'మనం' మ్యాజిక్ మళ్లీ కావాలంటే అంత ఈజీ కాదేమో..
అయితే అదే కారణం ఇప్పుడు మరో ఫ్యామిలీ మల్టీస్టారర్‌కు పెద్ద సవాలుగా మారిందని టాక్ వినిపిస్తోంది.
By: M Prashanth | 17 July 2026 10:06 AM ISTఅక్కినేని అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మరో ఫ్యామిలీ మల్టీస్టారర్ పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపించే అవకాశాలపై వార్తలు రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ ప్రాజెక్టు విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడం వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉందని సినీ ప్రియలు భావిస్తున్నారు. అదే మనం సినిమా.
2014లో విడుదలైన మనం కేవలం ఒక హిట్ సినిమా మాత్రమే కాదు. అక్కినేని కుటుంబానికి అది ఒక స్పెషల్ మెమోరీ. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ఆ చిత్రం ఎమోషన్స్ తోపాటు పాటు అద్భుతమైన స్టోరీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కుటుంబ కథను ఫాంటసీ అంశాలతో మిక్స్ చేసి దర్శకుడు విక్రమ్ కుమార్ రూపొందించిన విధానం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అందుకే ఇప్పటికీ మనం మూవీకి ప్రత్యేక స్థానం ఉంది.
అయితే అదే కారణం ఇప్పుడు మరో ఫ్యామిలీ మల్టీస్టారర్‌కు పెద్ద సవాలుగా మారిందని టాక్ వినిపిస్తోంది. అక్కినేని కుటుంబం మళ్లీ కలిసి నటిస్తే ప్రేక్షకులు సహజంగా మనంతో పోల్చే అవకాశం ఉంటుంది. కేవలం స్టార్ కాంబినేషన్ సరిపోదు. కథ, భావోద్వేగాలు, పాత్రలు అన్నీ కూడా అదే స్థాయిలో ఉండాలని ప్రేక్షకులు ఆశిస్తారు. దీంతో ఏ కథనైనా మరింత జాగ్రత్తగా పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవలి కాలంలో ప్రేక్షకుల అభిరుచుల్లో కూడా మార్పు వచ్చింది.
ఒకప్పుడు స్టార్ హీరోలు కలిసి నటిస్తే చాలు అనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మాత్రం కథ బలంగా ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. పెద్ద కాస్టింగ్, భారీ బడ్జెట్, ప్రముఖ నిర్మాణ సంస్థలు ఉన్నా కథ ఆకట్టుకోకపోతే సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోవడం కష్టమవుతోంది. అందుకే ప్రస్తుతం చాలామంది హీరోలు స్క్రిప్ట్ విషయంలో రాజీ పడడం లేదు. అక్కినేని కుటుంబానికి సంబంధించిన కొత్త మల్టీస్టారర్ పై వచ్చిన ప్రచారంలో కూడా ఇదే అంశం ప్రధానంగా కనిపిస్తోంది.
ఒకవేళ కథ పూర్తిస్థాయిలో అందరినీ మెప్పించకపోతే, ప్రాజెక్టును వెంటనే ప్రారంభించకుండా మరింత సమయం తీసుకోవడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. అభిమానుల అంచనాలు ఎంత పెద్దవో, వాటిని అందుకోవాల్సిన బాధ్యత కూడా అంతే పెద్దదిగా మారింది. సినీ పరిశ్రమలో ఒక విషయం తరచూ వినిపిస్తోంది. పెద్ద స్టార్ కాంబోను ఫిక్స్ చేయడం కంటే, ఆ కాంబినేషన్ కి సరిపోయే కథను సిద్ధం చేయడమే సవాలు అని.
అక్కినేని కుటుంబం విషయంలో ఆ విషయం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రేక్షకులు మరో సినిమాను కాదు, మరోసారి మనం రేంజ్ ఎక్స్పీరియన్స్ ను ఆశిస్తున్నారు. అందుకే అక్కినేని అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నా, సరైన కథ దొరికే వరకు వేచి చూడాలనే ఆలోచన తప్పు కాదని సినీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే మనం మూవీ లాంటి మ్యాజిక్ మళ్లీ సృష్టించాలంటే కేవలం ముగ్గురు హీరోలు కనిపించడం సరిపోదు. ఆ స్థాయికి తగ్గ కథ కూడా ఉండాల్సిందే.
