Begin typing your search above and press return to search.

ఓపెన్ గ్రౌండ్ 'లెనిన్'దే.. చిన్న సినిమాలు సైడ్ అయినట్లేనా?

ఒక సినిమా హిట్ కావడం ఒక ఎత్తయితే.. ఆ విజయాన్ని ఎంతకాలం కంటిన్యూ చేయగలిగిందన్నది మరో ఎత్తు.

By:  M Prashanth   |   16 July 2026 2:54 PM IST
ఓపెన్ గ్రౌండ్ లెనిన్దే.. చిన్న సినిమాలు సైడ్ అయినట్లేనా?
X

ఒక సినిమా హిట్ కావడం ఒక ఎత్తయితే.. ఆ విజయాన్ని ఎంతకాలం కంటిన్యూ చేయగలిగిందన్నది మరో ఎత్తు. ప్రస్తుతం అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ విషయంలో ఇదే చర్చ సాగుతోంది. తొలి వారం సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఆ సినిమా ఇప్పుడు రెండో వీకెండ్‌ లోకి అడుగుపెడుతోంది. ముఖ్యంగా వీకెండ్ లో పెద్ద తెలుగు సినిమాలు లేకపోవడం లెనిన్ కు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది.

విడుదలైన తొలి రోజు నుంచే మంచి రెస్పాన్స్ దక్కించుకున్న లెనిన్ ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. చాలా కాలం తర్వాత అఖిల్‌ కు వచ్చిన కమర్షియల్ హిట్ కావడంతో అభిమానులు కూడా సినిమాకు అండగా నిలుస్తున్నారు. ఇదే జోరు కలెక్షన్లలో కూడా కనిపిస్తోంది. తొలి వారం ముగిసే సమయానికి సినిమా మంచి వసూళ్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

సాధారణంగా ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు విడుదలవుతుంటాయి. వాటిలో ఏదైనా పెద్ద సినిమా ఉంటే ప్రేక్షకుల దృష్టి వెంటనే ఆ సినిమా వైపు మళ్లిపోతుంది. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ వారంలో విడుదలవుతున్న చిత్రాల్లో ఎక్కువగా చిన్న సినిమాలే ఉన్నాయి. వాటిలో కొన్ని కథాపరంగా ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కనిపించడం లేదు. విడుదలకు ముందు నుంచే పెద్ద చర్చకు దారి తీసిన సినిమా కూడా లేకపోవడం గమనార్హం.

ఇదే లెనిన్ మూవీకి ప్రధాన బలంగా మారే అవకాశముంది. ఇప్పటికే థియేటర్లలో మంచి ఆక్యుపెన్సీతో కొనసాగుతున్న ఆ చిత్రానికి మరో వీకెండ్ అదనంగా దక్కినట్లే. కొత్తగా వచ్చే చిత్రాలు ఎలాంటి ఎఫెక్ట్ చూపకపోతే ఫ్యామిలీ ఆడియన్స్, యువత మళ్లీ లెనిన్ నే ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పట్టణాలు, బీసీ సెంటర్లలో సినిమా ఇంకా బలంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు గుంటూరులో నిర్వహించిన సక్సెస్ మీట్‌ కు అభిమానులు భారీగా హాజరయ్యారు. సినిమా విడుదలై రోజులు గడుస్తున్నా ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గలేదనే అక్కడ వారిని చూస్తే అర్థమవుతుంది. సోషల్ మీడియాలో కూడా సినిమాకు సంబంధించిన చర్చ కొనసాగుతుండటం మూవీ టీమ్ కు ఊరటనిస్తోంది. అయితే ఇండస్ట్రీలో ఒక మాట తరచూ వినిపిస్తుంది. మంచి టాక్‌ తో వచ్చిన సినిమాకు పెద్ద పోటీ లేకపోతే అది మరికొన్ని వారాలు బలంగా నిలుస్తుందని. ప్రస్తుతం లెనిన్ కు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.

కొత్త సినిమాల నుంచి గట్టి సవాల్ లేకపోవడం, ఇప్పటికే ప్రేక్షకుల్లో గుర్తింపు సంపాదించుకోవడం వంటి అంశాలు లెనిన్ చిత్రానికి కలిసి వచ్చే అవకాశముంది. ఏదేమైనా వీకెండ్ లో బాక్సాఫీస్ వద్ద ఆ మూవీకి అనుకూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. చిన్న సినిమాలు తమదైన స్థాయిలో ప్రయత్నిస్తున్నప్పటికీ, ప్రేక్షకుల ఫస్ట్ సెలక్షన్ గా మాత్రం లెనిన్ కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఓపెన్ గ్రౌండ్ లెనిన్ దే.. చిన్న సినిమాలు నిజంగానే సైడ్ అయినట్లేనా? అనే చర్చ సాగుతోంది.