పిక్‌టాక్ : అఖిల్ జీవితంలోని అత్యుత్తమ రోజు..!
అక్కినేని అఖిల్ ఇటీవలే ఒక ఇంటి వాడు అయ్యాడు. చాలా కాలంగా ఆయన ప్రేమిస్తున్న అమ్మాయి జైనాబ్‌ను వివాహం చేసుకున్నాడు.
By: Tupaki Desk | 28 Jun 2025 11:39 AM ISTఅక్కినేని అఖిల్ ఇటీవలే ఒక ఇంటి వాడు అయ్యాడు. చాలా కాలంగా ఆయన ప్రేమిస్తున్న అమ్మాయి జైనాబ్‌ను వివాహం చేసుకున్నాడు. అఖిల్ కంటే జైనాబ్ వయసులో పెద్ద కావడంతో ఆ మధ్య ప్రముఖంగా చర్చ జరిగింది. ఇద్దరి వయసు గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. అయితే పెళ్లి తర్వాత వాటన్నింటికి తెర పడింది. ఇద్దరి జోడీ చాలా బాగుంది అంటూ చాలా మంది ప్రశంసిస్తూ కామెంట్స్ చేశారు. పెళ్లి సమయంలోనే చాలా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లి తంతు అంతా ముగించుకుని, రిసెప్షన్ కార్యక్రమాలు అన్నింటిని కూడా ముగించుకున్న అఖిల్, జైనాబ్ తాజాగా తమ పెళ్లి ఫోటోలను కొన్నింటిని షేర్ చేశారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో అఖిల్ నా జీవితంలోని అత్యుత్తమ రోజు నుండి కొన్ని క్షణాలను పంచుకోవాలని నా హృదయం భావించింది అంటూ ఫోటోలను షేర్ చేశాడు. ఆ ఫోటోలకు తన భార్య జైనాబ్‌ను సైతం ట్యాగ్ చేశాడు. ఇద్దరూ ఈ ఫోటోలను షేర్ చేయడం జరిగింది. పెళ్లి తంతుకు సంబంధించిన ఫోటోలు గతంలోనే చాలానే సోషల్ మీడియా ద్వారా వచ్చాయి. అయితే ఇప్పుడు వచ్చిన ఫోటోలు మాత్రం చాలా స్పెషల్‌గా ఉన్నాయి. ఇంతకు ముందు రాని ఫోటోలను ఇప్పుడు షేర్ చేశారు. దాంతో అఖిల్ షేర్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల లైక్స్ నమోదు అయ్యాయి. అఖిల్, జైనాబ్‌లు సాంప్రదాయ పెళ్లి దుస్తుల్లో చాలా అందంగా ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
అఖిల్ పెళ్లి తర్వాత కొత్త కెరీర్‌ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. తప్పకుండా అఖిల్‌కి పెళ్లి లక్‌ను తీసుకు వస్తుంది, జైనాబ్ వల్ల అఖిల్ మొదటి కమర్షియల్ హిట్‌ను అందుకోబోతున్నాడని, అంతే కాకుండా అఖిల్‌కు మొదటి వంద కోట్ల సినిమా పడబోతుందని కూడా అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. జైన్ 6న, 2025న పెళ్లి చేసుకున్న వీరిద్దరు తిరిగి వారి వారి పనులతో బిజీ అయ్యారు. కొత్త సంసార జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే మరో వైపు సినిమా పనుల్లోనూ అఖిల్ బిజీగా ఉన్నాడు. మరో వైపు జైనాబ్ కూడా తన ఆర్ట్ వర్క్, బిజినెస్ పనులతో బిజీ అయిందని అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా సమాచారం అందుతోంది.
'లెనిన్' సినిమాతో అఖిల్ అక్కినేని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో నాగార్జున సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్న లెనిన్ సినిమాలో అఖిల్ లుక్ రివీల్ చేశారు. అఖిల్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన టీజర్‌కి మంచి స్పందన దక్కింది. పల్లెటూరు నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది అనే విశ్వాసంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ ఏడాదిలో అక్కినేని ఫ్యాన్స్‌కు లెనిన్‌తో హిట్ పడేనా చూడాలి.
