అఖిల్ తర్వాత శతాధిక చిత్రాల హీరో వారసుడు గట్టెక్కుతాడా?
టాలీవుడ్ లో నటవారసులకు అవకాశాలు సులువుగానే లభించినా.. తమను తాము నిరూపించుకుని ప్రేక్షకుల ఆదరణ పొందడం ఎప్పుడూ ఒక పెద్ద సవాలే.
By: Sivaji Kontham | 30 Aug 2026 8:30 AM ISTటాలీవుడ్ లో నటవారసులకు అవకాశాలు సులువుగానే లభించినా.. తమను తాము నిరూపించుకుని ప్రేక్షకుల ఆదరణ పొందడం ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. ఎన్నో ఆశలతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని కెరీర్ ప్రారంభంలో ఎదురైన వరుస పరాజయాల తర్వాత నెమ్మదిగా ఫ్లాపుల బాట నుంచి విజయం వైపు అడుగులు వేశారు. ఇటీవలే వచ్చిన `లెనిన్` చిత్రం అతడికి బాక్సాఫీస్ వద్ద ఎంతో సంతృప్తికరమైన ఫలితాన్ని అందించింది. ఇలాంటి ఒక సాలిడ్ హిట్ కోసం అక్కినేని యువహీరో ఎంతగానో వేచి చూశారు. ఈ ఉత్సాహంతోనే మునుముందు మరింత పట్టుదలగా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్‌ను సరైన దారిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదే క్రమంలో మరో నటవారసుడు, హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేకా కూడా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి గట్టిగానే శ్రమిస్తున్నారు. శతాధిక చిత్ర కథానాయకుడి కొడుకుగా ఎంట్రీ ఇచ్చినా రోషన్ కి ఏదీ సులువుగా సాగడం లేదు. ఇప్పటివరకు చేసింది ఒకటి రెండు సినిమాలే కనుక.. ఆరంగేట్ర కిడ్ గా అతడు తన నటప్రతిభను నిరూపించుకోవడానికి తనకు ఇంకా బోలెడన్ని మంచి అవకాశాలు ఉన్నాయి. తొలి, మలి సినిమాలు చేసే సమయంలో స్క్రిప్ట్‌ల ఎంపిక.... దర్శకుల ఎంపిక పరంగా జరిగిన పొరపాట్లేంటో గ్రహించిన రోషన్ ఇప్పుడు తన రూట్ మార్చి యువ దర్శకులతో రొమాంటిక్ లవ్ స్టోరీలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు.
అయితే అఖిల్ తరహాలోనే ఈ యంగ్ హీరో కూడా బాక్సాఫీస్ వద్ద ఒక పెద్ద కమర్షియల్ హిట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈసారి రోషన్ గనక హిట్ కొడితే అది `సయ్యారా` రేంజ్‌లో భారీ బ్లాక్‌బస్టర్ కావాలని మెగా - శ్రీకాంత్ అభిమానులు ఎంతో ఆశగా ఆకాంక్షిస్తున్నారు. పరిశ్రమలో స్టార్ కిడ్స్ అనే ముద్ర ఉన్నా కానీ... ప్రేక్షకుల మనసు గెలవాలంటే నటవారసులు తీవ్రమైన ఒత్తిడిని.. అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. అఖిల్, రోషన్ లాంటి యంగ్ హీరోలు ఈ ఒత్తిడిని ఒక సవాల్‌గా తీసుకుని ముందుకు సాగితేనే సుదీర్ఘ కాలం నిలబడగలుగుతారు. ముళ్లబాటలో ప్రయాణించినప్పుడే విజయమనే స్వర్గానికి దారులు తెరుచుకుంటాయనే నిజం గ్రహించి వారు అడుగులు వేస్తున్నారు.
ప్రస్తుతం రోషన్ మేకా - టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్‌లో వస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం `ఏమో ఏమో ఇది`. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకోవడం విశేషం. సెప్టెంబర్ 7 నుండి ప్రారంభమయ్యే 12 రోజుల ఆఖరి షెడ్యూల్‌తో టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేయడానికి చిత్ర బృందం సమాయత్తమవుతోంది. సెప్టెంబర్ నెలాఖరు నాటికి చిత్రీకరణ పూర్తవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
ఈ సుదీర్ఘమైన చివరి షెడ్యూల్ ముగిసి.. పోస్ట్-ప్రొడక్షన్ పనులన్నీ శరవేగంగా పూర్తయిన తర్వాత మేకర్స్ అధికారికంగా సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. శైలేష్ కొలను మేకింగ్ శైలి, రోషన్ మేకా రొమాంటిక్ ఇమేజ్ కలగలిసి వస్తున్న ఈ చిత్రం రోషన్ కెరీర్‌కు కచ్చితంగా ఒక పెద్ద టర్నింగ్ పాయింట్‌గా మారుతుందనే నమ్మకంతో యూనిట్ ఉంది. రోషన్ కి అప్పియరెన్స్ సమస్య కాదు.. ప్రతిభ తక్కువ కాదు.. సరైన స్క్రిప్టు ఎంపిక, సరైన దర్శకనిర్మాతల ఎంపిక ఈ యువహీరో విజయాన్ని ఖాయం చేస్తుంది. ఇప్పుడు రోషన్ అలాంటి దారిలోనే ఉన్నాడని అభిమానులు భావిస్తున్నారు.
