Begin typing your search above and press return to search.

సినిమాలో అఖిల్ కనపడడు!- కింగ్ నాగార్జున

వేడుక‌లో నాగార్జున మాట్లాడుతూ...లెనిన్ కథను దర్శకుడు నందు (మురళి కిషోర్) తనకు మొదట వివరించినప్పుడు కలిగిన అనుభూతిని తెలిపారు.

By:  Sivaji Kontham   |   6 July 2026 9:12 AM IST
సినిమాలో అఖిల్ కనపడడు!- కింగ్ నాగార్జున
X

అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన తాజా చిత్రం `లెనిన్`. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ (చింటు) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ మాస్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా జూలై 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు తిరుపతిలో చిత్ర యూనిట్ అత్యంత వైభవంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కింగ్ నాగార్జున సినిమాపై అంచనాలను భారీగా పెంచేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వేడుక‌లో నాగార్జున మాట్లాడుతూ...లెనిన్ కథను దర్శకుడు నందు (మురళి కిషోర్) తనకు మొదట వివరించినప్పుడు కలిగిన అనుభూతిని తెలిపారు. ఈ కథ అంతా శ్రీరామపురం అనే ఊరి నేపథ్యంలో సాగుతుందని, విశేషం ఏమిటంటే తన తండ్రి, దివంగత అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా శ్రీరామపురం అనే గ్రామంలోనే జన్మించారని గుర్తుచేసుకున్నారు. అయితే చిత్తూరులో శ్రీ‌రామ‌పురం వేరే అని వెల్ల‌డించారు. నందు చెప్పిన స్క్రిప్ట్ లోని ప్రతి పాత్రలో రకరకాల కోణాలు ఉన్నాయని, ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే విస్మయపరిచే ట్విస్టులను ప్రేక్షకులు ఎవ్వరూ ఊహించలేరని నాగార్జున కథా బలంపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

సినిమాలోని ప్రధాన ఇతివృత్తాన్ని వివరిస్తూ.. చరిత్రలో ప్రేమ కోసం రాజ్యాలు కూలిపోయాయి.. ఎన్నో యుద్ధాలు జరిగాయి.. ఈ చిత్రంలోనూ అలాంటి ఒక బలమైన ప్రేమకథే యుద్ధానికి దారితీసిందని పేర్కొన్నారు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె పోషించిన `భారతి` పాత్ర కోసం ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చని, త‌న‌ క్యారెక్టర్ ఈ సినిమాకు హార్ట్ బీట్ లాంటిదని కొనియాడారు. ఈ కథ రాయలసీమ మట్టి కథ అని... సీమలో ఉన్న మనుషుల భావోద్వేగాల కథ అని చెబుతూ.. ఇది సీమలో జరుగుతున్న ఒక `మహాభారతం` అంటూ సినిమా కాన్సెప్ట్‌ను అభివర్ణించారు.

అయితే మొదట్లో అఖిల్ ఈ సినిమా చేస్తున్నాడనగానే తానూ ఎంతో కంగారు పడ్డానని నాగార్జున నిజాయితీగా అంగీకరించారు. అఖిల్ ఇప్పటివరకు అన్నీ అర్బన్ (సిటీ) బ్యాక్‌డ్రాప్ కథలే చేశాడని, మరి ఈ రా అండ్ రూస్టెడ్ సీమ మట్టి కథకు సూట్ అవుతాడా? బాగా చేయగలుగుతాడా? అని ఒక తండ్రిగా భయపడినట్లు తెలిపారు. కానీ సినిమా చూశాక తాను మాత్రమే కాదు.. చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారని అన్నారు. అఖిల్ ఈ పాత్రలో పూర్తిగా లీనమైపోయాడని... వెండితెరపై ఎక్కడా అఖిల్ అక్కినేని కనిపించడని... కేవలం `లెనిన్` మాత్రమే కనిపిస్తాడని ప్రశంసించారు. థియేటర్లలో ప్రేక్షకులు లెనిన్ పగను, అతని ప్రేమను కూడా ఎంతగానో ప్రేమిస్తారని.. సినిమా అయిపోయాక లెనిన్‌ను తమ గుండెల్లో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్తారని ధీమాను వ్య‌క్తం చేసారు.

ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన శివాజీ, బ్రహ్మాజీ, సునీల్ వంటి నటులు సినిమాపై ఉన్న ప్రేమతో ఎంతో కష్టపడి పనిచేశారని నాగార్జున అభినందించారు. అలాగే తమన్ అందించిన అద్భుతమైన మ్యూజిక్, నవీన్ ఎడిటింగ్, బ్రిట్టో కెమెరా వర్క్ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయన్నారు. నిర్మాత నాగవంశీ (చింటు)కి మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలుసని.. ఈ మూవీపై ఉన్న నమ్మకంతోనే ఏపీ అంతటా ఆయనే స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని నవ్వుతూ చెప్పారు. చివరగా- ``మనందరికీ ఆ దేవుడు వేంకటేశ్వర స్వామి.. కానీ నాన్నగారు ఎప్పుడూ చెప్పేవారు.. మనకు అసలైన దేవుళ్లు ప్రేక్షక దేవుళ్లేనని.. ఆ ప్రేక్షక దేవుళ్ల సాక్షిగా చెబుతున్నాను.. జూలై 10న థియేటర్లలోకి వస్తున్నాం.. మనవాడు గట్టిగా కొడుతున్నాడు!`` అంటూ అఖిల్ కెరీర్‌లోనే ఇదొక సాలిడ్ హిట్ అవుతుందనే ధీమాతో నాగార్జున తన ప్రసంగాన్ని ముగించారు.