మెథడ్ యాక్టింగ్ అంటే ఏమిటి? అఖిల్ అక్కినేని విశ్లేషణ!
నటుడిగా 10 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం చేసాడు అక్కినేని అఖిల్. అంతకుముందు అతడు నటనలో శిక్షణ కూడా తీసుకున్నారు.
By: Sivaji Kontham | 31 July 2026 9:08 AM ISTనటుడిగా 10 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం చేసాడు అక్కినేని అఖిల్. అంతకుముందు అతడు నటనలో శిక్షణ కూడా తీసుకున్నారు. నటశిక్షణలో రకరకాల పద్ధతులు ఉన్నాయి. అందులో మెదడ్ యాక్టింగ్ అనేదానిపై అఖిల్ కి పట్టుంది. ''నటన అనేది కేవలం డైలాగులు చెప్పడం లేదా హావభావాలు ప్రకటించడం మాత్రమే కాదు.. అది శరీరం-మనస్సు కలయికతో కూడిన ఒక శాస్త్రీయ ప్రక్రియ'' అని యువనటుడు అఖిల్ అక్కినేని వివరించారు. థియేటర్ ఆర్ట్స్ -యాక్టింగ్ స్కూళ్లలో బోధించే `మెథడ్ యాక్టింగ్` లో భాగంగా 'సెన్స్ ఆఫ్ మెమరీ' ప్రక్రియ ఏ విధంగా పనిచేస్తుందో ఆయన స్పష్టంగా విశ్లేషించారు. నటుడికి తన శరీరమే ఒక ప్రధాన సాధనమని.. క్యారెక్టర్‌లోకి పరకాయ ప్రవేశం చేయడానికి ముందు శరీరాన్ని సమాయత్తం చేసుకోవడం ఎంతో కీలకమని అఖిల్ సంభాషణ ద్వారా ఔత్సాహిక నటీనటులు నేర్చుకోవచ్చు.
ఈ ప్రక్రియలో ప్రధానంగా నటులు తమ దృష్టిని శరీరంపై లగ్నం చేస్తారు. సైలెంట్ గా ఒక కుర్చీలో కూర్చుని.. కళ్లు మూసుకుని.. కాలి వేళ్ల నుండి తల వరకు ప్రతి అవయవాన్ని మనస్సుతో అనుభూతి చెందడం దీని ప్రత్యేకత. శరీరంలో ఎక్కడైనా అలసట లేదా నొప్పి ఉంటే... దాన్ని గుర్తించి రిలాక్స్ చేస్తూ శ్వాస ద్వారా `హా...` అనే శబ్దాన్ని బయటకు విడుదల చేస్తారు. ఇది కేవలం శారీరక వ్యాయామం కాదని.. మానసిక ఒత్తిడిని తొలగించి శరీరాన్ని స్వేచ్ఛగా మార్చే అంతర్గత ప్రక్రియ అని అఖిల్ విశ్లేషించారు.
చివరగా... ఈ మెథడ్ యాక్టింగ్ ముఖ్య ఉద్దేశం నాడీ వ్యవస్థపై... శరీరంలోని ప్రతీ కండరం పై సంపూర్ణ నియంత్రణ సాధించడమే. 60 మంది విద్యార్థులు ఒకేసారి ఎలాంటి భౌతిక స్పర్శ లేకుండా లోపలి నుంచే తమ శరీరాన్ని రిలాక్స్ చేసుకునే ప్రాక్టీస్ చేయడం ద్వారా నటనలో సహజత్వం వస్తుందని అతడు తెలిపారు. శరీరంపై పూర్తి అదుపు లభించినప్పుడే ఒక నటుడు ఏ పాత్రలోనైనా జీవించడానికి ... ఆ సన్నివేశానికి తగిన భావోద్వేగాలను పండించడానికి సిద్ధంగా ఉంటాడని అఖిల్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
మానవ సంబంధాలు- వ్యక్తిగత హద్దులపై విశ్లేషణ
ఇటీవల అఖిల్ అక్కినేని ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో మానవ సంబంధాలు, ఎదుటివారిని నమ్మడం ..వ్యక్తిగత మానసిక ప్రశాంతతను కాపాడుకోవడంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోజువారీ జీవితంలో మనం కొత్త వ్యక్తులను కలిసినప్పుడు లేదా పాత మిత్రులతో సంబంధాలను కొనసాగించే క్రమంలో ఎదురయ్యే భావోద్వేగ సవాళ్లను చాలా ఆచరణాత్మక దృక్పథంతో అఖిల్ వివరించారు. ఈ ఆధునిక యుగంలో ప్రతి సంబంధాన్ని ఎంతవరకు స్వీకరించాలి? ఎక్కడ హద్దులు గీయాలో చెప్పడమే ఈ చర్చలో ముఖ్య సారాంశం.
అఖిల్ మాటల్లోని ప్రధానమైన విశ్లేషణ ఏమిటంటే.. మన జీవితంలో అందరినీ ఒకేలా చూడలేం. నా అత్యంత ఆప్తులు కేవలం ఐదారుగురు మాత్రమే ఉంటారని... వాళ్లే తన ఆత్మ వంటి వారని ఆయన పేర్కొన్నారు. మిగతా సంబంధాలన్నీ కాలంతో పాటు...వారి వారి అవసరాల ప్రాతిపదికన మారవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరి ప్రవర్తనను లేదా సంబంధాన్ని అతిగా సీరియస్‌గా తీసుకోకూడదు. ఎదుటివారి ప్రవర్తన మన మనశ్శాంతిని దెబ్బతీయకుండా చూసుకోవడమే నిజమైన మానసిక పరిపక్వత.
చివరగా .. ''బయటి వ్యక్తి నిన్ను ప్రభావితం చేయకుండా చూసుకో'' అని అఖిల్ ఇచ్చిన సందేశం నేటి యువతకు చాలా అవసరం. మన అవయవాలైన గుండె, కిడ్నీల లాగా మనకు అత్యంత సన్నిహితమైన అతికొద్ది మందిని కాపాడుకుంటూ ముందుకు సాగాలి. పరిమితులు లేని నమ్మకం తరచుగా గాయాలకే దారితీస్తుంది కాబట్టి మన కోర్ ని సురక్షితంగా ఉంచుకుంటూ... ఇతరులతో పరిమితమైన అంచనాలతో సాగడమే సంతోషకరమైన జీవితానికి మార్గమని ఈ పాడ్ కాస్ట్ సంభాషణలో అఖిల్ స్పష్టం చేసారు.
