స్టార్ డైరెక్టరా.. యంగ్ టాలెంటా? అఖిల్ నెక్స్ట్ ఎటు?
'లెనిన్' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మంచి రిజల్ట్ దొరకడంతో అక్కినేని అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద అందరి ఫోకస్ పడింది.
By: M Prashanth | 14 Aug 2026 12:00 AM IST'లెనిన్' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మంచి రిజల్ట్ దొరకడంతో అక్కినేని అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద అందరి ఫోకస్ పడింది. ప్రస్తుతం కొన్ని కథలు వింటున్న ఈ హీరో నెక్స్ట్ ఎలాంటి అడుగు వేస్తాడనేది ఫిల్మ్ సర్కిల్స్ లో ఆసక్తిగా మారింది. మళ్లీ పేరున్న సీనియర్ దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడా, లేక లెనిన్ రిజల్ట్ తో వచ్చిన నమ్మకంతో కొత్త తరం దర్శకుడితోనే ముందుకు వెళ్తాడా అనేది ఇప్పుడు మెయిన్ పాయింట్.
అఖిల్ కెరీర్ గ్రాఫ్ ఒకసారి గమనిస్తే ఎక్కువగా దర్శకుల విషయంలో పెద్ద పేర్లనే నమ్ముకుంటూ వచ్చాడు. మొదటి సినిమాను ఏకంగా వీవీ వినాయక్ చేతిలో పెట్టగా, రెండో సినిమా 'హలో' కోసం విక్రమ్ కె కుమార్‌తో పనిచేశాడు. అప్పటికే ఈ ఇద్దరు దర్శకులకు ఇండస్ట్రీలో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఆ తర్వాత మూడో ప్రాజెక్ట్ 'మిస్టర్ మజ్ను' టైమ్ కి మాత్రం అప్పుడే తొలిప్రేమతో హిట్ కొట్టిన వెంకీ అట్లూరికి అవకాశం ఇచ్చాడు.
అక్కడి నుంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కోసం బొమ్మరిల్లు భాస్కర్‌ను ఎంచుకున్నాడు. ఆ సినిమా రిజల్ట్ బాక్సాఫీస్ దగ్గర బాగానే వర్కౌట్ అయింది. కానీ ఆ వెంటనే మళ్లీ స్టార్ డైరెక్టర్ అంటూ సురేందర్ రెడ్డితో ఏజెంట్ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. లుక్ పరంగా, యాక్షన్ పరంగా ఎన్నో ప్రయోగాలు చేసినా ఆ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. కెరీర్ లో అత్యధిక అంచనాలతో వచ్చిన ఆ ప్రాజెక్ట్ భారీ నిరాశను మిగిల్చింది.
ఏజెంట్ ఇచ్చిన ఆ చేదు అనుభవం తర్వాత లెనిన్ కోసం ఎంచుకున్న దారి పూర్తిగా డిఫరెంట్ గా ఉంది. అప్పటికి కేవలం వినరో భాగ్యము విష్ణు కథ మూవీ మాత్రమే చేసిన మురళీ కిషోర్ అబ్బూరు చెప్పిన కథను నమ్మాడు. దర్శకుడి ఇమేజ్ కంటే స్క్రిప్ట్ కే ఫస్ట్ ఓటు వేశాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన లెనిన్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవ్వడంతో ఈ డెసిషన్ అఖిల్ కు బాగా కలిసి వచ్చింది.
సరిగ్గా ఇక్కడే అక్కినేని ఫ్యాన్స్ లో కొత్త క్వశ్చన్ రైజ్ అవుతోంది. చేతిలో ఒక హిట్ ఉంది కాబట్టి ఆ ఇమేజ్ ను డబుల్ చేయడానికి ఎవరైనా ఎక్స్ పీరియన్స్ ఉన్న డైరెక్టర్ ను సెట్ చేసుకుంటాడా అనేది ఒక పాయింట్. లేదు కంటెంట్ కే కట్టుబడి మళ్లీ ఎవరైనా యంగ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అనేది ఇంకో పాయింట్. ట్రాక్ రికార్డ్ చూస్తే ఒకే ప్యాటర్న్ ఎప్పుడూ ఫాలో అవ్వలేదు కాబట్టి ఫలానా రూట్ లోనే వెళ్తాడని కచ్చితంగా చెప్పలేం.
అయితే ఏజెంట్ ఫెయిల్యూర్, లెనిన్ సక్సెస్ లను పక్కపక్కన పెట్టి చూస్తే ఒక లాజిక్ క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ దర్శకుడి పేరు ఎంత పెద్దది అనే దానికంటే, యాక్టర్ కు ఎంతవరకు సెట్ అయ్యే కథ దొరికింది అనేదే అసలైన మేటర్. ప్రస్తుతం వింటున్న కథల్లో అఖిల్ దేనికి ఓటు వేస్తాడు, ఆ ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేసేది కొత్త టాలెంటా లేక సీనియర్ డైరెక్టరా అనేది త్వరలోనే తేలిపోతుంది.
