ప్రాణాలకు భరోసా: స్టంట్‌మన్‌ల పాలిట దేవుళ్లు ఈ స్టార్ హీరోలు
సౌత్ సినీపరిశ్రమలో ఇలాంటి సహాయం చేసిన మొదటి హీరోగా తమిళ స్టార్ హీరో సూర్యకు గుర్తింపు ఉంది. అతడు తన సొంత సంస్థ ద్వారా స్టంట్ మన్ లకు ఇన్సూరెన్స్ చేయించారు.
By: Sivaji Kontham | 17 July 2026 12:07 PM ISTసినిమాల్లో హీరోల ఎలివేషన్ల కోసం.. ప్రేక్షకుల థ్రిల్ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టే స్టంట్‌మన్‌ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు భారీ పారితోషికాలు అందుకునే స్టార్ హీరోలు ఏదైనా చేస్తున్నారా? అంటే ఈ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇక్కడ ఉంది. అనునిత్యం ఎప్పుడు ఏ ప్రమాదం ఎట్నుంచి ముంచుకొస్తుందో తెలీని రిస్కీ జాబ్ స్టంట్ మన్ జాబ్. రిస్క్ అని తెలిసి కూడా వెనకాడరు. అసిస్టెంట్ స్టంట్ మన్లు ఒక్కోసారి ప్రాణాలమీదికి తెచ్చుకున్న సందర్భాలున్నాయి. అయితే అలాంటి వారికి కనీస గ్యారెంటీ ఇచ్చేందుకు ఇన్సూరెన్స్ చేయించడం అనేది తప్పనిసరి. అయితే ధనబలం సినిమాలు నిర్మించే అన్ని బ్యానర్లకు ఉండకపోవచ్చు. అందుకే ఇండస్ట్రీలో భారీ పారితోషికాలు అందుకునే హీరోలు దీనికోసం ఏదైనా సహాయం చేస్తే అది వారి కుటుంబాలకు భరోసాగా భావించవచ్చు.
సౌత్ సినీపరిశ్రమలో ఇలాంటి సహాయం చేసిన మొదటి హీరోగా తమిళ స్టార్ హీరో సూర్యకు గుర్తింపు ఉంది. అతడు తన సొంత సంస్థ ద్వారా స్టంట్ మన్ లకు ఇన్సూరెన్స్ చేయించారు. ఇప్పుడు అదే బాటలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్టంట్ మన్ల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపారు. తాను రీల్ హీరో మాత్రమే కాదు.. రియల్ హీరో అని నిరూపిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న 650 మందికి పైగా స్టంట్ ఆర్టిస్టులకు అక్షయ్ కుమార్ పర్సనల్‌గా ఇన్సూరెన్స్ చేయించారు. చిత్ర పరిశ్రమలో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న భద్రతా సమస్యలపై చర్చలు జరుగుతున్న తరుణంలో.. అక్షయ్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం హృదయాలను గెలుచుకుంది. ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణ లేకుండా కేవలం రోజువారీ కూలి కోసం ప్రాణాలతో చెలగాటమాడే ఈ తెరవెనుక వీరులకు ఈ నిర్ణయం కొండంత అండగా మారిందని చెప్పొచ్చు.
ఈ ఇన్సూరెన్స్ సదుపాయం ద్వారా యాక్షన్ కమ్యూనిటీకి లభిస్తున్న రక్షణపై ప్రముఖ యాక్షన్ ప్రొఫెషనల్ విక్రమ్ సింగ్ దహియా సంతోషం వ్యక్తం చేశారు. బాలీవుడ్‌లోని సుమారు 650 నుండి 700 మంది స్టంట్‌మన్‌లకు ఈ పాలసీ వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్లాన్ కింద అటు హెల్త్ ఇన్సూరెన్స్.. ఇటు యాక్సిడెంట్ కవరేజీ రెండూ లభిస్తాయి. షూటింగ్ సెట్స్‌లో అయినా లేదా బయట ప్రమాదానికి గురయినా సరే ఇది వర్తిస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగి స్టంట్ పెర్ఫామర్ గాయపడితే.. వారికి రూ. 5 లక్షల నుండి రూ. 5.5 లక్షల వరకు ఉచిత (క్యాష్‌లెస్) వైద్య చికిత్సను పొందే సదుపాయాన్ని అక్షయ్ కుమార్ కల్పించారు.
