అక్కినేని అభిమానుల కోసం మళ్లీ ఆ రెండు రీ-రిలీజ్!
మరిన్ని థియేటర్లలోనూ ఈ రెండు సినిమాలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ కి సంబంధించి థియేటర్లు ఫైనల్ కావాల్సి ఉంది.
By: Tupaki Desk | 18 Sept 2025 6:03 PM ISTతెలుగు సినిమా దిగ్గజం, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వ్యక్తిగత జీవితం-వృత్తిగత జీవితం రెండు తెరిచిన పుస్తకాలే. వారు ఎక్కని శిఖరాలు లేవు. చూడని లోతులు లేవు. నటనకే నటన నేర్పిన మహా నటుడు. ఆయన ముఖమే నటనకు నిఘంటువు. ఏడు దశాబ్దాల పాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలందించిన లెజెండరీ. తాజాగా ఏఎన్నార్ 101వ జయంతి సందర్భంగా అభిమానులకు అక్కినేని కుటుంబం అపూరూప కానుక అందించడానికి రెడీ అయింది. ఏఎన్నార్ నటించిన రెండు క్లాసిక్ చిత్రాలు `డాక్టర్ చక్రవర్తి`, `ప్రేమాభిషేకం` రీ-రిలీజ్ చేస్తున్నారు.
ఈ రెండు సినిమాలకు ఉచిత ప్రదర్శనలకు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 20 నుంచి థియేటర్లో సందడి చేయబోతున్నాయి. మేటి-నేటి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఆ రెండు చిత్రాలతో ఏఎన్నార్ ను అభిమానులు మళ్లీ స్మరించుకోవాలని చేస్తోన్న గొప్ప ప్రయత్నమిది. ఈరోజు నుంచే బుక్ మైషోలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
ఈ టికెట్లు పూర్తిగా ఉచితం. రీ-రిలీజ్ లో భాగంగా కొన్ని థియేటర్లను కేటాయించారు. విజయవాడ స్వర్ణ ప్యాలస్, విశాఖ పట్టణం క్రాంతి థియేటర్లో, ఒంగోలు కృష్ణా టాకీస్ వంటి థియేటర్లో ఉచితంగా ప్రదర్శిస్తున్నారు.
మరిన్ని థియేటర్లలోనూ ఈ రెండు సినిమాలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ కి సంబంధించి థియేటర్లు ఫైనల్ కావాల్సి ఉంది. `ప్రేమాభిషేకం` 1981 లో రిలీజ్ అయింది. ఏఎన్నార్ కెరీర్ సహా తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిలా నిలిచిన చిత్రమిది. ఇందులో శ్రీదేవి, జయసుధ ప్రధాన పాత్రలతో ప్రేక్షకుల హృదయాలకు మరింత దగ్గరయ్యారు. రాజేష్ పాత్రలో ఏఎన్ఆర్ నటన తో అప్పటి తరం ప్రేక్షకుల్లో కన్నీరు పెట్టించారు. క్యాన్సర్ రోగి పాత్రలో రాజేష్ అభినయానికి మంత్ర ముగ్దులు కాని వారుండరు. దాసరి నారయణరావు దర్శకత్వం వహించిన చిత్రమిది.
అప్పట్లోనే ఈ సినిమా థియేటర్లో 300 రోజులకు పైగా ఆడింది. మ్యూజికల్ గానూ సినిమా ఓ సంచలనం. చక్రవర్తి సంగీతం అందించిన పాటలు ట్రెండ్ ని సృష్టించాయి. అలాగే ఎన్నార్ కెరీర్ లో `డాక్టర్ చక్రవర్తి` మరో క్లాసిక్ హిట్ గా నిలిచింది. 1964లో రిలీజ్ అయిన చిత్రమిది. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు. కథ, కథనాలు ఏఎన్నా ర్ నటనతో గొప్ప విజయం సాధించింది. మానసిక సమస్యలు పరిష్కరించే సైకియాట్రిస్ట్ పాత్రలో ఏఎన్నార్ ఒదిగిపోతారు. ఇలాంటి పాత్రలు పోషించాలంటే? ఏఎన్నార్ కి మాత్రమే సాధ్యమవుతుందని మరెవ్వరి వల్ల కాదని ఆదుర్తే ఓ సందర్భంలో ప్రశంసించారు. ఇలాంటి చిత్రాలను నెటి జనరేషన్ యువత చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
