున్నారని సినీ వర్గాల్లో కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది.

తాజాగా ఈ విషయంపై అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు మంచు విష్ణు. శివుడి పాత్ర విషయంలో అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా.. అక్షయ్ కుమార్ ను కన్నప్ప ప్రాజెక్ట్ లోకి ఆహ్వానించారు విష్ణు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షూటింగ్ కోసం అక్షయ్ కుమార్ రాగా.. విష్ణు వెల్ కమ్ చెప్పారు. పూలమాల వేసి, శాలువా కప్పి సత్కరించారు.

అనంతరం మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మంచు విష్ణు చర్చలు జరిపారు. "సూపర్ స్టార్ మిస్టర్ అక్షయ్ కుమార్‌ ను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు స్వాగతిస్తున్నందున కన్నప్ప ప్రయాణం మరింత ఉత్కంఠభరితంగా మారింది. కన్నప్పతో తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్నందుకు థ్రిల్‌ గా ఉంది. మరపురాని సాహసానికి సిద్ధంగా ఉండండి!" అని మంచు విష్ణు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

ఈ సినిమాతోనే అక్షయ్.. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. 31 ఏళ్ల క్రితం కన్నడ సినిమా చేసిన అక్షయ్.. ఆ తర్వాత 2018లో రజినీకాంత్ రోబో 2.0 మూవీతో కోలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు కన్నప్ప మూవీతో తెలుగులో సందడి చేయనున్నారు. అక్షయ్ రాకతో ఆ ప్రాజెక్ట్ కు బాలీవుడ్ టచ్ కూడా ఇచ్చినట్లు అయింది. దీంతో కన్నప్పకు బీ టౌన్ లో మంచి థియేట్రికల్ బిజినెస్ జరగనుందని సినీ పండితులు అంటున్నారు. మరి ఈ మూవీ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.