Begin typing your search above and press return to search.

అక్కినేని హిట్స్.. ఇంకొక్కటి పడితే..

సినిమాల పరంగా అక్కినేని ఫ్యామిలీకి మళ్లీ మంచి రోజులు వచ్చాయనే చెప్పాలి. నాగార్జున ‘కుబేరా’తో మంచి సక్సెస్ అందుకున్నాడని చెప్పవచ్చు.

By:  Tupaki Desk   |   22 Jun 2025 9:30 AM IST
అక్కినేని హిట్స్.. ఇంకొక్కటి పడితే..
X

సినిమాల పరంగా అక్కినేని ఫ్యామిలీకి మళ్లీ మంచి రోజులు వచ్చాయనే చెప్పాలి. నాగార్జున ‘కుబేరా’తో మంచి సక్సెస్ అందుకున్నాడని చెప్పవచ్చు. ధనుష్ మరో హీరోగా ఉన్నప్పటికీ నాగార్జున పాత్రతోనే అసలు కథ కొనసాగడంతో తెలుగు నాట దీన్ని నాగ్ సినిమాగానే చూస్తున్నారు. ఇక చాలా రోజుల తరువాత నాగ్ కు సాలీడ్ హిట్ పడింది. ఇక రీసెంట్ గా నాగచైతన్య ‘థాండేల్’తో హిట్ కొట్టి అభిమానుల్లో కొత్త జోష్ తీసుకొచ్చారు.

గత కొంతకాలంగా నిరాశపరిచిన ఈ ఇద్దరూ ఇప్పుడు మళ్లీ ట్రాక్‌లోకి రావడం అభిమానులకు సంతోషాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే ఉత్సాహం అఖిల్ భవిష్యత్‌పై కూడా నెలకొంది. ప్రస్తుతం అఖిల్ పరిస్థితి మాత్రం కొంత డిఫరెంట్ గా ఉంది. గతంలో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ఏజెంట్’ పూర్తిగా నిరాశ పరచడంతో కెరీర్‌లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ సినిమాకు వెచ్చించిన బడ్జెట్, కథా రీతిలో తలెత్తిన లోపాలు ఆయన మార్కెట్‌ను దెబ్బతీశాయి.

ఈ దృష్టికోణంలో చూస్తే అఖిల్ చేయబోయే ‘లెనిన్’ సినిమా చాలా కీలకమవుతోంది. ఈ సినిమాపై అఖిల్ అభిమానుల్లో భారీ నమ్మకం నెలకొంది. ఇక నాగార్జున విషయానికొస్తే, చివరగా ‘నా సామి రంగ’ వంటి ఓ రెగ్యులర్ కమర్షియల్ బ్యాక్‌డ్రాప్ కథను ఎంచుకున్నా, ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఆ సినిమా తర్వాత నాగ్ మరికొన్ని నెలలు తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో నిశ్చయించుకోలేకపోయారు.

కానీ కుబేరా కథ వినగానే ఆయన ఓకే చెప్పారని టాక్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఓ నెగటివ్ షేడ్స్ ఉన్న సీబీఐ ఆఫీసర్ పాత్రను అద్భుతంగా పోషించారు. ఆ రోల్‌తో ఆయన మళ్లీ తన సీనియర్ స్టార్డమ్‌ను బలపరిచారు. ఇక నాగచైతన్య విషయానికి వస్తే, ‘థాంక్యూ’, ‘లాల్ సింగ్ చద్దా’ వంటి ప్రయోగాలు ఫలించకపోవడంతో మార్కెట్ పరంగా ఎదురుదెబ్బలు తిన్నడు. అలాంటి సమయంలో దర్శకుడు చందూ మండేటి చెప్పిన కథలోని నిజ జీవిత అంశాలు ఆయనకు నచ్చడంతోనే ‘థాండేల్’ ఓకే చేశాడు.

ఆ చిత్రం విడుదలైన తర్వాత వచ్చిన రెస్పాన్స్ మాత్రం అద్భుతం. ఫస్ట్ వీక్ నుంచే హిట్ టాక్ అందుకుని, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా ద్వారా చైతన్య తన మార్కెట్‌ను రెట్టింపు చేసుకున్నాడు. ఇప్పుడు ఈ రెండు విజయాలతో అక్కినేని ఫ్యామిలీ మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వచ్చింది. ప్రస్తుతం అందరి దృష్టీ అఖిల్‌పై ఉంది. ఈసారి ఎలాంటి ఎక్స్‌పెరిమెంట్ కాకుండా, తన ఇమేజ్‌కు తగ్గ కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక ‘లెనిన్’ పేరు ప్రాజెక్ట్‌కి మంచి పాజిటివ్ బజ్ ఉంది. మరి ఈ సినిమా ఎంతవరకూ అఖిల్‌ను రీబూట్ చేస్తుందో వేచి చూడాలి.