కోలీవుడ్‌లో పదేళ్లుగా సూర్య ఆదర్శం: రూ. 10 లక్షల కవరేజీ
ఇన్సూరెన్స్ భరోసా కల్పించడంలో తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో సూర్య ఎప్పటి నుంచో ఈ విషయంలో ఆదర్శంగా నిలిచారు. తన సొంత ఫౌండేషన్ ద్వారా గత 10 సంవత్సరాలుగా తమిళ స్టంట్ ఆర్టిస్టుల సంక్షేమం కోసం సూర్య నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రతి ఏటా ఒక్కో స్టంట్ ఆర్టిస్టుకు రూ. 10 లక్షల ఇన్సూరెన్స్ కవరేజీ అందేలా ఆయన బీమా ప్రీమియంలు చెల్లిస్తూ వారి కుటుంబాలకు ధీమా ఇస్తున్నారు.
విషాదాల నేపథ్యంలో పెరిగిన భద్రత అవసరం:
ఇటీవల కాలంలో షూటింగ్ సెట్లలో జరుగుతున్న ప్రమాదాలు ఇండస్ట్రీలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా పా రంజిత్, ఆర్య కాంబినేషన్‌లో వస్తున్న ఒక తమిళ సినిమా షూటింగ్ సెట్‌లో రాజు అనే స్టంట్‌మ్యాన్ ప్రమాదవశాత్తు మరణించడం ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. దశాబ్దాలుగా స్టంట్ ప్రొఫెషనల్స్ కనీస రక్షణ పరికరాలు, ఎలాంటి మెడికల్ బ్యాకప్ లేకుండానే అత్యంత ప్రమాదకరమైన ఫైట్స్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఒక చిన్న గాయమైనా సరే ఆయా పేద కుటుంబాలు ఆర్థికంగా రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది. అందుకే ఇలాంటి ఇన్సూరెన్స్ ప్లాన్లు కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నాయి.
టాలీవుడ్‌లో పరిస్థితి ఏంటి? మన స్టార్ హీరోలు స్పందించేనా?
హిందీలో అక్షయ్ కుమార్, తమిళంలో సూర్య లాంటి స్టార్ హీరోలు స్టంట్‌మన్‌ల పాలిట దేవుళ్లుగా నిలుస్తుంటే.. మరి తెలుగు చిత్రసీమ (టాలీవుడ్) లో పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమయ్యాయి. టాలీవుడ్‌లో కూడా మన స్టార్ హీరోలు చాలా మంది పేద అసిస్టెంట్ స్టంట్‌మన్‌లతో ఎంతో స్నేహంగా, సన్నిహితంగా ఉంటారు. చాలా సందర్భాలలో స్టంట్ మెన్లు గాయపడినప్పుడు లేదా వారి కుటుంబాలు కష్టాల్లో ఉన్నప్పుడు మన స్టార్ హీరోలు గుప్తదానాలు చేసారని కథనాలొచ్చాయి. కానీ గుప్తదానం పదిమందిలో స్ఫూర్తిని నింపదు. అక్షయ్, సూర్య తరహాలో కొంత ప్రచారం కూడా ఇలాంటి మంచిపనికి అవసరం. తెలుగు సినిమాలు ఇప్పుడు పాన్-ఇండియా రేంజ్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో రూపొందుతున్నాయి. మరి ఇంతటి భారీ ప్రాజెక్టుల వెనుక కష్టపడుతున్న తెలుగు స్టంట్‌మన్‌లకు కూడా టాలీవుడ్ హీరోలు ఎవరైనా ఇలాంటి ఇన్సూరెన్స్ భరోసా కల్పిస్తే బాగుంటుందనే ఆశాభావం సినీ వర్గాల నుండి వ్యక్తమవుతోంది.
