Begin typing your search above and press return to search.

నాగ్ సారూ.. ఈ సౌండ్ అస్సలు సరిపోదేమో..

ఇప్పటివరకు విడుదలైన టీజర్, కొన్ని పాటలు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాయి. ముఖ్యంగా అఖిల్‌ ను కొత్త యాంగిల్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నారని అభిమానులు భావిస్తున్నారు.

By:  M Prashanth   |   27 Jun 2026 8:50 AM IST
నాగ్ సారూ.. ఈ సౌండ్ అస్సలు సరిపోదేమో..
X

అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న లెనిన్ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నా.. ప్రస్తుతం ఆ చిత్రానికి కావాల్సిన స్థాయిలో ప్రమోషన్స్ జరగడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన సినిమా జూలై 10న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే రిలీజ్‌ కు చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉండగా.. ప్రమోషన్స్ మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

సినిమా ప్రారంభం నుంచి పలుమార్లు విడుదల తేదీలు మారడం ప్రేక్షకుల్లో కొంత సందేహాన్ని కలిగించింది. షూటింగ్, రీషూట్, క్వాలిటీ విషయంలో రాజీ పడకపోవడమే ఆలస్యానికి కారణమని ప్రచారం జరిగినా.. వరుస వాయిదాలు సినిమా మీద ప్రభావం చూపించాయనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే చిత్రబృందం మాత్రం ఫైనల్ అవుట్‌ పుట్‌ పై నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు విడుదలైన టీజర్, కొన్ని పాటలు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాయి. ముఖ్యంగా అఖిల్‌ ను కొత్త యాంగిల్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నారని అభిమానులు భావిస్తున్నారు. సంగీత దర్శకుడు తమన్ అందించిన పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయినప్పటికీ సినిమాను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే రేంజ్ లో ప్రమోషనల్ ఈవెంట్స్ కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి.

ఇలాంటి సమయంలో హీరో అఖిల్, నిర్మాత నాగవంశీ, దర్శకుడు మురళీకృష్ణ అబ్బూరు వరుసగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటే సినిమాకు మరింత బజ్ వచ్చే అవకాశం ఉందని చెప్పాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉన్న బజ్ మాత్రమే సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి సరిపోదు. మరోవైపు సినిమాలో సెకండాఫ్ ఒక స్టార్ హీరో అతిథి పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది.

అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు ప్రముఖ స్టార్ హీరో ముఖ్య అతిథిగా వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇలాంటి విషయాలపై క్లారిటీ ఇస్తూ ట్రైలర్ విడుదల చేస్తే సినిమాపై మరింత ఆసక్తి పెరిగే అవకాశముంది. గతంలో ఏజెంట్ ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో అఖిల్‌ కు లెనిన్ కీలకంగా మారింది. అందుకే కథ, నిర్మాణ విలువలతో పాటు ప్రమోషనల్ ప్లాన్ అదే స్థాయిలో ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది.

మంచి కంటెంట్ ఉన్న సినిమాకైనా ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడాలంటే సరైన ప్రమోషన్స్ కీలక పాత్ర పోషిస్తాయనేది పరిశ్రమలో వినిపించే మాట. ఈ నేపథ్యంలో నాగార్జున కూడా సినిమా ప్రమోషన్స్ పై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆకట్టుకునే ట్రైలర్, వరుస ఇంటర్వ్యూలు వంటి కార్యక్రమాలు వేగం పుంజుకుంటేనే విడుదలకు ముందు సినిమాకు అవసరమైన ఊపు వస్తుందని చెప్పాలి.

ఏదేమైనా లెనిల్ పై ఆసక్తి మాత్రం ఉంది. కానీ ఆ ఆసక్తి భారీ అంచనాలుగా మార్చే ప్రమోషన్స్ సందడి ఇప్పటికీ కనిపించడం లేదు. విడుదల సమయం దగ్గరపడుతున్న వేళ ప్రమోషన్స్‌ ను స్పీడప్ చేస్తేనే మంచి ఓపెనింగ్స్‌ వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఉన్న సౌండ్‌ తో కాకుండా, స్ట్రాంగ్ ప్రమోషన్స్ తో ముందుకొస్తేనే అఖిల్‌ కు లెనిల్ నిజమైన టర్నింగ్ పాయింట్‌ గా మారే అవకాశాలు మెరుగుపడతాయని టాక్ వినిపిస్తోంది.