కాంబినేషన్ సరే.. రీమేకే బ్యాడ్ ఐడియా
అవన్నీ అతడికి పరాజయాల్ని, పరాభవాల్ని మిగులుస్తాయి. చివరకు అభిమానులకు సమాధానం చెప్పలేక సూపర్ స్టార్ ఆవేదన చెందుతాడు.
By: Tupaki Desk | 6 May 2025 12:30 AMఒక్కో సినిమాకి వందల కోట్లు అందుకునే స్టార్లకు ఎందుకు ఒరిజినల్ కథలు, మంచి స్క్రిప్టులు దొరకడం లేదు? ఈ ప్రశ్న వరుస రీమేక్ లతో విసిగిస్తున్న ఖిలాడీ అక్షయ్ కుమార్ ని బాలీవుడ్ మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదు! అతడు ఎప్పుడూ రీమేక్ లలోనే నటిస్తాడు. అవన్నీ అతడికి పరాజయాల్ని, పరాభవాల్ని మిగులుస్తాయి. చివరకు అభిమానులకు సమాధానం చెప్పలేక సూపర్ స్టార్ ఆవేదన చెందుతాడు.
అక్షయ్ గత పరాభవాల నుంచి పాఠం నేర్చుకోలేదని విమర్శకులు విశ్లేషిస్తున్నా ప్రయోజనం శూన్యం. లక్ష్మీ, బచ్చన్ పాండే, సెల్ఫీ, సర్ఫిరా, కట్‌పుట్లి వంటి రీమేక్ లు అతడికి ఘోర పరాజయాలుగా మారాయి. అయినా ఇప్పటికీ అతడు మారడం లేదు. ఇప్పుడు మరోసారి రీమేక్ లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రియదర్శన్ `ఒప్పం` క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో విజయం సాధించింది. 2016లో కేరళలో ఘనవిజయం సాధించిన ఇదే సినిమాని అక్కీ కథానాయకుడిగా రీమేక్ చేసి, పాన్ ఇండియా ట్రెండ్ లో దేశవ్యాప్తంగా ప్రజలకు మళ్లీ అదే పాతకథను తిప్పి చూపించేందుకు ఉత్సాహంగా ఉన్నారు. అయితే మలయాళ వెర్షన్ అనువాదాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నప్పుడు రీమేక్ ని జనం ఆదరిస్తారా?
ఆ సంగతి ఎలా ఉన్నా.. తాజా రీమేక్ తో తిరిగి తన బెస్టీ సైఫ్ ఖాన్ తో కలిసి అక్షయ్ నటించనున్నాడని తెలుస్తోంది. పలు బాక్సాఫీస్ బ్లక్ బస్టర్లలో కలిసి నటించిన ఈ జోడీ తిరిగి రిపీటవుతోంది అంటే అభిమానుల్లో ఉత్సాహం పుట్టుకొస్తుంది. కానీ మళ్లీ ఒక రీమేక్ కథలో అక్షయ్ నటిస్తే, అలాంటి సినిమాలో సైఫ్ కూడా ఉంటే, అది ఫ్యాన్స్ కి నచ్చుతుందా? అన్నది సందిగ్ధత. తషాన్, మై ఖిలాడి తు అనారి, యే దిల్లగి, తు చోర్ మై సిపాహి, కీమత్ వంటి విజయవంతమైన చిత్రాల్లో అక్షయ్- సైఫ్ కలిసి నటించారు. చాలా కాలానికి మళ్లీ ఆ ఇద్దరినీ కలిపేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్ ఉంది.