Begin typing your search above and press return to search.

అకీరా నందన్ డీప్ ఫేక్ కలకలం: ఏఐ వీడియో చేసిన వ్యక్తి అరెస్ట్!

నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టెక్నాలజీని వాడుకుని ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా చేయడం ఎంత పెద్ద నేరమో ఈ అరెస్ట్ ద్వారా పోలీసులు స్పష్టమైన సంకేతాలు పంపారు.

By:  M Prashanth   |   25 Jan 2026 11:09 AM IST
అకీరా నందన్ డీప్ ఫేక్ కలకలం: ఏఐ వీడియో చేసిన వ్యక్తి అరెస్ట్!
X

నేటి డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ ఎంతగా ఉపయోగపడుతుందో.. అంతకంటే ఎక్కువగా దుర్వినియోగం అవుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలను డీప్ ఫేక్ ద్వారా మార్చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఈ టెక్నాలజీ బాధితుడిగా మారారు. అకీరాపై అనుచితంగా ఏఐ వీడియో క్రియేట్ చేసిన ఒక వ్యక్తిని కాకినాడ జిల్లా పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

అకీరా నందన్ తన ప్రైవసీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే తన ప్రతిష్టకు భంగం కలిగించేలా.. తన ఫోటోలు, పేరును వాడుతూ కొందరు డీప్ ఫేక్ కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నారని అకీరా గమనించారు. ఇది తన భద్రతకు కూడా ముప్పుగా మారుతోందని భావించిన అతను.. ఇటీవలే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా డీప్ ఫేక్ ఉపయోగించి చేసే ఎలాంటి కంటెంట్‌ను సోషల్ మీడియాలో ప్రసారం చేయకుండా నిలువరించాలని పిటిషన్‌లో కోరారు.

ఈమఫ్యా కాలంలో చాలామంది స్టార్స్ ఇదే తరహాలో పిటిషన్ దాఖలు చేస్తూ వారి హక్కులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ బాటలోనే ఇప్పుడే అఖిరా కూడా చేరారు. న్యాయస్థానం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో పాటు.. పోలీసులు కూడా రంగంలోకి దిగారు. అకీరాపై అభ్యంతరకరమైన ఏఐ వీడియో రూపొందించిన వ్యక్తిని కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు గుర్తించారు.

నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టెక్నాలజీని వాడుకుని ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా చేయడం ఎంత పెద్ద నేరమో ఈ అరెస్ట్ ద్వారా పోలీసులు స్పష్టమైన సంకేతాలు పంపారు. నేటి జనరేషన్ కేవలం వ్యూస్ కోసం ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ ఇబ్బందుల్లో పడుతున్నారు. సాధారణంగా సెలబ్రిటీల పిల్లలు ఇలాంటి సైబర్ దాడులకు గురవుతుంటారు. కానీ అకీరా నందన్ ఈ విషయంలో వెనక్కి తగ్గకుండా చట్టపరంగా పోరాడాలని నిర్ణయించుకోవడం విశేషం.

ఇలాంటి తప్పుడు కంటెంట్‌ను క్రియేట్ చేసే వారికి మాత్రమే కాకుండా.. దాన్ని షేర్ చేసే వారికి కూడా చట్టపరమైన చిక్కులు తప్పవని సైబర్ క్రైమ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన కొద్ది రోజుల్లోనే ఈ అరెస్ట్ జరగడం గమనార్హం. కాకినాడ పోలీసులు నిందితుడి సోషల్ మీడియా ఖాతాలను, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇది కేవలం ఒక వీడియోతో ఆగిందా లేక ఇంకా ఎవరినైనా టార్గెట్ చేశారా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.